Uttam Kumar Reddy : తెలంగాణలో కేబినెట్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆశావహుల జాబితాను కాంగ్రెస్ హైకమాండ్‌కు పంపినట్లు సమాచారం. హైకమాండ్ పరిశీలన అనంతరం తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ప్రత్యేకంగా కలుసుకుని మంత్రివర్గ విస్తరణపై అధికారికంగా సమాచారం అందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా వచ్చే నెల 3వ తేదీన నలుగురు కొత్త మంత్రులు కేబినెట్‌లో చేరే అవకాశముందని తెలుస్తోంది.
ఇక, కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. సోమవారం తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను ప్రారంభించిన ఆయన, కేబినెట్ విస్తరణపై మీడియా ప్రశ్నించగా, తనకు ఈ విషయమై ఎలాంటి సమాచారం లేదని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ విస్తరణను అధిష్టానం ఖరారు చేసిన వేళ, స్వయంగా ఓ మంత్రి దీనిపై అవగాహన లేదని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కొత్తగా మంత్రివర్గంలోకి చేరే నేతల విషయానికొస్తే, కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు నలుగురికి అవకాశం లభించే అవకాశముంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వివేక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే, తుది నిర్ణయానికి ముందు వీరి జాబితాలో మార్పులు చోటుచేసుకుంటాయా? లేక హైకమాండ్ ఇప్పటికే ఖరారు చేసిన అభ్యర్థులను ప్రకటిస్తుందా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఇక, కేబినెట్‌లో ప్రాతినిధ్యం కల్పించే విషయంలో భౌగోళిక సమతుల్యత పాటించాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా సమతుల్యతను పాటిస్తూ, సామాజిక సమూహాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. అలాగే, కొంతకాలంగా మంత్రి పదవుల కోసం ప్రయత్నిస్తున్న పలువురు సీనియర్ నేతలు కూడా ఈ జాబితాలో చోటు సంపాదించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
RK Roja: కూటమి ప్రభుత్వంలో ఆ దేవదేవుడికి కూడా నిదుర లేకుండా పోతుంది..!