టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవాడలోకి ప్రవేశించనుంది.. అయితే, లోకేష్‌పై మాటల యుద్ధానికి దిగారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. లోకేష్ కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. పాదయాత్ర చేసినా, పాకుడు యాత్ర చేసినా, పొర్లు దండాలు పెట్టినా.. లోకేష్ మాత్రం ఎమ్మెల్యేగా గెలవలేడు అంటూ జోస్యం చెప్పారు.. దమ్ము ధైర్యం ఉంటే లోకేష్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించాలని సవాల్ చేసిన ఆయన.. లోకేష్ గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని ప్రకటించారు.. ఇక, లోకేష్ ను మేం అడ్డుకుంటే ఇన్ని రోజులు పాదయాత్ర చేసి ఉండేవాడా? అని ప్రశ్నించారు.. పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో లోకేష్ చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. విజయవాడ నగరానికి చంద్రబాబు, లోకేష్ ఏం చేశారో చెప్పగలరా? అని నిలదీశారు.
కృష్ణ వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల కోసం చంద్రబాబు రిటైనింగ్ వాళ్లు ఎందుకు కట్టలేకపోయాడు? అని ప్రశ్నించారు వెల్లంపల్లి.. 500 కోట్ల రూపాయలు పెట్టి సీఎం వైఎస్ జగన్ రిటైనింగ్ నిర్మించి చుక్క నీరు ఇళ్లల్లోకి వెళ్లకుండా చేశారని తెలిపారు. కనకదుర్గ ఫ్లైఓవర్ ను పూర్తి చేసింది ఎవరు? విజయవాడ ఫ్లై ఓవర్ ను ప్రారంభించి పూర్తి చేసిన ఘనత సీఎం జగన్‌దే అన్నారు. ఇక్కడ అడుగు పెట్టే ముందు మా హయాంలో విజయవాడ నగరాన్ని నిర్లక్ష్యం చేశాం.. తప్పు అయిపోయిందని చెప్పి రావాలి అంటూ లోకేష్‌కి సూచించారు. మరోవైపు.. లోకేష్ ను అడ్డు కోవాల్సిన అవసరం మాకు లేదని.. మేం టైం వేసుకుంటామా? అని ఎదురు ప్రశ్నించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్.
ఇక, లోకేష్ ఈవినింగ్ వాక్ చేస్తున్నాడు అంటూ సెటైర్లు వేశారు విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్.. ఎందుకూ పనికి రాని బఫూన్ నాయకులు జగన్ గురించి మాట్లాడుతున్నారు.. జగన్ చేసిన అభివృద్ధిని లోకేష్ తిరిగి తెలుసుకోవాలని సూచించారు. ఒక సామాన్య కార్యకర్త అయిన మా ఇంటికి సీఎం వచ్చినా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మరోవైపు.. విజయవాడలో అడుగు పెట్టే ముందు లోకేష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. మా హయాంలో ఏమీ చేయలేక పోయాం అని లెంపలేసుకోవాలన్న ఆయన.. ప్రకాశం బ్యారేజి దగ్గరకు రాగానే క్షుద్ర పూజలు చేసినందుకు అమ్మవారికి క్షమాపణలు చెప్పాలన్నారు. తమ హయాంలో విజయవాడ నగరానికి ఏమీ చేయనందుకు గుంజీలు తీయాలి.. విజయవాడ పేరు కూడా లేకుండా చేయాలని చూశారంటూ మండిపడ్డారు. చంద్రబాబు మూడేళ్ల పాలనలో విజయవాడ నగరంలో లక్ష మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన చరిత్ర ఉందా? ఈ నాలుగేళ్లలో విజయవాడ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. జాకీలు పెట్టి లేపితే కాని యువగళం రోడ్డు మీదకు రాదంటూ ఎద్దేవా చేశారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.