చిన్న తప్పిదం కారణంగా యూకేలో ఓ జంటకు విడాకులు మంజూరు అయిపోయాయి. ఈ పరిణామంతో న్యాయస్థానం ఉలికిపాటుకు గురైంది. క్లరికల్ లోపం కారణంగా జంట విడాకులు ముందుగానే ఖరారు చేయబడ్డాయి. లండన్ న్యాయ సంస్థలో జరిగిన పొరపాటు కారణంగా జంటకు ముందస్తుగానే విడాకులకు మంజూరు అయిపోయాయి. ఓ సంస్థ చేసిన చిన్న పొరబాటు కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్ వేదికగా విడాకులకు దరఖాస్తు చేసుకున్న దంపతులు.. చర్చల దశలో ఉండగానే వారికి ఊహించని పరిణామం ఎదురైంది. కోర్టుకు సమర్పించే పత్రాల్లో వేరే జంటకు బదులు వీరి పేరు చేర్చడమే అందుకు కారణం. న్యాయమూర్తి తీర్పుతో నిమిషాల వ్యవధిలోనే వీరికి విడాకులు మంజూరు అయ్యాయి.
యూకేకి చెందిన విలియమ్స్ అనే మహిళకు 21 ఏళ్ల క్రితం వివాహమైంది. గతేడాది నుంచి దంపతులు విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వార్దాగ్స్ అనే ఓ ప్రముఖ సంస్థను సదరు మహిళ ఆశ్రయించారు. దంపతుల మధ్య ఆర్థిక అంశాలు సంప్రదింపుల దశలో ఉండగానే.. మరో క్లయింట్ తుది విడాకుల కోసం రూపొందించిన పత్రాల్లో పొరబాటున విలియమ్స్ దంపతుల పేరును చేర్చారు. ఈ పత్రాలను అలాగే కోర్టులో దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. కేవలం 21 నిమిషాల వ్యవధిలోనే ఆ పత్రాల్లో ఉన్న జంటకు విడాకులు మంజూరు చేసింది. ఈ తప్పిదాన్ని కొన్ని రోజుల తర్వాత ఆ సంస్థ గుర్తించింది. తాము అందజేసిన పత్రాల్లో పొరపాటు జరిగిందని, వీటిని రద్దు చేయాలని కోరుతూ విలియమ్స్ తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. కానీ వారి అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.