తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. 2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేయనుంది. స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవకు సంబంధించి ఏప్రిల్ కోటా టికెట్లను జనవరి 18న ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. టికెట్ల కోసం జనవరి 18 నుంచి 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న వారు జనవరి 20 నుంచి 22 మధ్యాహ్నం 12లోపు డబ్బులు చెల్లిస్తే.. లక్కీ డిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తారు.
21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల కానున్నాయి. 21వ తేది మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదల అవుతాయి. 23వ తేది ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణం టిక్కెట్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల మరియు వికలాంగుల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటా విడుదల కానున్నాయి. 27వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి సేవా కోటా విడుదల టిక్కెట్లు విడుదల అవుతాయి. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆర్జితసేవలు, దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.