Kakarla Suresh: ఉదయగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమానికి పల్లె ప్రాంత ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. శనివారం ఆయన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి జలదంకి మండలం గోపన్నపాలెం, టెంక వారి పాలెం, నెహ్రూ నగర్ కాలనీ, కర్కోరి వారి పాలెం, అప్పారావు తోట, కమ్మ పాలెం, కమ్మవారిపాలెం, చామదల పంచాయతీలలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. రైతు బాంధవుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అని.. ఆయన హయాంలో రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వడమే కాకుండా, 90 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లను, రైతు రథాల ద్వారా టాక్టర్లను ఇచ్చి మద్దతు ధర కల్పించారన్నారు. ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. యువత భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, సమస్యలు తెలుసుకుంటూ కరపత్రాలు అందజేస్తూ ఓట్లను అభ్యర్ధించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లోని ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3000 నిరుద్యోగ భృతి అందించడం జరుగుతుందన్నారు. స్కూల్‌కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15,000 అందిస్తారని, ప్రతి రైతుకు ఏటా రూ. 20,000 ఆర్థిక సాయం ఇస్తారని, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి నెలకు రూ. 1,500 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వృద్ధులు, వితంతువులకు నెల ఒకటో తేదీన ఇంటి వద్దకే రూ.4 వేల పింఛను ఇస్తామన్నారు. పెంచిన పింఛన్లను ఏప్రిల్ నుంచి పరిశీలించి జూన్‌లో పెంచిన పింఛన్లను అందజేస్తామన్నారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నేతల పాల్గొన్నారు.
భర్త కోసం భార్య ప్రచారం
వింజమూరు మండలంలోని కొత్తూరులో కన్వీనర్ రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయగిరి కూటమి అభ్యర్ధి కాకర్ల సురేష్ సతీమణి కాకర్ల ప్రవీణ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టో కరపత్రాలను ఆమె పంపిణీ చేశారు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు గురించి ప్రజలకు వివరించారు. కాకర్ల సురేష్‌కు ఓటేసి గెలిపించాలని మహిళలకు బొట్టుపెట్టి ప్రచారం నిర్వహించారు. ఉదయగిరి అభివృద్ధికి తమ సొంత నిధులతో గత రెండేళ్లుగా పాటుపడుతున్నామని తెలిపారు.
తనయుడి కోసం తల్లి.. బావ కోసం మరదలు ప్రచారం
కలిగిరి మండలంలోని కొట్టాలు, తూర్పు మాలపాలెం గ్రామాలలో కాకర్ల సురేష్ మాతృమూర్తి కాకర్ల మస్తానమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తన కుమారుడు కాకర్ల సురేష్‌కు ఓటేసి గెలించాలని కోరారు. మీ బిడ్డకు మీరు వేసే ఓటుతో ఉదయగిరి నియోజక వర్గం అభివృద్ధికి బాటలు వేసిన వారు అవుతారని తెలిపారు. కాకర్ల సురేష్ విదేశాలలో వ్యాపార రంగంలో రాణించి పురిటి గడ్డ రుణం తీర్చుకొనుటకు ఉదయగిరికి వచ్చారని చెప్పారు.ఉదయగిరి నియోజక వర్గ ప్రజలు ఆదరిస్తే ఉదయగిరి అభివృద్ధికి దోహద పడతారని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో మూడు పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. కొండా పురం మండలంలోని పాత ఉప్పులూరు, కొత్త ఉప్పులూరులో కాకర్ల సురేష్ మరదలు కాకర్ల సురేఖ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో గురించి మహిళలకు, వృద్దులకు, యువతకు వివరించారు.
కాకర్లకు మద్దతుగా ఎమ్మార్పీఎస్ నేతల ప్రచారం
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా శనివారం సీతారామపురం మండలంలోని రొంపిదొడ్ల, బసినేపల్లి, సంగసానిపల్లె, సింగారెడ్డిపల్లె, అంకిరెడ్డి పల్లె, రంగనాయు పల్లె గ్రామాలలో ఎమ్మార్పీఎస్ నేతలు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ కో ఆర్డీనేటర్ పందిటి అంబేద్కర్ మాదిగ మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం మాదిగలు కృషి చేయాలని కోరారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు ప్రతీ ఒక్కరి భాద్యతగా భావించాలన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.