Israel-Hamas Conflict: రఫాలో ఇజ్రాయెల్ దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 45 మంది సామాన్య పౌరుల ప్రాణాలను బలిగొన్న ఈ ఘటనపై విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ ప్రభుత్వ చర్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దారుణాలను ఆపాలని వార్నింగ్ ఇచ్చింది. అనేక మంది మృతికి కారణమైన ఇజ్రాయెల్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని యూఎన్ వెల్లడించింది. గాజాలో అసలు సురక్షితమైన ప్రాంతమే లేదు.. ఈ ఘోరాన్ని తక్షణమే ఆపాలి అంటూ ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కోరారు.
Read Also: Prasanna Vadanam : అరుదైన ఘనత సాధించిన సుహాస్ ప్రసన్న వదనం..
కాగా, రఫాలో ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. ఈ ఘటనలో 45 మంది పాలస్తీనా పౌరులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఇందులో 200 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. దాడి జరిగిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతాన్ని సురక్షితమైనదిగా ఇజ్రాయెలే వెల్లడించింది. దీంతో చాలా మంది ఇక్కడకు వచ్చి తలదాచుకోగా.. ఇప్పుడు ఆ ప్రాంతంపైనే దాడి చేయడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే, ఎంత హెచ్చరించినా ఇజ్రాయెల్ పద్దతి మార్చుకోవడం లేదు అని ఐరాస మానవ హక్కుల విభాగం హై కమిషనర్ వోల్కర్ టర్క్ అన్నారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలోని దృశ్యాలు చాలా భయానకంగా ఉన్నాయన్నారు.