తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఈ నెల 16న గ్రూపు 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా ఈ ఆరోపణలపై టీఎస్‌పీఎస్సీ స్పందించింది. గ్రూపు 1 ప్రిలిమ్స్ పరీక్షలో అవకతవలు జరుగలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. హైదరాబాద్‌లో 3 సెంటర్లలో ఇన్విజిలేటర్ల తప్పిదం వల్ల గ్రూప్–1పరీక్షను ఆలస్యంగా నిర్వహించినట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. సికింద్రాబాద్ మారేడ్ పల్లి లోని సెయింట్ ఫ్రాన్సిస్ డీ సేల్స్ (ఎస్ఎఫ్ఎస్) హైస్కూల్ లో మూడు రూముల్లో మొత్తం 47 మంది అభ్యర్థులకు ఇంగ్లీష్/తెలుగు ప్రశ్నాపత్రానికి బదులు ఇంగ్లీష్/నాన్ తెలుగు లాంగ్వేజ్ ప్రశ్నాపత్రం ఇవ్వడంతో.. అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు.
Also Read : Rajasthan: ‘మా అమ్మ నిద్రపోతోంది, డిస్టర్బ్ చేయొద్దు’.. తల్లి మృతదేహం వద్ద రెండేళ్ల చిన్నారి
అయితే సిబ్బంది వెంటనే అప్రమత్తమై అభ్యర్థులకు ఇంగ్లీష్/తెలుగు ప్రశ్నాపత్రాలు, కొత్త ఓఎంఆర్ షీట్లను ఇవ్వడంతో.. కొత్త ఓఎంఆర్ షీట్లలో రాస్తే తమ ప్రశ్నాపత్రాలను టీఎస్‌పీఎస్సీ మూల్యాంకనం చేయదనే అనుమానంతో అభ్యర్థులు నిరసనకు దిగారు. అయితే కలెక్టర్ తో పాటు టీఎస్‌పీఎస్సీ అధికారులు దీన్ని సరిదిద్ది , అభ్యర్థులకు నచ్చ చెప్పడానికి టైమ్ పట్టింది…. దీంతో వారికి అదనపు సమయం ఇవ్వాల్సి వచ్చిందని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. మధ్యాహ్నం 3.30 గంటలకు వాళ్ల నుంచి ఓఎంఆర్ షీట్లను తీసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. టీఎస్‌పీఎస్సీతో సంప్రదించిన తర్వాతనే… అధికారుల సూచనల మేరకు కొందరు అభ్యర్థులకు కోల్పోయిన సమయానికి బదులుగా అదనపు సమయం మంజూరు చేయబడిందని, పరీక్ష ప్రశాంతంగా నిర్వహించబడిందని తెలిపింది. అక్రమాలకు పాల్పడితే ఇన్విజిలేటర్లపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది.