తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. టీఆర్ఎస్ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ ఇంకా క్షేత్రస్థాయిలో బలపడాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించారు. ఈమేరకు గులాబీ బాస్ ఆదేశాలతో నేతలంతా ఆయా జిల్లాలో టీఆర్ఎస్ సభ్యత్వాలను రికార్డు స్థాయిలో నమోదు చేయించి సంస్థాగత ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే గ్రామ, పట్టణ, మండల కమిటీల ఎంపికను టీఆర్ఎస్ అధిష్టానం దాదాపు పూర్తి చేసింది.
ఇక జిల్లా కమిటీలు సైతం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో పూర్తవుతాయని అంతా భావించారు. అయితే అలాంటిదేమీ జరుగకపోగా రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై టీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడి పోస్టుకు నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. అయితే జిల్లా కమిటీల ఎంపిక పూర్తి చేయకుండా రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికను అధిష్టానం చేపట్టడంతో వీరి ఎంపిక ఉంటుందా? ఉండదా? అనే చర్చ జోరుగా సాగుతోంది. దీంతో ఈ పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు నిరుత్సాహానికి గురవుతున్నారని సమాచారం.
తెలంగాణలో జిల్లాల విభజన తర్వాత పెద్దసంఖ్యలో జిల్లా అధ్యక్ష పదవుల కోసం పోటీ ఏర్పడింది. మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతుతో జిల్లా అధ్యక్ష పదవీని దక్కించుకునేందుకు పార్టీలోని ముఖ్య నేతలు ప్రయత్నాలు మొదలెట్టారు. గ్రామ, పట్టణ, మండల కమిటీలు పూర్తవడంతో జిల్లా కమిటీ ఎంపిక జరుగుతుందని అంతా భావించారు. అయితే టీఆర్ఎస్ అధిష్టానం జిల్లా కమిటీల ఎంపికను పక్కన పెట్టి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికను చేపట్టడంతో ఆశావహులంతా ఖంగుతిన్నారు.
ప్రస్తుతం హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో జిల్లా కమిటీల ఎంపిక ఉండదని తెలుస్తోంది. అదేవిధంగా వచ్చే నెలలో ప్లినరీ సమావేశాలు ఉన్నాయి. దీంతో ఈ ప్రక్రియ ముగిశాకగానీ జిల్లా కమిటీల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం లేదని టీఆర్ఎస్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి. దీనికితోడు త్వరలోనే టీఆర్ఎస్ బృందం తమిళనాడులో పర్యటించనుంది. అక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటానికి గల కారణాలను తెలుసుకోనున్నారు. ఈ నివేదిక ఆధారంగానే టీఆర్ఎస్ లోనూ అలాంటి కమిటీలను ఏర్పాటు చేయనున్నారని టాక్ విన్పిస్తోంది.
తమిళనాడు మాదిరిగానే నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు లేదా ఇన్ ఛార్జిలకు బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక జిల్లా స్థాయిలో కన్వీనర్, కో కన్వీర్ తోపాటు మరో రెండు మూడు పదవులను భర్తీ చేయనున్నారని సమాచారం. వీటి ద్వారానే జిల్లా స్థాయి నుంచి కింది స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయనున్నారట. మొత్తానికి టీఆర్ఎస్ అధిష్టానం జిల్లా కమిటీల ఎంపికపై భారీగానే కసరత్తు చేస్తుండటం ఆసక్తిని రేపుతోంది.