ఫ్రాన్స్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చే పేరు ఈఫిల్ టవర్. ప్రపంచ ప్రసిద్ధ కట్టడాల్లో ఇది కూడా ఒకటి. దీనిని చూసేందుకు లక్షల్లో టూరిస్ట్ లు పారిస్ కు ప్రతి యేటా క్యూ కడుతూ ఉంటారు. సినిమాల్లో కూడా దీనిని ప్రత్యేకంగా చూపిస్తూ ఉంటారు. ఇక అక్కినేని నాగార్జున నటించిన మన్మధుడు సినిమాలో అయితే ఈఫిల్ టవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. అంత ఎతైన ఈఫిల్ టవర్ నుంచి పారిస్ నగరాన్ని చూడాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. ఈ టవర్ లోని చివరి రెండు అంతస్తులకు వెళ్లడానికి టూరిస్టులకు అనుమతి ఉండదు. అయితే అమెరికాకు చెందిన ఇద్దరు టూరిస్టులు మాత్రం తప్పతాగి మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియక అనుమతిలేని ఈ రెండు టవర్లు ఎక్కి నిద్రపోయారు. అనంతరం జైలు పాలయ్యారు.
ఆగస్టు 13 న ఈ సంఘటన జరిగింది. అమెరికా నుంచి ఇద్దరు టూరిస్టులు ఆగస్టు 13న రాత్రి 10.40 గంటలకు టికెట్లు తీసుకొని ఈఫిల్ టవర్ ఎక్కారు. అప్పటికే వారు తాగి ఉన్నారు. మద్యం మత్తులో వారు అనుమతిలేని చివరిదైన రెండో లెవల్ కు వెళ్లారు. సందర్శన సమయం అయిపోయేసరికి ఆ రోజు అందరిని ఈఫిల్ టవర్ సిబ్బంది కిందకు పంపించేసింది. అయితే వీరు మాత్రం భద్రతా సిబ్బంది కళ్లుగప్పి చివరి రెండో లెవల్ కు చేరుకోవడంతో పోలీసులు వీరిని గుర్తించలేకపోయారు. పీకల దాక తాగి ఉండటంతో మద్యం మత్తులో కిందకి దిగలేక వారు అక్కడే హాయిగా నిద్రపోయారు. తరువాతి రోజు ఉదయం భద్రతా సిబ్బంది గస్తీ చేస్తున్న సమయంలో అనుమతిలేని ప్రాంతంలో టూరిస్ట్‌లు నిద్రపోతున్న దృశ్యాన్ని చూసి షాకయ్యారు. దీంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్‌పైటర్లు, రెస్క్యూ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. వారిని అంత ఎత్తు నుంచి జాగ్రత్త దించారు. అయితే అనంతరం ఆ ఇద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
Also Read: Honor 90: హానర్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త మోడళ్లతో ఇండియాలోకి రీఎంట్రీ
అయితే గతంలో కూడా ఈఫెల్ టవర్ లో బాంబు పెట్టనట్లు ఫోన్లు వచ్చాయి. దీంతో టవర్, పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని.. సందర్శకులను బయటకు పంపి పోలీసులు అణువణువు తనిఖీ చేశారు. ఎటువంటి అనుమానిత వస్తువుల లభ్యం కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఎవరో ఆకతాయిలు చేసిన పనిగా గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వారి అచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలా టూరిస్టులు నిద్రపోయిన విషయం ప్రాధాన్యతను సంతరించుకుంది.