US President’s Salary: అగ్రరాజ్యాధినేతగా, నిత్యం తన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్న యూఎస్ ప్రెసిండెట్ డొనాల్డ్ ట్రంప్ జీతం ఎంతో తెలుసా.. అక్షరాల ఏడాదికి 4 లక్షల డాలర్లు. అది ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.3.36 కోట్లు. అంటే అమెరికా అధ్యక్షుడు నెలకు సుమారు రు.28 లక్షల వేతనం తీసుకుంటారు. ఆయనకు వేతనం మాత్రమే కాదండోయ్ ఖర్చులకు, ప్రయాణాలకు, వినోదానికి కూడా డబ్బులు చెల్లిస్తారు. అధ్యక్షుడు ఖర్చుల కోసం అదనంగా మరో 50 వేల డాలర్లు, ప్రయాణ ఖాతా లక్ష డాలర్లు, వినోద బడ్జెట్ 19 వేల డాలర్లు పొందుతారు. అలాగే వైట్ హౌస్‌లో నివసించడంతో సహా ఇతర ప్రయోజనాలు కూడా ఆయన పొందుతారు. మీకు తెలుసా ఆయన మొదటిసారి అధ్యక్షుడి పని చేసిన సమయంలో తీసుకున్న జీతాన్ని వైట్ హౌస్ పునరుద్ధరణ కోసం విరాళంగా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడి జీతభత్యాలు ఎక్కువే అయినా, ప్రపంచంలోని కొన్ని దేశాల అగ్రనేతలతో పోలిస్తే ఆ మొత్తం అంతంత మాత్రమే. ఉదాహరణకు సింగపూర్ ప్రధాని ఏడాదికి 11.6 లక్షల డాలర్లు అంటే రూ.13.44 కోట్లు వేతనంగా పొందుతారు. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఏడాదికి రూ.5.5 కోట్ల జీతం అందుకుంటారు.
READ MORE: Arabia Kadali Review: అరేబియా కడలి రివ్యూ
తొలి అధ్యక్షుడి జీతం..
అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ జీతం 2వేల డాలర్లు ఉండేది. 2001లో చివరిసారిగా అధ్యక్షుడి జీతం పెరిగింది. నాటి నుంచి 23 ఏళ్లుగా పెరగకుండా 4లక్షల డాలర్లుగా కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడికి పలు రకాల సదుపాయాలు, విలాసవంతమైన నివాసాలు ఉన్నాయి. అధ్యక్షుడికి క్యాంప్ డేవిడ్ అనే పర్వత విడిది కేంద్రం ఉంది. దీన్ని దౌత్యపరమైన చర్చల కోసం ఎక్కువగా వినియోగిస్తుంటారు. ప్రెసిడెంట్ అధికారిక భవనాన్ని శ్వేతసౌధం అంటారు. 18 ఎకరాల విస్తీర్ణంలో ఉండే వైట్‌హౌస్లో వంట, ఇతర పనుల కోసం 100 మంది సహాయకులుంటారు. వారిలో అధ్యక్షుడికి భోజనాన్ని తయారు చేసేందుకు ఎగ్జిక్యూటివ్ షెఫ్, ఎగ్జిక్యూటివ్ పేస్ట్రీ షెఫ్ లు ఉంటారు. అమెరికా అధ్యక్షుడితో పాటు ఆయన కుటుంబసభ్యులకు ఉచిత వైద్యం అందుతుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్యసేవలు అందుతాయి. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి.. పదవీవిరమణ పొందిన తర్వాత కూడా ఇతర ప్రయోజనాలు పొందే వీలుంటుంది. మాజీ అధ్యక్షుడికి 2.30 లక్షల డాలర్లు అంటే రూ.1.93 కోట్ల వార్షిక పెన్షన్ అందుతుంది. ప్రయాణభత్యాలు, కోరుకున్నచోట నివాసం, సిబ్బంది వంటి సదుపాయాలు కూడా పొందుతారు. అగ్రరాజ్యాధినేతకు ఇది కాకుండా.. బ్లెయిర్హో హౌస్ అనే అతిథి గృహం ఉంటుంది. ఇది శ్వేతసౌధం కంటే పెద్దది. ఇందులో 119 గదులు, అతిథుల కోసం 20 బెడ్రూములు, 35 బాత్రూమ్లు, 4 డైనింగ్ హాల్స్, జిమ్, సెలూన్ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లాలన్నా అత్యంత విలాసవంతమైన, అత్యున్నత భద్రతతో కూడిన ఎయిర్ఫోర్స్ వన్ విమానం ఉంటుంది. దీంతో పాటు భారీ పేలుళ్లనూ తట్టుకునే మెరైన్ వన్ హెలికాప్టర్, ఒకేలాంటివి ఐదు హెలికాప్టర్లు ఉన్నాయి. ప్రెసిడెంట్ ఎందులో ఉన్నాడో శత్రువులకు తెలియకుండా చేయడం కోసం వీటిని వాడతారు. ప్రపంచంలోనే అత్యంత భద్రమైన ‘బీస్ట్’ కారును అమెరికా అధ్యక్షుడి ప్రయాణానికి వినియోగిస్తారు. ప్రెసిడెంట్ ఏ దేశానికి వెళ్లినా అక్కడ బీస్ట్ అడుగుపెట్టాల్సిందే..
READ MORE: PVNS Rohit : మొన్నే నేషనల్ అవార్డు.. నేడు ఎంగేజ్ మెంట్ చేసుకున్న సింగర్