Eknath-Shinde: మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా తన సోదరుడు జయదేవ్ థాకరే షిండేకు పూర్తి మద్దతు ప్రకటించారు. శివసేనలోని ఉద్ధవ్ థాక్రే, సీఎం షిండే వర్గాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటికి దసరా ర్యాలీలు వేదికలుగా నిలిచాయి. శివాజీ పార్కులో ఏర్పాటు చేసిన సమావేశం వేదికగా సీఎం షిండేపై ఉద్ధవ్ థాక్రే విరుచుకు పడ్డారు. ఆయనను ఉద్దేశించి ఉద్ధవ్ థాక్రే రావణుడు కాలిపోతాడంటూ వ్యాఖ్యానించారు. పార్టీకి కొడుకే వారసుడిగా ఉండాల్సిన అవసరం లేదంటూ అంతకు ముందు ఏక్ నాథ్ షిండే వ్యాఖ్యలు చేశారు.
శివసేన రెండు వర్గాల మధ్య తీవ్రపోటీ నెలకొన్న తరుణంలో ఉద్దవ్ వర్గానికి ఎదురు దెబ్బ తగిలింది. షిండే వర్గానికి తన మద్దతు ఉంటుందని ఉద్దవ్ సోదరుడు జయదేవ్ థాక్రే వెల్లడించారు. ఈ మేరకు షిండే వర్గం నిర్వహిస్తున్న దసరా ర్యాలీలో ఆయన స్పష్టం చేశారు. ‘ మీరు షిండే వర్గంలో ఉన్నారా? అని గత ఐదారు రోజులుగా అడుగుతున్నారని… థాకరేలు ఏ వర్గంలోనూ ఉండరని చెప్పారు. షిండే వేస్తున్న అడుగులు తనకు నచ్చాయని… అందుకే తాను షిండే వద్దకు వచ్చానని ఆయన అన్నారు.
ఏక్ నాథ్ షిండేను ఒంటరిగా వదిలేయకూడదని… అందరూ ఆయనకు మద్దతుగా నిలవాలని జయదేవ్ థాకరే చెప్పారు. పేదలు, రైతుల కోసం షిండే పని చేస్తున్నారని కితాబిచ్చారు. తమ రైతుల మాదిరే షిండే కూడా చాలా కష్టపడి పని చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ షిండే ప్రభుత్వమే రావాలనేది తన ఆకాంక్ష అని అన్నారు. ఎన్నికలు రావాలని, మళ్లీ షిండే అధికారాన్ని చేపట్టాలని కోరుకుంటున్నానని చెప్పారు. తన పూర్తి మద్దతు షిండేకే అని తెలిపారు.