తెలంగాణ రాష్ట్రంలో 17,516 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి టీఎస్‌ఎల్పీఆర్బీ ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఎస్సై, ఏఎస్ఐ పోస్టుల అభ్యర్థుల చివరి లిస్ట్ ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం 587 ఎస్సై పోస్టులకు గాను 434 మంది పురుషులు, 153 మంది మహిళలను టీఎస్ఎల్పీఆర్బీ ఎంపిక చేసినట్లు ప్రకటించింది. కాగా, ఈ ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలను రేపు ఉదయం నుంచి వెబ్ సైట్‌లో ఉంచుతామని వెల్లడించింది. మరోవైపు సెప్టెంబర్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల తుది ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Also Read : TS Assembly: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆమోదం
గతేడాది ఆగస్టు 7న ప్రాథమిక రాతపరీక్షతో ఈ నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఫలితాల జాబితా వెలువరించడంతో ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల గుణగణాలు, ప్రవర్తన, క్రిమినల్ కేసులపై TSLPRB ఆరా తీయనుంది. గరిష్ఠంగా పది రోజుల్లోనే స్పెషల్ బ్రాంచ్ విభాగంతో విచారణ జరిపించిన అనంతరం అభ్యర్థులకు ఎంపిక లేఖలు పంపనుంది. దీన్నిబట్టి ఆగస్టు రెండో వారంలోగా అర్హుల జాబితాను పోలీసు, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు ఇలా అన్ని విభాగాలకు పంపించనుంది.