Nipah Virus: కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. అదే జిల్లాలో మరో ఇద్దరికి కూడా ఈ వైరస్ సోకినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుంచి రెండు అసహజ మరణాలు నమోదవడంతో మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆరోగ్య హెచ్చరిక జారీ చేసిన కొన్ని గంటల తర్వాత కేంద్రం నుంచి నిర్ధారణ వచ్చింది. పరిస్థితిని సమీక్షించడానికి, నిపా వైరస్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయడానికి కేంద్ర బృందం కేరళకు పంపబడిందని కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ చెప్పారు. మొదటి మరణం ఆగస్టు 30న, రెండవ మరణం సోమవారం సంభవించినట్లు వెల్లడించారు. కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ ఇన్‌ఫెక్షన్ నిర్ధారణ అయింది. ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఇద్దరు మరణించారు. లాలాజలం పరీక్షకు పంపిన నలుగురిలో ఇద్దరికి నిపా పాజిటివ్, ఇద్దరికి నిపా నెగెటివ్ అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు.
Also Read: Inflation: పండుగ సీజన్‌కు ముందు సామాన్యులకు షాక్.. కందిపప్పు ఏడాదిలో 45శాతం పెరుగుదల
కేరళ ప్రభుత్వం కోజికోడ్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ముందుజాగ్రత్త చర్యగా ప్రజలు మాస్క్‌లను ఉపయోగించాలని సూచించింది. అంతకుముందు రోజు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బాధితులతో సన్నిహితంగా ఉన్నవారు చికిత్సలో ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. “ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇద్దరితో పరిచయం ఉన్న వారిని గుర్తించి చికిత్స అందిస్తున్నారు. జాగ్రత్తగా ఉండటమే పరిస్థితిని అధిగమించడానికి కీలకం. ఆరోగ్య శాఖ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికకు అందరూ సహకరించాలని అభ్యర్థించారు” ముఖ్యమంత్రి అన్నారు.
2018లో కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో కూడా నిపా వైరస్ వ్యాప్తి చెందగా, తర్వాత 2021లో కోజికోడ్‌లో నిపా వైరస్ కేసు నమోదైంది. నిపా వైరస్ గబ్బిలాల వల్ల వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఇది మానవులకు, జంతువులకు ప్రాణాంతకం. శ్వాసకోశ అనారోగ్యంతో పాటు, ఇది జ్వరం, కండరాల నొప్పి, తలనొప్పి, జ్వరం, తల తిరగడం, వికారం కూడా కలిగిస్తుంది.