తెలంగాణలో గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కుండపోత వర్షాలు పడటంతో.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. రాష్ట్రంలోని పలు చోట్ల రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో NH44పై నిన్నటి (శనివారం) నుంచి వెహికిల్ రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు.
Read Also: Tomato: రూ.3లక్షల విలువైన టమాటాల చోరీ.. వందల కిలోమీటర్ల దూరంలో విక్రయం
మరోవైపు మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో పెన్ గంగ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం డొలరా దగ్గర ఉన్న పెన్ గంగ నది ఉగ్ర రూపం దాల్చింది. 50 అడుగుల ఎత్తులో ఉన్న వంతెనను తాకుతూ పెన్ గంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగ విజృంభించడంతో నేషనల్ హైవే 44పై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పెన్ గంగ నది వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో అప్రమత్తమైన అధికారులు.. ముందుగానే మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య రూట్‌లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
Read Also: Bro: ట్రెండింగ్ లో పవర్ స్టార్… టైమ్ వచ్చిందో ‘బ్రో’
వరద ఉధృతి తగ్గిన తర్వాత తిరిగి వాహనాల రాకపోకల పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులు అలర్ట్‌గా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అయితే, పెన్ గంగాలో గంట గంటకు నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ఇన్ ఫ్లో 4 లక్షల 80 వేల క్యూసెక్కులుగా ఉంది. చెనక కోరాట బ్యారేజ్ దగ్గర పెన్ గంగా నిండుగా ప్రవహించడంతో చెనాక కోరాట పంప్ హౌస్ జలదిగ్భందంలో చిక్కుకుంది. పిప్పర్ వాడ టోల్ ప్లాజా దగ్గర వాహనాలు నిలిపివేశారు. NH44 మూసివేసినందున పెన్ గంగా ప్రవాహం తగ్గే వరకు హైవే పైకి రావొద్దని అధికారులు, పోలీసులు తెలిపారు. నేషనల్ హైవే44 పై నిన్న రాత్రి నుంచి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పెన్ గంగా పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాల్లోకి బ్యాక్ వాటర్ వచ్చి చేరుతోంది.