అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో షాకిచ్చారు. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై కఠిన ఆంక్షలు విధించారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం అదనపు సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు.
డిసెంబర్ 28 నుంచి ఇరాన్లో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. అయితే భద్రతా దళాల కాల్పుల్లో 30 వేల మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ట్రంప్ బెదిరింపులకు దిగారు. నిరసనకారులను చంపితే దాడులు చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా యూఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌక అరేబియా సముద్రానికి చేరుకుంది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.
ఇలాంటి టెన్షన్ వాతావరణంలో ఇరాన్‌పై మరో కఠిన వైఖరి తీసుకున్నారు. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై అదనపు సుంకాలు విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై శుక్రవారం ట్రంప్ సంతకం చేశారు. వైట్‌హౌస్ ప్రకారం.. ఇరాన్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం అదనపు సుంకం విధించవచ్చని పేర్కొంది.
ఇరాన్‌కు సంబంధించిన వస్తువులు, సేవలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కొనుగోలు దేశాలపై సుంకాలు అమలవుతాయి. ఈ ఆదేశం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి సుంకాలు విధించవచ్చు. అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధానం, ఆర్థిక ప్రయోజనాలను కాపాడటానికి ఈ చర్య తీసుకున్నట్లు వైట్‌హౌస్ తెలిపింది.
కార్యనిర్వాహక ఉత్తర్వు ప్రకారం… సుంకాలు విధానాన్ని అమలు చేయడానికి, నిబంధనలు, మార్గదర్శకాలను జారీ చేయడంతో సహా సంబంధిత చర్యలు అమలు చేయడానికి విదేశాంగ కార్యదర్శి, యునైటెడ్ స్టేట్స్ వాణిజ్య ప్రతినిధికి అధికారం ఇచ్చింది. ఇరాన్ దుర్మార్గపు చర్యను అడ్డుకునే భాగంలో ఈ చర్య తీసుకున్నట్లు వైట్‌హౌస్ స్పష్టం చేసింది. ఇరాన్ అణు సామర్థ్యాలను అనుసరిస్తుందని.. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందని… బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని అనుసరిస్తుందని.. ప్రాంతీయ అస్థిరతను పెంచుతోందని అమెరికా ఆరోపించింది. మధ్యప్రాచ్యంలో ప్రాక్సీ ఉగ్రవాద గ్రూపులకు ఇరాన్ మద్దతు ఇస్తుందని.. సొంత పౌరులను అణిచివేస్తుందని… వనరులన్నింటినీ అణు, క్షిపణి కార్యక్రమాలకుు మళ్లిస్తుందని అమెరికా ధ్వజమెత్తింది.
ఇదిలా ఉంటే అమెరికన్లు ఇరాన్‌ను విడిచి పెట్టాలని అమెరికా హెచ్చరించింది. ఇక ప్రదర్శనలకు దూరంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. టెహ్రాన్‌లోని అమెరికా ప్రయోజనాలకు స్విట్జర్లాండ్ రక్షణగా పని చేస్తున్నట్లు వైట్‌హౌస్ తెలిపింది.
శుక్రవారం ఒమన్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య చర్చలు జరిగాయి. అయితే అణు ఒప్పందం చేసుకునేందుకు ఇరాన్ నిరాకరించింది. దీంతో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. మరో అవకాశాన్ని ట్రంప్ కల్పించారు. వచ్చే వారం మరోసారి చర్చలు ఉంటాయని ట్రంప్ వెల్లడించారు. ఈసారి కూడా చర్చలు ఫలించకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.