ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురు పిల్లలను దారుణంగా చంపిన తర్వాత తండ్రి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ బృందంతో సహా భారీ పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. తండ్రి తన నలుగురు అమాయక పిల్లల గొంతు కోసి చంపి.. ఆ తర్వాత అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఈ సంఘటన తర్వాత ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. ప్రస్తుతం పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని చర్యలు ప్రారంభించారు.
READ MORE: Srisailam: శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం.. ఎప్పటి వరకు అంటే?
అసలు విషయం ఏమిటి?
ఈ సంఘటన రోజా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మాన్పూర్ చాచారి గ్రామంలో జరిగింది. రాజీవ్ కి నలుగురు పిల్లలు (ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు). అతని భార్య పుట్టింటికి వెళ్లింది. పిల్లలు అతడి వద్దే ఉన్నారు. బుధవారం రాత్రి రాజీవ్ తన పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రించాడు. రాజీవ్ తండ్రి బాబా ఇంటి బయట నిద్రిస్తున్నాడు. ఈ రోజు ఉదయం నిద్ర లేచిన ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు తలుపులు తెరవడానికి ప్రయత్నించగా.. లోపలి నుంచి తాళం వేసి ఉండటాన్ని గమనించాడు. ఆ తరువాత బాబా ఏదో విధంగా ఇంటి లోపలికి చేరుకున్నాడు. లోపల ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు. తన మనవడు, మనవళ్ళ రక్తంతో తడిసిన మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజీవ్ తన 13 ఏళ్ల కూతురు స్మృతి, 9 ఏళ్ల కూతురు కీర్తి, 7 ఏళ్ల కూతురు ప్రగతి, 5 ఏళ్ల కొడుకు రిషబ్ లను గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. రాజీవ్ కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.