Uttam Kumar Reddy : తెలంగాణలో రబీ సీజన్‌కు సంబంధించి 57 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటల నుంచి 127.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకుని ఏర్పాట్లు పూర్తి చేసింది.
శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో, పౌర సరఫరాల శాఖా ముఖ్య కార్యదర్శి డి.ఎస్. చౌహన్, జాయింట్ కమిషనర్ ప్రియాంకా ఏలే, డైరెక్టర్ ప్రసాద్, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ నుంచి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ , రబీ సీజన్‌లను కలిపి మొత్తం 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి నమోదవుతుందని తెలిపారు, ఇది దేశ స్థాయిలో అరుదైన రికార్డుగా నిలుస్తుందన్నారు.
ప్రభుత్వం మొత్తం 8,329 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇప్పటికే 7,337 కేంద్రాలు పని ప్రారంభించాయి. నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయి. మిగిలిన జిల్లాల్లో వరికోతల ప్రగతిని బట్టి కేంద్రాలను ప్రారంభిస్తున్నారు.
ప్రభుత్వం ఈ సీజన్‌లో సన్నరకాల పంటలకు ప్రత్యేకంగా రూ. 500 బోనస్ అందిస్తున్నది. దీంతో సరిహద్దు రాష్ట్రాల నుండి అక్రమ రవాణా అవకాశం ఉండటంతో, దాన్ని నిరోధించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 5.77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కాగా, 2.74 లక్షల టన్నులు ఇంకా కేంద్రాల వద్ద ఉన్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 66.65 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాములు ఉన్నాయి. ఇందులో 25 లక్షల టన్నుల నిల్వల కోసం తక్షణమే ఏర్పాట్లు ఉన్నట్లు తెలిపారు. మిగిలిన ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, ప్రైవేట్ గోదాముల ద్వారా నిల్వ చేయనున్నారు. అలాగే, ధాన్యం నిల్వకు అవసరమైన గన్ని బ్యాగులు (మొత్తం 17.5 కోట్లకు అవసరం)లో 9.23 కోట్ల బ్యాగులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
Minister Narayana: రేపటి నుంచి గుజరాత్‌లో నారాయణ బృందం పర్యటన