H-1B, H-4: అమెరికా దౌత్య కార్యాలయం (US Embassy) H-1B మరియు H-4 వీసా దరఖాస్తుదారుల కోసం గ్లోబల్ అలర్ట్ జారీ చేసింది. డిసెంబర్ 15 నుంచి ‘డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్’ వీసా స్క్రీనింగ్‌లో భాగంగా దరఖాస్తుదారుల ఆన్‌లైన్ ప్రెజెన్స్ (సోషల్ మీడియా, డిజిటల్ యాక్టివిటీ) సమీక్ష పరిధిని విస్తరించినట్లు వెల్లడించింది. ఈ కొత్త విధానం అన్ని దేశాలకు చెందిన H-1B, H-4 దరఖాస్తుదారులకు వర్తించనుంది. ఈ చర్య H-1B వీసా కార్యక్రమం దుర్వినియోగాన్ని అరికట్టడం కోసమేనని అమెరికా దౌత్య కార్యాలయం స్పష్టం చేసింది. ఫేక్ జాబ్ ఆఫర్లు, తప్పుడు సమాచారం, మధ్యవర్తుల పాత్ర వంటి అక్రమాలను నియంత్రించడం ద్వారా అమెరికా సంస్థలు నిజమైన, అర్హత కలిగిన తాత్కాలిక విదేశీ ఉద్యోగులను నియమించుకునేలా చేయడమే లక్ష్యమని పేర్కొంది.
Pawan Kalyan: అందుకే మనకు ప్రధానితో సహా జాతీయ స్థాయిలో గౌరవం..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లు H-1B అండ్ H-4 వీసా దరఖాస్తులను యథావిధిగా స్వీకరిస్తూ ప్రాసెస్ చేస్తున్నాయి. అయితే ఆన్‌లైన్ సమీక్ష విస్తరణ కారణంగా అదనపు ప్రాసెసింగ్ సమయం పడే అవకాశం ఉందని దరఖాస్తుదారులకు ముందుగానే సూచించారు. H-1B వీసా వ్యవస్థలో మోసాలు, నకిలీ ఉద్యోగ ఆఫర్లు, తప్పుదారి పట్టించే సమాచారం వంటి అంశాలపై అమెరికా గత కొంతకాలంగా కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా, ఆన్‌లైన్ కార్యకలాపాల సమీక్షను స్టాండర్డ్ వీసా స్క్రీనింగ్‌లో భాగంగా చేర్చింది. ఇది ఏ ఒక్క దేశం లేదా సమూహాన్ని లక్ష్యంగా చేసుకున్న చర్య కాదని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం అనంతరం అమెరికాలో ఉద్యోగం కోరుకునే పలువురు దరఖాస్తుదారులు గోప్యతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ ప్రొఫైల్స్ పబ్లిక్‌గా ఉంచడం వల్ల వ్యక్తిగత సమాచారం డేటా బ్రోకర్ల చేతుల్లోకి వెళ్లి కాపీ లేదా అమ్మకం జరిగే ప్రమాదం ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. కొంతమంది దరఖాస్తుదారులు ప్రభుత్వమే అధికారిక అకౌంట్ల నుంచి రిక్వెస్ట్ పంపడం, లేదా వీసా ఇంటర్వ్యూ సమయంలో మొబైల్ ద్వారా ప్రొఫైల్ చూపించే అవకాశం ఇవ్వాలని సూచించారు. అయితే ఈ అభ్యంతరాలపై ఇప్పటివరకు అమెరికా అధికారులు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయలేదు. అమెరికా అధికారుల ప్రకారం ఆన్‌లైన్ ప్రెజెన్స్ సమీక్ష ప్రపంచవ్యాప్తంగా అన్ని H-1B, H-4 దరఖాస్తుదారులకు సమానంగా వర్తిస్తుంది. వీసా ప్రక్రియ యొక్క విశ్వసనీయతను కాపాడటమే దీని ప్రధాన ఉద్దేశమని వారు స్పష్టం చేశారు.