భారీ భద్రత మధ్య గ్రూప్-2 పరీక్షలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు గ్రూప్-2 ప్రధాన పరీక్ష జరగనుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. టైం దాటితే లోపలకు అనుమతించేది లేదని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
కుదేలైన సండే చికెన్ సేల్స్:
బర్డ్ ఫ్లూ భయంతో సండే చికెన్ సేల్స్ కుదేలైపోయాయి. కేజీ 30 రూపాయలు తగ్గించి అమ్మినా.. కొనే దిక్కులేదు. అదే సమయంలో మటన్ 1000 రూపాయలు మార్క్ దాటేస్తే.. ఫిష్ 200 రూపాయలకు పైనే పలుకుతోంది. వైరస్ భయం మనసులో పెట్టుకుని.. చికెన్ తినడం రిస్కే అంటున్నారు జనాలు. అటు బిర్యానీ పాయింట్లు, హోటళ్లలో 40 శాతం అమ్మకాలు పడిపోయాయి. దాంతో వ్యాపారాలు లబోదిబో అంటున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో నాటు కోళ్ల కొనుగోలుకు బారులు తీరారు జనం. చికెన్ షాపులు వెలవెల పోతూ ఉంటే.. నాటుకోళ్ల అమ్మకాలు జరిపే ప్రాంతాలు మాత్రం కలకలలాడుతున్నాయి. ఇదే అదునుగా భావించిన చెన్నై వ్యాపారులు ప్రత్యేక వాహనాల్లో నాటుకోళ్లను తెచ్చి అధిక ధరలకు అమ్ముతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో పెరిగే నాటుకోళ్ల అమ్మకాలు జోరందుకోవడంతో.. చెన్నై వ్యాపారులు దానిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గత వారంలో కిలో నాటుకోడి 500 రూపాయలు ధరలు పలకగా.. ప్రస్తుతం 750 రూపాయలు పలుకుతోంది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ప్రజలు మాత్రం నాటు కోళ్ల కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు.
భర్త వేధింపులకు మరో మహిళ బలి:
హైదరాబాద్ నగరంలోని రామంతాపూర్‌లో మనీషా (22) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఏడాది క్రితం సంపత్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న మనీషా, ప్రస్తుతం రామంతాపూర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తోంది. అయితే గత రాత్రి ఆమె అనుమానాస్పదంగా మరణించడం కుటుంబ సభ్యులను, స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. మనీషా మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనపై మృతురాలి బంధువులు ఆమె భర్త సంపత్ వేధింపులే మరణానికి కారణమని ఆరోపిస్తున్నారు. మనీషా తల్లిదండ్రులు ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో చిన్న చిన్న గొడవలు కాస్త ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయి. చూడాలి మరి పొలిసు అధికారులు ఈ కేసును ఎంత త్వరగా చేధిస్తారో.
ఘనంగా జరగనున్న బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేకం:
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం ఘనంగా జరగనుంది. ఈ మహోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి ఉదయం 11:00 గంటలకు హెలిప్యాడ్ ద్వారా యాదగిరిగుట్టకు రానున్నారు. అనంతరం 11:25 నుండి 12:15 వరకు జరిగే కుంభాభిషేకంలో పాల్గొననున్నారు. ఇక ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు కొంతకాలం భక్తుల ప్రవేశాన్ని పరిమితం చేశారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులకు దర్శనాలు నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. 12:25 నుండి 12:45 వరకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1:30 గంటలకు సీఎం హెలిప్యాడ్ నుంచి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.
రైతులకు గుడ్ న్యూస్.. రేపే పీఎం కిసాన్ నిధులు జమా:
పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాని మోడీ ఈ పథకం కింద 19వ విడతగా మొత్తం రూ.22వేల కోట్లను రేపు (ఫిబ్రవరి 24) విడుదల చేయనున్నారు. బీహార్‌లోని భాగల్పూర్‌లో జరగనున్న ఒక కార్యక్రమంలో ప్రధాని ఈ నిధులను రిలీజ్ చేస్తారు. అయితే, ఈ ఏడాది చివరలో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని ఈసారి భాగల్పూర్‌ను వేదికను ఎంచుకున్నారు. రైతులకు ఏటా ఒక్కో విడత రూ.2వేల చొప్పున 3 విడతల్లో 6 వేల రూపాయల సాయం అందించే పీఎం కిసాన్ పథకాన్ని కేంద్ర సర్కార్ 2019 ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభించింది. ఇక, ఇప్పటి వరకు సుమారు 11 కోట్ల మంది రైతులకు 18 వాయిదాల్లో రూ.3.46 లక్షల కోట్లను మోడీ ప్రభుత్వం చెల్లించింది.
హైకోర్టు కీలక తీర్పు:
ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్న వివాహిత మహిళ దాఖలు చేసిన అత్యాచారం కేసుని మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. పెళ్లి చేసుకుంటాననే హామీపై వివాహిత స్త్రీ మరొక పురుషుడితో శారీరక సంబంధానికి సమ్మతించానని చెప్పుకోవడానికి వీలులేదని జస్టిస్ మణీందర్ ఎస్ భట్టీ తన తీర్పులో వెల్లడించారు. తప్పుడు వివాహ హమీ సాకుతో శారీరక సంబంధానికి అంగీకరించానని వివాహిత స్త్రీ చెప్పడం సరైనది కాదని హైకోర్టు పేర్కొంది. వివాహిత తనతో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు ఫిర్యాదు చేయడంతో ఒక వ్యక్తిపై అత్యాచారం కేసు నమోదైంది. ఈ కేసు ఫిబ్రవరి 10న హైకోర్టులో విచారణకు వచ్చింది. సదరు వ్యక్తిపై ఉన్న అత్యాచారం కేసుని న్యాయమూర్తి కొట్టివేశారు. సదరు పురుషుడు తన భార్యకు విడాకులు ఇచ్చి, తనను పెళ్లి చేసుకుంటాననే హామీ ఇచ్చినట్లు, దీని ఆధారంగానే అతడితో లైంగిక సంబంధం ఏర్పరచుకున్నట్లు వివాహిత పేర్కొంది.
ఉక్రెయిన్ శాంతి చర్చల్లో జెలెన్ స్కీ అంత ముఖ్యం కాదు:
డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారం నుంచి తాను ఎన్నికైన వెంటనే ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగిస్తానని హామీ ఇచ్చారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సందర్భాల్లో శాంతి చర్చలపై మాట్లాడారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా శాంతి స్థాపనపై చర్చించారు. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. జెలెన్ స్కీని నియంతగా పోల్చుతూ, ఉక్రెయిన్‌ని నాశనం చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా, ట్రంప్ ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్ స్కీ, యుద్ధాన్ని ముగించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలకు అమెరికా నాయకత్వం వహిస్తుందని ట్రంప్ చెప్పారు. ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో జరిగే చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హాజరుకావడం తప్పనిసరి అని తాను భావించడం లేదని ట్రంప్ శుక్రవారం అన్నారు. అతడు మూడు సంవత్సరాలుగా యుద్ధంలో ఉన్నాడు, అతడికి ఒప్పందాలు చేసుకోవడం అతడికి చాలా కష్టం అని ట్రంప్ అన్నారు.
ఫ్లాప్‌లో ఉన్న డైరెక్టర్ తో మహేష్ సినిమా చేయడు:
వరుస ఫ్లాప్ లతో పూరి జగన్నాథ్ చితికిన పడిపోయాడు. ప్రజంట్ కథలు సిద్ధంగా ఉన్న హీరోలు డేట్ లు ఇవ్వడంలేదట. అయితే పూరి ఇంకా మహేష్ బాబు కాంబినేషన్‌కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. దీంతో వీరి కాంబినేషన్ మళ్లీ ఎప్పుడు వస్తుందా? అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూరి.. మహేష్ బాబు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మీరు మహేష్ తో సినిమా చేస్తే చూడాలి అని ఉంది అని యాంకర్ అడగటంతో.. ‘ మీరు చెబితే నమ్మరు కానీ మహేశ్ నాతో హిట్ పడితే సినిమాలు చేస్తారు. సక్సెస్ లో ఉంటేనే ఓకే చెప్తారు. కానీ నేను ఫ్లాప్స్‌లో ఉన్నప్పుడు కూడా మహేశ్ బాబు అభిమానులు మహేష్ అన్నతో సినిమా ఎప్పుడన్నా? అని అడుగుతున్నారు. మహేశ్ మాత్రం నేను సక్సెస్ లో ఉంటేనే నాతో సినిమా చేస్తాడు. ఆయన కంటే ఆయన అభిమానుల పైనే నాకు ఎక్కువ ఇష్టం ఉంటుంది. కనీసం వాళ్ళు నన్ను ఎంతగానో నమ్ముకున్నందుకు.. మహేశ్‌కు నాపై నమ్మకం లేకపోవడంతో కాంబో సెట్ అవ్వడం లేదు’ అని చెప్పుకొచ్చాడు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నెట్ ఫ్లిక్స్ లో డాకుమహారాజ్ సంచనలం:
నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘డాకు మహారాజ్’. బాలయ్య కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సిన వరల్డ్ వైడ్‌గా రూ. 170 కోట్లకు పైగా వరకు గ్రాస్, రూ.85 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో బాలయ్య వరుసగా వంద కోట్లు కొల్లగొట్టిన నాలుగు సినిమాలు కలిగిన సీనియర్ హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేశారు. అయితే థియేటర్లో దుమ్ముదులిపిన డాకు మహారాజ్ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. ఫిబ్రవరి 21 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చింది నెట్ ఫ్లిక్స్. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లోను సెన్సేషన్ చేస్తుంది డాకు మహారాజ్.ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న సినిమాలలో డాకు మహారాజ్ మొదటి స్తానంలో నిలిచింది. అలాగే బంగ్లాదేశ్, మాల్దీవ్స్, శ్రీలంక, సింగపూర్, నైజీరియా, యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఎమిరేట్స్, కెన్యా, ఒమాన్ లో టాప్ – 2లో ట్రెండింగ్ అవుతుంది. అలాగే పాకిస్తాన్ లోను టాప్ -2 లో ట్రేండింగ్ అవుతున్నాడు డాకు మహారాజ్. ప్యూర్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కిన డాకు మహారాజ్ కు ఓటీటీ లోను అదరగొడుతుంది. పుష్ప 2 తర్వాత వరల్డ్ వైడ్ గా ట్రెండింగ్ లో టాప్ లో నిలిచింది డాకు మహారాజ్. ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం ఇటీవల కాలంలో బెస్ట్ మ్యూజిక్ అనే చెప్పాలి.
నేటి మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడేది అనుమానమే:
Virat Kohli: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అనగానే క్రికెట్ అభిమానుల్లతో ఎంతో ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ దాయాది పోరు కోసం ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం దుబాయ్ లో జరిగే ఈ మ్యాచ్ లో ఇద్దరు ప్లేయర్స్ ఆడతారా లేదా అనేది అనుమానంగా కలుగుతుంది. అందులో ఒకరు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అయితే రెండో వారు వికెట్ కీపర్ రిషభ్ పంత్.. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు ఆడకపోయినా కూడా జట్టుకు బిగ్ షాక్ అని చెప్పాలి. అయితే, కింగ్ కోహ్లీ తుది జట్టులో కీ ప్లేయర్.. అతను ఫాంలో ఉన్న లేకపోయినా జట్టులో ఉంటే అదొక బలం అని చెప్పాలి. ప్రత్యర్థి ఎవరైనా కాస్త జాగ్రత్తగా ఉంటారు. ఈ రోజు పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో విరాట్ ఆడేది అనుమానంగా ఉంది. ఎందుకంటే ప్రాక్టీస్ చేసే సమయంలో కోహ్లీ కాలికి దెబ్బ తగిలినట్టు కనిపించింది. అతను ఐస్ ప్యాక్ పెట్టుకుని ఎక్కువ సేపు కూర్చోవడంతో.. ఈ అనుమానాలన్నీ స్టార్ట్ అయ్యాయి. కానీ, బీసీసీఐ దీని గురించి మాత్రం ఎలాంటి అనౌన్స్ చేయలేదు.. కాబట్టి తుది ఆడతాడనే అందరూ అనుకుంటున్నారు. ఏది ఏమైనా మ్యాచ్ ముందు వరకు కోహ్లీ ఆడేది అనుమానంగా ఉంది.
టీమిండియా స్పిన్ చూసి మేము ఆందోళన చెందడం లేదు:
టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడంపై పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ అకిబ్ జావేద్ స్పందించారు. ఈ సందర్భంగా భారత్ స్పిన్ దాడి గురించి తమ జట్టు ఎలాంటి ఆందోళన చెందడం లేదని అన్నారు. తమ జట్టులో స్పిన్నర్లు లేకపోవడం వల్ల ఎటువంటి ప్రతికూలత లేదన్నారు. తమ బలానికి తగ్గట్టుగా ఆడతామని చెప్పుకొచ్చారు. మాకు ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు ఉన్నారు.. ఈరోజు జరిగే మ్యాచ్ లో షాహీన్, నసీమ్, హారిస్‌తో కూడిన పేస్ దళం ఉందన్నారు. 3-4 స్పిన్నర్లను ఆడాలనే ప్రణాళికను టీమిండియా కలిగి ఉంది.. అదే వారి ప్రణాళిక.. మేము మా స్వంత బలంతో మా క్రికెట్ ఆడాలి.. మా జట్టులో ఎటువంటి పెద్ద మార్పులు కనిపించవు అని జావేద్ వెల్లడించారు.