TTD EO Shyamala Rao: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న వేళ టీటీడీ ఈవో శ్వామలరావు ఆ వివాదంపై స్పందించారు. తిరుమలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని, శ్రీవారి లడ్డూ నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. జంతు కొవ్వు వాడుతున్నారని ఫిర్యాదులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. నెయ్యి నాణ్యత బాగా లేదని చాలా మంది భక్తులు ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. లడ్డూ క్వాలిటీ బాగుండాలంటే నెయ్యి నాణ్యత బాగుండాలన్నారు. లడ్డూ తయారీ నాణ్యమైన ఆవు నెయ్యి వాడాలన్నారు. నెయ్యి నూనెలా ఉందని, నాసిరకంగా ఉందని గుత్తేదారుకు చెప్పామన్నారు. నెయ్యిలో నాణ్యతా లోపాన్ని తాను కూడా గమనించానని టీటీడీ ఈవో వెల్లడించారు.
Read Also: CM Chandrababu: శ్రీవారి లడ్డూ వివాదంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష.. టీటీడీ ఈవోకు కీలక ఆదేశాలు..
నెయ్యి నాణ్యతా నిర్ధరణకు టీటీడీ సొంత టెస్టింగ్ ల్యాబ్ లేదని, నెయ్యి నాణ్యతపై అధికారులు గతంలో పరీక్షలు చేయలేదన్నారు. నాణ్యత నిర్ధరణ కోసం బయట ల్యాబ్స్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రూ.75 లక్షల ఖర్చయ్యే ల్యాబ్‌ను ఎందుకు పెట్టలేదో తెలియదన్నారు. అదే సరఫరాదారులకు అవకాశంగా మారిందన్నారు. నెయ్యి టెస్టింగ్ కోసం సొంత ల్యాబ్ లేకపోవడంతో బయట ల్యాబుల్లో టెస్టు చేయించలేదన్నారు. తక్కువ రేటుకు నెయ్యి సరఫరా చేస్తున్నారంటే క్వాలిటీ లేదని అర్థమవుతోందన్నారు. నెయ్యి సరఫరాదారులను కూడా హెచ్చరించామన్నారు. ఏఆర్ డెయిరీ మినహా మిగతా సంస్థలు సరఫరా చేసిన నెయ్యి బాగానే ఉందన్నారు. ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నాలుగు ట్యాంకుల్లో క్వాలిటీ లేదని తెలిసిందన్నారు. బయట ల్యాబుల్లో నెయ్యిని టెస్ట్ చేయించామన్నారు.
రూ.320 కిలో నెయ్యి రాదని అందరూ చెబుతున్నందునే టెస్ట్‌కు ఇచ్చామన్నారు. జులై 6,12 తేదీల్లో ట్యాంకుల్లో వచ్చిన నెయ్యిని ల్యాబ్‌కు పంపించామన్నారు. నెయ్యి నాణ్యతపై 9 రకాల టెస్టులు చేయించామన్నారు. టీటీడీకి ప్రస్తుతం 4 సంస్థలు నెయ్యి సరఫరా చేస్తున్నాయన్నారు. S వాల్యూ టెస్టులో ఐదు రకాల పరీక్షలు ఉంటాయన్నారు. లాడ్ టెస్ట్‌లో 102 దిగువ ఉండాల్సింది 116 వాల్యూ వచ్చిందన్నారు. పందికొవ్వు శాతాన్ని నిర్ధారించే పరీక్షే లాడ్ టెస్ట్ అని పేర్కొన్నారు. మిల్క్ ఫ్యాట్96-104 మధ్య ఉండాల్సింది 20.32 మాత్రమే ఉందన్నారు.ఒక కల్తీ మాత్రమే కాలేదు.. అన్ని రకాలుగా నాణ్యత లోపించిందన్నారు. చేసిన టెస్టుల్లో ఉండాల్సిన వాల్యూ లేదన్నారు. టెస్టుల తర్వాత వెంటనే సరఫరాను ఆపేశామన్నారు.