Russia-Ukraine War: రష్యా సైన్యంపై దాడి చేయడానికి ఉక్రెయిన్ ఉత్తర కొరియా రాకెట్లను ఉపయోగిస్తున్నట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. ఓ మిత్ర దేశం ఆ ఆయుధాలను గతంలో రష్యా నుంచి స్వాధీనం చేసుకుని.. తమకు సరఫరా చేసినట్లు ఉక్రెయిన్ రక్షణశాఖ తెలిపినట్లు వార్తాసంస్థ వెల్లడించింది. సముద్రం ద్వారా పంపిన సరుకులతో సహా రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలను అందజేస్తోందని అమెరికా ఆరోపించింది. అదే సమయంలో, దీనికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు సమర్పించబడలేదు. ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతాలలో ఉత్తర కొరియా ఆయుధాలు విస్తృతంగా కనిపించలేదు. అదే సమయంలో, ఉత్తర కొరియా, రష్యా ఈ ఆయుధ లావాదేవీలను నిరాకరిస్తున్నాయి.
Also Read: Governor Convoy: గవర్నర్ కాన్వాయ్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు అరెస్ట్
తూర్పు నగరం బఖ్‌ముట్ ప్రాంతంలో రష్యాపై ఎదురుదాడులకుగానూ ఉక్రెయిన్ బలగాలు ఉత్తర కొరియా రాకెట్లను వినియోగిస్తున్నట్లు ఆ వార్తాసంస్థ పేర్కొంది. శిథిలమైన బఖ్‌ముట్ నగరం చుట్టూ ఉన్న భూభాగాన్ని ఉక్రెయిన్ ఇటీవల తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై యుద్ధంలో భాగంగా రష్యాకు ఉత్తర కొరియా ఆయుధ సాయం చేస్తోందని అమెరికా ఎన్నోసార్లు ఆరోపించింది. కానీ రష్యా, ఉత్తర కొరియాలు మాత్రం ఈ వార్తలను ఖండించాయి.
ఉత్తర కొరియా విక్టరీ డేను పురస్కరించుకుని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఈ వారం ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌లో పర్యటించారు. 1991లో సోవియట్ యూనియన్ రద్దు అయిన తర్వాత సెర్గీ షోయిగు పర్యటన రష్యా నుంచి ఓ ఉన్నత అధికారి చేసిన మొదటి పర్యటన కావడం గమనార్హం. పర్యటన సమయంలో ప్యోంగ్యాంగ్‌లోని సైనిక ప్రదర్శనలో నాయకుడు కిమ్ జోంగ్ ఉన్‌తో కలిసి నిషేధించబడిన ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణులను చూస్తున్న షోయిగు ఫోటో బయటకు వచ్చింది. ఇది రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలను సూచిస్తుంది.