తిరుమలలో వైకుంఠ ఏకాదశికి టీటీడీ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 2025 జనవరి 10 నుంచి 19 వరకు ఉత్తర ద్వార దర్శనాలకు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ.. పలు నిర్ణయాలు తీసుకున్నారు. 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. టోకెన్లు లేని భక్తులను క్యూ లైన్లోనికి అనుమతించరు. అలానే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా.. వీఐపీ బ్రేక్ దర్శనాలను 10 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవని టీటీడీ అధికారులు తెలిపారు. చంటిబిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్‌ఆర్‌ఐ తదితరుల విశేష దర్శనాలను కూడా రద్దు చేశారు. మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ ఛైర్మన్లకు వైకుంఠ ఏకాదశి రోజున అనుమతి ఉండదు. భారీ క్యూలైన్లు నివారించి.. గరిష్ఠ సంఖ్యలో భక్తులకు వైకుంఠద్వార దర్శనాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే తిరుపతి స్ధానికుల కోటా విడుదలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు.