వింజమూరు పట్టణానికి ఈశాన్య దిక్కున వేంచేసియున్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ శుభ సందర్భంగా తెలుగుదేశం బీఫామ్ ను స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు తిరుమల చార్యులు.. ప్రత్యేక పూజల అనంతరం ఆలయం వెలుపల కాకర్ల సురేష్ కు ఆశీర్వాదాలు అందించి బీ ఫాం పత్రాన్ని అందజేశారు. ఎన్నికల రణరంగంలో మొదటిసారి యుద్ధానికి వెళుతున్నాను విజయాన్ని అందించు ఓ దేవా అంటూ శ్రీ వెంకటేశ్వర స్వామిని పార్థించారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో కాకర్ల సురేష్ తల్లి మస్తానమ్మ, కాకర్ల సురేష్ దంపతులు మరియు కాకర్ల సునీల్ దంపతులు, కాకర్ల వెంకట్ దంపతులు కుటుంబ సభ్యులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
భారీ జన సందోహం నడుమ ఉదయగిరికి..
వింజమూరు తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నుండి 8 మండలాల తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల జన సందోహం నడుమ ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు కాకర్ల సురేష్ తరలివెళ్లారు. సోమవారం మధ్యాహ్నం 12.15 నిమిషాలకు ఆయన నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా.. తెలుగుదేశం పార్టీ నినాదాలతో పార్టీ కార్యాలయం హోరెత్తింది. అందరిదీ ఒకే మాట అదే తెలుగుదేశం బాట, ఉదయగిరి కోటపై తెలుగు దేశం జెండా ఎగరవేయడమే అజెండా అని నినాదాలు చేశారు.
అట్టహాసంగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కాకర్ల సురేష్..
ఉదయగిరి తహసిల్దార్ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్ సోమవారం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు. అతిరథ మహారధులు వెంట నడువగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఉదయగిరి కొండంత అభిమానాన్ని చాటగా.. అందరికీ అభివాదం చేస్తూ కాకర్ల సురేష్ ఉదయగిరి తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నుండి ఉదయగిరి వరకు ప్రచార రథంపై అభిమానులకు అభివాదం చేస్తూ ర్యాలీగా బయలుదేరి వెళ్లి ఏబీఎం సభ ప్రాంగణం నుండి జన సందోహం నడుమ తహసిల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. తన మీద అభిమానంతో ఇన్ని వేలమంది ప్రజానీకం తన నామినేషన్ కు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందన్నారు. జన సమూహాన్ని చూసిన తరువాత 50,000 మెజారిటీతో ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమని కాకర్ల సురేష్ తెలిపారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని.. ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు అని తెలిపారు. ఉదయగిరి దిశ దశ మార్చడంతో పాటు ఉదయగిరి కోటను పర్యాటక కేంద్రంగా చేస్తానని హామీ ఇచ్చారు. ఆడపడుచులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఆర్థిక స్వాతంత్రం తీసుకొస్తానన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమన్నారు. సాగు నీరు అందించి బీడు భూములను బంజరు భూములుగా చేస్తానని అదేవిధంగా ఇంటింటికి మంచినీటి కొళాయిని ఏర్పాటు చేసి ఫ్లోర్ సమస్యను పూర్తిగా అధిగమిస్తానని తెలిపారు. ఉదయగిరిని సిరులగిరిగా చేసేందుకు తన వద్ద ప్రణాళిక ఉందని.. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తానని తెలిపారు. ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకర్ల సురేష్ అనే తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా, తాను ఎమ్మెల్యేగా గెలిస్తేనే అనుకున్న పనులన్నీ సాధ్యమవుతాయని.. ఇప్పటివరకు ఎంతోమందిని గెలిపించారని ఒక అవకాశం ఇచ్చి ఆదరించాలని ఆయన కోరారు. ఎర్రటి ఎండనిసైతం లెక్కచేయక ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చిన అవ్వ తాతలకు, అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, ఆత్మీయులకు, తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కంభం విజయరామి రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నుబోయిన చంచల్ బాబు యాదవ్, నియోజకవర్గ పరిశీలకులు వేనాటి సతీష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శాంతకుమారి, బీజేపీ ఇన్చార్జి కదిరి రంగారావు, జనసేన ఇన్చార్జి కొట్టే వెంకటేశ్వర్లు, కాకర్ల సునీల్, కాకర్ల వెంకట్, కాకర్ల ప్రవీణ, కాకర్ల సురేఖ, 8 మండలాల తెలుగుదేశం బీజేపీ జనసేన కన్వీనర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
అతిధులకు మన్నెటి ఆత్మీయ సన్మానం
ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్ నామినేషన్ వేసిన శుభ సందర్భంగా, ఉదయగిరి మండలం గంగిరెడ్డిపల్లిలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కు.. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మణ్ నాయుడును, నియోజకవర్గ పరిశీలకులు వేనాటి సతీష్ రెడ్డిని శాలువా పూలమాలతో ఘనంగా మన్నేటి వెంకటరెడ్డి సన్మానించారు. అదే విధంగా.. కొండాపురం మండలం భీమవరప్పాడు గ్రామానికి చెందిన యువ నాయకుడు మాధవరావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు కేకును కట్ చేసి మాధవరావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు.