భారతదేశం, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణలో తన పరిపాలనా వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. భారత్, పాకిస్థాన్ మధ్య అణు యుద్ధం లాంటి పరిస్థితిని నివారించడంలో అమెరికా పెద్ద దౌత్య విజయాన్ని సాధించిందని చెప్పారు. అయితే ఈ అంశంలో తనకు సరైన క్రెడిట్ ఇవ్వలేదని ట్రంప్ అన్నారు. శనివారం స్టార్ గ్రూపునకు చెందిన ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. “భారతదేశం, పాకిస్థాన్ మధ్య తీవ్ర ద్వేషం ఉంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత ఎంతగా పెరిగిందంటే.. తదుపరి దశ అణ్వాయుధ దాడి అయ్యేది. నేను భారతదేశం, పాకిస్థాన్ లతో మాట్లాడినప్పుడు.. ఇరు దేశాలు ‘టైట్ ఫర్ టాట్’ అంటే ఒకరినొకరు తీవ్రంగా దాడి చేసుకుంటున్నారు. ఇరు దేశాలు చాలా కోపంగా ఉన్నాయని భావించాను. ఇవి చిన్న దేశాలు కావు, రెండూ అణుశక్తి సంపన్న దేశాలు. మధ్య కాల్పుల విరమణలో మా పరిపాలనా వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషించింది. కానీ నాకు ఆ క్రెడిట్ దక్కలేదు.” అని ట్రంప్ పేర్కొన్నారు.
READ MORE: Kedarnath: కేదార్‌నాథ్‌లో ఎయిర్ అంబులెన్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
కాగా.. ట్రంప్ గల్ఫ్‌లో నాలుగు రోజుల పర్యటన ముగించుకుని వాషింగ్టన్‌కు ప్రయాణమవుతున్న శుక్రవారం ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో ముచ్చటించారు. భారత్, పాక్ మధ్య కోపతాపాల స్థాయి మంచిది కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రెండు దేశాల కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం నడపడం పెద్ద విజయమని అభివర్ణించారు. మధ్యవర్తిత్వం నడిపినట్లు ఆయన చెప్పడం గత వారంరోజుల్లో ఇది ఏడోసారి. అల్-ఉదైద్ వైమానిక స్థావరంలో అమెరికా సైనిక సిబ్బందిని ఉద్దేశించి కూడా మాట్లాడారు. కాల్పుల విరమణ కొనసాగుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. ‘‘నేనే చేశానని చెప్పుకోవాలనుకోవడం లేదు. కానీ భారత్, పాకిస్థాన్ మధ్య గతవారం తలెత్తిన సమస్య తీవ్రతరం కాకుండా సద్దుమణగడానికి సాయం చేశాను. ఎన్నేళ్లు ఈ సమస్యపై పోరాటం చేస్తారు? నేను ఏ సమస్యనైనా పరిష్కరించగలను. వారిని కలిపి ఆ సమస్యను పరిష్కరిస్తాను’’ అని అన్నారు. ఈ ప్రకటన తర్వాత తాజాగా తనకు క్రెడిట్ రాలేదని చెప్పడం గమనార్హం.