Donald Trump: యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. వెనిజువెలాను తాత్కాలికంగా అమెరికానే పాలిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటించారు. భద్రతా పరమైన మార్పు జరిగే వరకు అమెరికా పాలన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఫ్లోరిడాలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. “దేశం స్థిరపడే వరకు, సురక్షితమైన మార్పు జరిగే వరకు మేమే పాలిస్తాం. మళ్లీ గతంలో లాగే పరిస్థితులు రావద్దు. అందుకే బాధ్యత తీసుకుంటున్నాం,” అని ట్రంప్ అన్నారు. అయితే ఈ పాలన ఎంతకాలం కొనసాగుతుందో, ఏ చట్టాల ఆధారంగా సాగుతుందో మాత్రం ఆయన వివరించలేదు. వెనిజువెలాలో ప్రభుత్వ మార్పు, అలాగే ఆ దేశ చమురు వనరులపై నియంత్రణ కీలక లక్ష్యాలని ట్రంప్ బహిరంగంగానే చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమెరికన్ చమురు కంపెనీలు అక్కడికి వెళ్లి వేల కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టి మౌలిక వసతులు పునరుద్ధరిస్తాయని, భారీగా చమురు విక్రయాలు జరుగుతాయని తెలిపారు.
చమురు మౌలిక వసతులను పునరుద్ధరించి దేశానికి ఆదాయం తీసుకొస్తామని, ఇది భాగస్వామ్య పాలనగా ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. వెనిజువెలా ప్రజలు సంపన్నులు, స్వతంత్రులు, సురక్షితంగా ఉంటారని వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికలు, అంతర్జాతీయ పర్యవేక్షణ, లేదా వెనిజువెలా నేతల ఆధ్వర్యంలో మార్పు గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అవసరమైతే మరో దశ సైనిక చర్యకు కూడా సిద్ధంగా ఉన్నామని ట్రంప్ చెప్పారు. ఈ చర్యలకు చట్టపరమైన ఆధారం ఏమిటన్నది అమెరికా ఇప్పటివరకు వెల్లడించలేదు. మడురోను వెనిజువెలా అధ్యక్షుడిగా అమెరికా గుర్తించలేదని చెప్పినా, మరో దేశంపై దాడి చేసి పాలన చేపట్టే హక్కు ఎలా వస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన 1990లో పనామాపై అమెరికా దాడి చేసి నాయకుడు నోరియేగాను అరెస్ట్ చేసిన సంఘటనను గుర్తు చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అయితే అప్పట్లో పనామాను తామే పాలిస్తామని అమెరికా ప్రకటించలేదు.
READ MORE: Lenin : లెనిన్ నుంచి భాగ్యశ్రీ లుక్ రిలీజ్
అంతకుముందే అమెరికా ప్రత్యేక దళాలు వెనిజువెలాపై మెరుపు దాడి చేసి అధ్యక్షుడు నికోలాస్ మడురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మడురో దంపతులను అదుపులోకి తీసుకున్న తర్వాత అమెరికా నేవీ నౌకలో వెనిజువెలా నుంచి తరలించారు. శనివారం తెల్లవారుజామున ఈ ఆపరేషన్ జరిగింది. కారకాస్ నగరంలో తక్కువ ఎత్తులో విమానాలు దూసుకెళ్లిన సమయంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కనీసం ఏడు పేలుళ్లు సంభవించాయని స్థానికులు చెప్పారు. సైనిక స్థావరాల వద్ద మంటలు, పొగలు కనిపించాయి. ఒక ప్రధాన సైనిక కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. ఈ సమయంలో ఫోర్ట్ టియూనా సైనిక స్థావరంలోని నివాసం నుంచి మడురో, ఫ్లోరెస్‌లను అదుపులోకి తీసుకున్నారని వెనిజువెలా అధికారులు తెలిపారు. పాలక పార్టీ నేత నహూమ్ ఫెర్నాండెజ్ ఈ ఘటనను “అపహరణ”గా అభివర్ణించారు. కొద్ది గంటలకే ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో అమెరికా యుద్ధ నౌకపై ఉన్న మడురో ఫోటోను పోస్టు చేశారు. కళ్లకు గంతలు, చేతులకు బేడీలు వేసిన స్థితిలో ఆయన కనిపించారు. మడురోను యూఎస్‌ఎస్ ఐవో జిమా నౌకలో న్యూయార్క్‌కు తీసుకెళ్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికా న్యాయ శాఖ కొత్తగా కేసులు నమోదు చేసి, మడురో దంపతులు డ్రగ్ ఉగ్రవాద కుట్రలో పాలుపంచుకున్నారని ఆరోపించింది. అమెరికాలో వారిపై విచారణ జరగనుందని అధికారులు తెలిపారు.