Uttam Kumar Reddy : తెలంగాణలో యాసంగి పంట సేకరణకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ దేశంలో అత్యధిక వరి సాగు జరిగే రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. ఈ పంట సీజన్‌లో చివరి గింజ కొనుగోలు అయ్యే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని చెప్పిన ఉత్తమ్, రాష్ట్రంలోని 84 శాతం మందికి సన్న బియ్యం అందించేందుకు ప్రభుత్వం ఏటా రూ.14,000 కోట్ల మేర ఖర్చు చేస్తోందని వెల్లడించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు పెంచడం కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు.
భవిష్యత్ సాగు అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం నీటి వనరుల పరిరక్షణ, పునరుద్ధరణపై దృష్టిసారించిందని మంత్రి తెలిపారు. బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణకు కేటాయించిన 811 టీఎంసీల నీటిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అంగీకరించిందని ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలంగాణ హక్కు కోసం బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించినట్లు చెప్పారు. నాగార్జున సాగర్‌లో పూడిక తొలగింపు పనులు ప్రారంభించామన్నారు. దీనితోపాటు, కాలువల పరిరక్షణకు లస్కర్ల నియామకాలు చేస్తున్నామని, నిర్జీవంగా మారిన ఇరిగేషన్ శాఖను కొత్త నియామకాల ద్వారా బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
Minors Driving: మైనర్ పిల్లలకు బైక్ ఇస్తున్నారా…? ఐతే తల్లిదండ్రుల్లారా తస్మాత్ జాగ్రత్త..!
దక్షిణ తెలంగాణ సాగునీటి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని చెప్పారు. SLBC ప్రాజెక్టు పనుల వేగవంతం కోసం జాతీయ స్థాయిలో టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ పాలనలోనే పూర్తి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే నిధులు కేటాయించినట్లు తెలిపారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దక్షిణ తెలంగాణపై సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అన్యాయం చేసిందని తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు దక్షిణ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు వెచ్చించినట్లయితే అవన్నీ ఇప్పటికే పూర్తయ్యేవని ఆయన అన్నారు. కృష్ణా జలాలలో తెలంగాణ వాటా కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.