India-Canada Row: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇండియా-కెనడా దేశాల మధ్య తీవ్ర దౌత్య వివాదానికి కారణమైంది. ఈ మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. పదేపదే కావాలనే కెనడా, ఇండియాను టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేస్తోంది. ఇదిలా ఉంటే దౌత్య సమానత్వం కోసం ఇండియా, కెనడాకు సంబంధించిన 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాని కోరింది. అక్టోబర్ 10 వరకు డెడ్ లైన్ విధించింది. లేకపోతే వారికి దౌత్యవేత్తలకు ఇస్తున్న రక్షణలను తొలగిస్తామని తెలిపింది. అయితే ఇరు పక్షాల చర్యల కారణంగా ఇది అక్టోబర్ 20 గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న కెనడా తన 41 మంది దౌత్యవేత్తలను ఇండియా నుంచి తిరిగి రప్పించుకుంది.
ఇదిలా ఉంటే భారత్ వియన్నా కన్వెన్షన్ ను ఉల్లంఘిస్తుందని కెనడా గగ్గోలు పెడుతోంది. అయితే దౌత్య సమానత్వాన్ని కోరుకోవడాన్ని నిబంధనల ఉల్లంఘనగా చెప్పుకోవద్దని భారత్ కెనడాకు సూటిగా సూచించింది. ప్రస్తుతం భారత్, కెనడాల్లో ఇరు వైపుల 21 మంది దౌత్యవేత్తలు ఉన్నారు.
ఈ నేపథ్యంలో మరోసారి కెనడాకు అమెరికా, యూకే దేశాలు వత్తాసు పలికాయి. వియన్నా ఒప్పంద సూత్రాలను, దౌత్యసంబంధాలపై భారత్ తన బాధ్యతలను నిర్వర్తించాలని తాము ఆశిస్తున్నట్లు అమెరికా వ్యాఖ్యానించాంది. మరోవైపు యూకే కూడా కెనడాకు మద్దతు ప్రకటిస్తూ వ్యాఖ్యానించింది. ‘‘భారత్ నుంచి కెనడా దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించాలనే భారత నిర్ణయాన్ని మేం అంగీకరించలేము. దౌత్యపరమైన రక్షణలను ఏకపక్షంగా ఎత్తివేయడం, వియన్నా ఒప్పందానికి అనుగుణంగా లేదు’’ అంటూ యూకే విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి వెల్లడించారు.
Read Also: AUS vs PAK: ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మ్యాచ్ మధ్యలో సడన్గా పవర్ కట్.. నిలిచిన డీఆర్ఎస్ సేవలు
‘‘కెనడా-ఇండియాల మధ్య పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. విబేధాల పరిష్కారానికి దౌత్యవెత్తలు ఉండటం చాలా అవసరం. దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని కెనడాపై భారత్ ఒత్తిడి చేయవద్దని న్యూఢిల్లీని కోరాం. నిజ్జర్ హత్య కేసులో కెనడాకు సహకరించాలని అభ్యర్థిచాం. 1961 నాటి వియన్నా ఒప్పంద సూత్రాల కింద దౌత్య సంబంధాలపై భారత్ తన బాధ్యతను నిర్వర్తించాలి’’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తుతెలియని వ్యక్తులు జూన్ నెలలో కెనడాలో కాల్చి చంపారు. అయితే ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఇదే కాకుండా కెనడాలోని భారత దౌత్యవేత్తను బహిష్కరించారు. భారత్ కూడా సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను దేశం వదిలివెళ్లాని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇటీవల కెనడా, భారత్ దేశాల్లో దౌత్యవేత్తల సమానం కొరకు ఇండియాలో ఎక్కువగా ఉన్న కెనడియన్ దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని కెనడాకు సూచింది. ఈ నిర్ణయం రెండు దేశాల్లోని లక్షల మంది ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తుందని జస్టిన్ ట్రూడో అన్నారు.