Aha: “ఇవ్వాళ వచ్చే గెస్ట్స్ చాలా యంగ్ అట కదా సార్…” అంటూ ‘ఆహా’ మెంబర్ ఒకరు బాలకృష్ణను అడగ్గానే, “అవునమ్మా నా వయసు వాళ్ళే వస్తున్నారు…” అంటూ ఆయన సమాధానమివ్వడంతో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2లోని ఎపిసోడ్ 2 మొదలవ్వడమే జనానికి హుషారు నిచ్చింది. కొంతమంది కుర్రాళ్ళను చూస్తోంటే నా కుర్రతనం గుర్తొస్తోంది అంటూ బాలయ్య చెబుతూ, తన మనసు దోచినవారిగా సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్‌ను పిలిచారు. వారొచ్చాక ముందుగా వారి ‘బ్రేకప్స్’తో షోను మొదలెట్టారు బాలయ్య.
బాలకృష్ణ ప్రశ్నకు విశ్వక్ సేన్ సమాధానం చెబుతూ, “ఎవ్వరూ బ్రేక్ ఇవ్వక పోతే, బ్రేక్ ఇచ్చుకోవలసి వచ్చింది సార్…” అనడం ఆకట్టుకుంది. షో స్టార్టింగ్ లోనే సిద్ధూకు, విశ్వక్ కు బాలయ్య పెట్టిన ఫిటింగ్ కూడా అలరించింది. “సార్… ఇప్పుడే షో స్టార్టయింది. అప్పుడే చెమటలు పట్టించకండి…” అంటూ విశ్వక్ వేడుకున్నారు. “ఏ పనైనా మనదే అనే టోన్ లో అందరమూ కలసి పని చేసుకుంటాం” అని సిద్ధూ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇందులో తమాషాకు విశ్వక్ సేన్ కు బాలయ్య డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. అందుకు విశ్వక్ సై అంటూ, బాలయ్యనే డైరెక్ట్ చేస్తూ “బాలయ్యగారూ… మీకు హీరోయిన్ ఇష్టమా? ఫ్యాన్స్ ఇష్టమా?” అని అడిగారు. అందుకు బాలయ్య, “మింగితే షేపవుటయిపోతావ్… మసాలా వడే…” అంటూ తనదైన పంథాలో సమాధానమిచ్చారు. ఈ డైలాగ్ సైతం విశ్వక్ చెప్పమనడం విశేషం! ఆ తరువాత సిద్ధూకు తనను డాన్స్ లో డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు బాలయ్య. అందుకు తన ‘డి. జె. టిల్లు’లోని టైటిల్ సాంగ్ కే బాలయ్యతో స్టెప్స్ వేయించారు సిద్ధూ.
మాటలు, పాటలు అయ్యాయి, ఇక ఆట మొదలెడదాం అంటూ బాలయ్య ఓ సెటప్ గేమ్ తో గెస్ట్స్ ఇద్దరినీ మురిపించారు. ‘లైఫ్ లో ఇతనితో మాత్రం సినిమా చెయ్యొద్దురా బాబోయ్… అనుకొనే డైరెక్టర్ ఎవరు?’ అన్నది విశ్వక్ కు వచ్చిన మొదటి ప్రశ్న. దానికి విశ్వక్ ఏ సమాధానమూ చెప్పలేక పోయారు. “సార్… ఇదే ప్రశ్నమీకు వస్తే ఏమని సమాధానం చెబుతారు…” అని బాలయ్యనే ప్రశ్నించారు విశ్వక్. “నీ టాక్ షో లో నేను గెస్ట్ గా వచ్చినప్పుడు ఆన్సర్ చెబుతా” అన్నది బాలయ్య సమాధానం. “రెమ్యునరేషన్ లేకపోయినా పర్లేదు.. కానీ, ఈ హీరోయిన్ తో రొమాంటిక్ సీన్ ఉంటే చాలు…” అన్నది సిద్ధూకు వచ్చిన ప్రశ్న. రొమాంటిక్ సీన్ అని కాదు కానీ, కియారా అద్వాణీపై తనకు క్రష్ ఉందని సిద్ధూ చెప్పారు. అయితే ఈ షోలో బాలకృష్ణ తన కెరీర్ లోని విశేషాన్నే తప్పుగా చెప్పడం గమనార్హం! “నాకు ‘సమరసింహారెడ్డి’కి నంది అవార్డు వచ్చింది. అవార్డూ వచ్చింది, డబ్బులూ వచ్చాయి” అని బాలయ్య చెప్పారు. కానీ, ఆయనకు ఉత్తమ నటునిగా నంది అవార్డు లభించింది ‘నరసింహనాయుడు’కు. ‘సమరసింహారెడ్డి’కి కాదు అన్నది వాస్తవం! మరి ఇంత చిన్న విషయాన్ని బాలయ్య ఎలా మిస్ అయ్యాడబ్బా అనిపిస్తుంది.
Prince Movie Review: ప్రిన్స్ (తమిళ డబ్బింగ్)
సిద్ధూ గర్ల్ ఫ్రెండ్ రాధికకు ఫోన్ చేయించారు బాలయ్య. ఆమెతో మాట్లాడుతూ, “అమ్మా…అందరూ నా పేరు చెప్పుకొని లైనేస్తుంటారు. కానీ, నాకెవరూ పడడం లేదు…” అని చెప్పడం భలేగా నవ్వులు పూయించింది. వైజాగ్ ఫ్యాన్స్ కోసం బాలకృష్ణ, “ఫ్లూటు… జింక ముందు ఊదు- సింహం ముందు కాదు…” అంటూ పాడుతూ మైఖేల్ జాక్సన్ లాగా ‘మూన్ వాక్’ చేయడం మరింతగా అలరించింది. స్క్రీన్ పై కనిపించిన ‘బిగ్ క్వశ్చన్స్’కు సిద్ధూ, విశ్వక్ ఇచ్చిన సమాధానాలు భలేగా ఆకట్టుకున్నాయి. షో జరుగుతూ ఉండగా నిర్మాత నాగవంశీనే అక్కడకు వచ్చారు. “నీ ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ హీరో ఎవరమ్మా?” అని నాగవంశీని అడిగారు బాలయ్య. “మీరే సార్… నేను మీ చుట్టూ తిరిగాక మీరే కదా సార్ ‘కళ్యాణ్ గారయితే బాగుంటుందని’ సజెస్ట్ చేశారు కదా” అని గుర్తు చేశారు. ‘త్రివిక్రమ్ బయటి సినిమాలు చేయడా?’ అన్న బాలయ్య ప్రశ్నకు “మాకు ఇష్టం లేదు సార్ ఆయన బయటకు వెళ్ళడం” అని నాగవంశీ జవాబు చెప్పారు. నాగవంశీ ద్వారా త్రివిక్రమ్ కు ఫోన్ చేయించారు బాలయ్య. ఆయనతో మాట్లాడుతూ “షోకు ఎప్పుడొస్తున్నావమ్మా… ఎవరితో రావాలో తెలుసుగా…” అని చెప్పడమూ భలేగా ఆకట్టుకుంది. చివరలో ముగ్గురు ఫ్యాన్స్ ను ఎంపిక చేసి వారితో ‘సుత్తి’తో కొట్టి ఎవరి బలమెంతో చూసుకొనేలా చేయడమూ మురిపించింది.
ఇలా సాగిన ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2లోని రెండో ఎపిసోడ్ భలేగా సందడి చేసింది. గంటకు పైగా సాగిన ఈ షోను చూస్తే… బాలయ్య మాటల్లో చెప్పాలంటే ‘దబిడి దిబిడే!’