Vande Bharat: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ రోజు ఉదయం వత్వా స్టేషన్ – మణి నగర్ మధ్య ఈ రైలు ప్రమాదానికి గురైంది. రైలు పట్టాలపైకి వచ్చిన గేదెలను ఇంజిన్ ఢీకొట్టింది. దీంతో రైలు ముందు భాగం పాక్షికంగా ధ్వంసమైంది. మైలేజీ పెరగాలంటే, వాహనం బరువు తక్కువ ఉండాలన్న కాన్సెప్ట్ తో వస్తున్న కార్లు చాలా డెలికేట్‌గా తయారవుతున్నాయి. ఆఖరికి రైళ్ల విషయంలో కూడా ఇలాంటి ప్రయోగాలే చేస్తున్నట్టు అనిపిస్తోంది. గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లో డొల్లతనం బయటపడింది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ రైళ్ల సరీస్‌లో భాగంగా మూడో రైలును గాంధీ నగర్ – ముంబై సెంట్రల్ మధ్య సెప్టెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రారంభించి వారం రోజులు గడవక ముందే ఇలాంటి ప్రమాదం బారిన పడటం చర్చనీయాంశంగా మారింది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ముంబై సెంట్రల్ నుంచి గాంధీనగర్ వెళ్తుండగా గురువారం (అక్టోబర్ 6) ఉదయం 11.15గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గుజరాత్‌లోని బట్వా, మనినగర్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, రైలును బాగు చేసి గమ్య స్థానానికి చేర్చామని పశ్చిమ రైల్వే జోన్ అధికారులు తెలిపారు. గంటకు 180 కి.మీ. వేగంతో ప్రయాణించడం వందే భారత్ రైళ్ల ప్రత్యేకత. వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా ఇలాంటివి 400 రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2019లో ఢిల్లీ – వారణాసి మధ్య తొలి రైలును ప్రారంభించారు.
Read Also: Eknath-Shinde: షిండే కు మద్దతు ప్రకటించిన జయదేవ్ థాక్రే.. షాక్ లో ఉద్ధవ్ థాక్రే
విచిత్రం ఏంటంటే.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లో ప్రమాదాలను నివారించే కవచ్ టెక్నాలజీ ఉంది. ఎదురెదురుగా రెండు రైళ్లు వస్తే అవి ఢీకొట్టకుండా దేశీయంగా తయారు చేసిన టెక్నాలజీయే కవచ్. అయితే ఇది కేవలం రైళ్లకే కానీ, పట్టాలపై ఏదైనా అడ్డుగా ఉంటే ఉపయోగపడదని తేలిపోయింది. మేకిన్ ఇండియా గురించి గొప్పగా చెప్పుకుంటున్న కేంద్రం, వందే భారత్ ఎక్స్ ప్రెస్ విషయంలో కూడా భారీగా ప్రచారం చేసుకుంది. ప్రధాని మోదీ కలల ప్రాజెక్ట్ అని.. ఆ తర్వాత ఇక బుల్లెట్ ట్రైన్‌ని రంగంలోకి దింపడమేనన్నారు బీజేపీ నేతలు. ఇప్పుడు వందే భారత్‌కే ఇలా బ్రేక్ పడింది.