కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం మల్లన్న పాదాల చెంత రైల్వే స్టేషన్ నిర్మించాలని ప్రధాని మోడీ (PM Modi) ఆదేశించారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. రైల్వే స్టేషన్ నిర్మాణానికి సహకరించిన రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కి ధన్యవాదాలు తెలిపారు. ‘‘కొమురవెల్లి కొండ ప్రాంతం కాబట్టి చుట్టు ప్రక్కల ఏటవాలుగా ఉండటం వల్ల స్టేషన్ నిర్మాణానికి అనుకూలంగా లేదని గతంలో నివేదిక ఇచ్చారు. ప్రధానమంత్రిని చాలాసార్లు కలిసి కొమురవెల్లి మల్లన్న స్వామి విశిష్టత వివరించాను. వెంటనే మోడీ.. రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌కి రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం మోడీ కృషితో ఈరోజు రైల్వేస్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేసుకున్నాం.’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.
యూపీఏ హయాంలో వివక్ష..
‘‘గత యూపీఏ పాలనలో తెలంగాణ రైల్వేల విషయంలో చాలా వివక్ష చూపించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వేల అభివృద్ధి కోసం అనేక లైన్ల నిర్మాణాలు చేపట్టారు. సుమారు 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరణ చేస్తున్నాం.
రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రూ.350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్, రూ.450 కోట్లతో కాచిగూడ రైల్వే స్టేషన్, కొత్తగా చర్లపల్లి రైల్వే టర్మినల్ నిర్మాణం చేసుకుంటున్నాం. గత యూపీఏ పాలనలో తెలంగాణ రైల్వే బడ్టెట్ రూ.251 కోట్లు… నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు రూ.6వేల కోట్లకు పెంచారు. గత తొమ్మిదేళ్లలో రూ. 30 వేల కోట్ల రూపాయలు తెలంగాణ రైల్వే కోసం ఖర్చు పెట్టారు.’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం..
‘‘మొట్టమెదటిసారిగా మెదక్ రైల్వే స్టేషన్‌ను నేనే ప్రారంభించాను. సిద్దిపేట రైల్వేలైన్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ రైల్వే లైన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రూ.26 వేల కోట్లతో నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్‌ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అంకితం చేయబోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ల్యాండ్ కోసం రూపాయి ఖర్చు పెట్టకుండా నిర్లక్ష్యం చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తే తొందరలోనే రీజినల్ రింగ్ రోడ్ పూర్తవుతుంది. రింగ్ రోడ్ పూర్తయిన తర్వాత 8, 9 జిల్లాలను కలిపే రింగ్ రైల్వే లైన్‌ను కూడా ఏర్పాటు చేస్తాం.’’ అని వెల్లడించారు.
ఫ్రీ వైఫై..
‘‘సిద్దిపేట-మనోహరబాద్ రైల్వే లైన్ ద్వారా రైతుల ఉత్పత్తులను సరఫరా చేస్తాం. కొమురవెల్లి రైల్వే స్టేషన్ నుంచి దేవాలయం వరకు పక్కా రోడ్డు నిర్మాణం చేయబోతున్నాం. టికెట్ బుకింగ్ కౌంటర్, వెయిటింగ్ హాల్ నిర్మిస్తాం. ఫ్రీ వైఫై కూడా అందిస్తాం. మల్లిఖార్జున స్వామి పాదాల చెంత అత్యంత ఆధునికంగా రైల్వే స్టేషన్ నిర్మించుకుంటున్నాం.’’ అని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పూజలు చేశారు.
#WATCH | Telangana | Union Minister and Telangana BJP chief G. Kishan Reddy, Madya Pradesh CM Mohan Yadav and BJP MP K Laxman offered prayers at Komuravelli Mallikarjuna Swamy Temple at Komaravelli Village in Siddipet district today. pic.twitter.com/ThArnQmMWm
— ANI (@ANI) February 15, 2024