తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుండి రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు టీజీ అని రిజిస్ట్రేషన్ అవుతుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాహనాలన్నీ.. ఏపీ అని ఉంటే టీజీ అని మార్చుకున్న సందర్భం ఉందని పేర్కొన్నారు. జూన్ 2న రాష్ట్రం విడిపోయే సమయంలో టీజీ అని గెజిట్ ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Read Also: Pawan kalyan: ఎంపీగా.. ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ పోటీ..! క్లారిటీ ఇచ్చిన జనసేనాని
టీజీని విమర్శించే వాళ్ళు.. ముందు టీఎస్ ఎందుకు పెట్టారో చెప్పండని మంత్రి ప్రశ్నించారు. ఆ తర్వాత టీజీ ఎందుకు మారిందో చెబుతామన్నారు. ఉద్యమ సమయంలో ప్రజలు తీసుకున్న ఆకాంక్షలను గౌరవిస్తూ టీజీగా మార్చినట్లు మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఈ మధ్య జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని.. ఎక్కువగా ప్రయాణం చేసే డ్రైవర్లకు మరోసారి ఫిట్ నెస్ టెస్టులు చేస్తామని మంత్రి తెలిపారు.
Read Also: Japan on High Alert: పిల్లి కారణంగా ఈ జపాన్ నగరంలో హై అలర్ట్… అసలు విషయమేమిటంటే?
ఇదిలా ఉంటే.. మంగళవారం కేంద్ర రహదారి రవాణాశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41(6) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి 1989 జూన్ 12న అప్పటి ఉపరితల రవాణా శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో ఈ మార్పు చేసినట్లు పేర్కొంది. ఆ నోటిఫికేషన్‌లోని టేబుల్‌లో సీరియల్ నంబర్ 29ఏ కింద తెలంగాణ రాష్ట్రానికి ఇది వరకు ఉన్న టీఎస్ స్థానంలో ఇప్పుడు టీజీ మార్క్ కేటాయించినట్లు తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్ మార్క్‌లో మార్పు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం తమ పార్టీ అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతో టీజీని కాదని టీఎస్‌గా నిర్ణయించిందని దానిని మార్చాలని తెలంగాణ కేబినేట్ తీర్మానం చేసింది. ఇకపై రిజిస్టర్ అయ్యే వాహనాల మార్క్ టీజీగా మారనుంది.