ఢిల్లీలోని అశోక్ రోడ్డులోని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై గుర్తుతెలియని దుండగులు మరోసారి రాళ్లదాడి చేశారు. ఇప్పటికే పలుమార్లు ఇంటిపై రాళ్లదాడి చేయగా.. ఇలా జరగడం ఐదోసారి. మరోవైపు రాళ్లదాడి ఘటనలో ఇంటి కిటికీలు, లోపల ఉన్న వస్తువులు స్వల్పంగా దెబ్బతిన్నాయి.
Read Also: Beans Cultivation : చిక్కుడులో వేరుకుళ్లు తెగులు నివారణ చర్యలు..
ఈ ఘటనపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఢిల్లీలోని తన ఇంటిపై రాళ్ల దాడి జరిగిందని.. ఈ దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గతంలోను తన ఇంటిపై రాళ్ల దాడి జరిగిందని అయినప్పటికీ.. పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని చెప్పారు. ఓ వైపు బుల్డోజర్లు, మరోవైపు రాళ్ల దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎంపీ ఇంటిపైనే రాళ్ల దాడి జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు బీజేపీ నేతల ఇంటిపై జరిగితే వాళ్లు చూస్తూ ఊరుకునే వారా అని ప్రశ్నించారు. ఐదు రోజుల క్రితం తనకు బెదిరింపు మేసేజ్ లు వచ్చినట్టుగా ఓవైసీ గుర్తు చేశారు.
Read Also: Upendra: వారి గురించి నీచంగా మాట్లాడిన ఉపేంద్రపై కేసు.. స్టే ఇచ్చిన కోర్టు
ఈ ఏడాది ఫిబ్రవరి 20న అసదుద్దీన్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఎవరికి గాయాలు కాలేదు. అప్పుడు ఇదే విషయంపై సోషల్ మీడియాలో ప్రకటించారు. రాళ్ల దాడి తర్వాత తన ఇంటి పరిస్థితిని వివరిస్తూ ట్విట్టర్ లో వీడియో షేర్ చేశారు. అయితే 2014 నుండి అసదుద్దీన్ ఇంటిపై దాడి జరగడం ఇది ఐదోసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో నాలుగోసారి దాడి జరిగిందని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్న విషయం తెలిసిందే.