NASA-ISRO Satellite: భూమిపై పరిశీలనల కోసం అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా, భారత్ రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో)లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘నిసార్’ ఉపగ్రహం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. అమెరికా వైమానిక దళానికి చెందిన విమానం నాసా-ఇస్రో ఉపగ్రహంతో ఇవాళ బెంగళూరులో ల్యాండ్ అయింది. ఇది భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటి ప్రకృతి వైపరీత్యాల హెచ్చరిక సంకేతాలను కూడా గుర్తించగలదు. నిసార్(NISAR) ఉపగ్రహం భూమి పర్యావరణ వ్యవస్థలలో మార్పులను కొలుస్తుంది. పరిశోధకులకు భూమి-ఉపరితల మార్పుల పరిణామాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటనాలు, సముద్ర మట్టం పెరుగుదల మొదలైన ప్రకృతి వైపరీత్యాల హెచ్చరిక సంకేతాలను కూడా గుర్తించగలదు. హిమాలయాల్లోని హిమానీనదాలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లోని హిమానీనదాలను పర్యవేక్షించేందుకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఈ ఉపగ్రహాన్ని ఉపయోగించనుంది.
Read Also: Tamilnadu: బీజేపీకి షాక్.. ఏఐఏడీఎంకేలో చేరిన కమలం నేతలు
నిసార్ ప్రాజెక్టును ఇరు దేశాల అంతరిక్ష సంస్థలు 2014లో చేపట్టాయి. ఈ ఉపగ్రహం బరువు 2,800 కిలోలు. దీనికోసం నిర్మించిన ఎస్-బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ రాడార్ (సార్)ను భారత్.. 2021 మార్చిలో అమెరికా పంపింది. నాసా రూపొందించిన ఎల్ బ్యాండ్ సాధనంతో దీన్ని అనుసంధానించారు. జోషీమఠ్ తరహాలో భూమి కుంగడం లాంటి ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టడానికి ఇది సాయపడుతుంది. ఇది రాత్రివేళల్లో, అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పరిశీలనలు సాగించగలదు. నిసార్ ఉపగ్రహం మేఘాల ద్వారా చొచ్చుకుపోతుంది. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా అధిక రిజల్యూషన్ చిత్రాలను రూపొందించగలదు. ఈ ఉపగ్రహాన్ని 2024లో ఆంధ్రప్రదేశ్‌లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ధ్రువ కక్ష్యలోకి పంపే అవకాశం ఉంది.