వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటన:
మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గంట ముందే గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ముందుగా ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరు మిర్చి యార్డ్‌కు బయలుదేరేందుకు షెడ్యూల్ ఖరారు కాగా.. తాజాగా ఓ గంట ముందే (9 గంటలకు) వెళ్లేలా షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. ఉదయం 10 గంటలకు మిర్చి యార్డ్‌కు వద్దకు చేరుకుని.. గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులతో జగన్ మాట్లాడనున్నారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున జగన్ పర్యటనకు అనుమతి లేదని మిర్చి యార్డ్ అధికారులు అంటున్నారు. తాము సభలు, సమావేశాలు పెట్టడం లేదని.. కేవలం గిట్టుబాటు ధరపై రైతులతో జగన్ మాట్లాడుతారని వైసీపీ వర్గాలు మిర్చి యార్డ్ అధికారులకు తెలిపారు. కేవలం పర్యటన షెడ్యూల్‌ను మాత్రమే కలెక్టర్, ఎస్పీలకు పంపారని యార్డ్ అధికారులు అంటున్నారు. ఇప్పటికే పరిస్థితిని ఎలక్షన్ కమిషన్‌కు నివేదించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను బట్టి జగన్ పర్యటనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జగన్ మిర్చి యార్డ్ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు:
శ్రీశైలం మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల దేవాలయాలను, మండపాలను విద్యుద్దీపాలతో శోభాయమానంగా ఆలయ అధికారులు ముస్తాబు చేశారు. ఈరోజు (ఫిబ్రవరి 19) నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మార్చి 1వ తేదీ వరకు జరగనున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఫిబ్రవరి 23న సీఎం చంద్రబాబు నాయుడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఉత్సవాల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బ్రహ్మోత్సవాలలో పాల్గొననున్నారు. బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని.. అన్ని ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు సిద్దమయ్యారు.
బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం:
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు తీసుకునేలా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ విస్తృత స్థాయి సమావేశం నేడు (ఫిబ్రవరి 19) జరగనుంది. ఈ సమావేశానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన వహించనున్నారు. గత ఆరు నెలలుగా తెలంగాణ భవన్‌కు రాకపోయిన కేసీఆర్, నేడు భవన్‌కు రానుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం ప్రారంభం కానుండగా, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ నేతృత్వంలో కీలక చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్లు, జెడ్పీ మాజీ చైర్మన్లు సహా మొత్తం 400 మంది కీలక నేతలకు ఆహ్వానం పంపించారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తిచేసుకుంటుండడంతో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. పార్టీ స్థాపన దినోత్సవమైన ఏప్రిల్ 27న ప్రతినిధుల సభ నిర్వహించేందుకు యోచిస్తున్నారు.
పుణ్యస్నానం చేసిన కేంద్ర మంత్రి:
భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ధార్మిక సమ్మేళనాల్లో మహా కుంభమేళా ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహోత్సవం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా పరిగణించబడుతుంది. ప్రపంచం నలుమూలల నుండి కోట్ల సంఖ్యలో భక్తులు ఈ మహామేళాకు తరలి వస్తున్నారు. గంగ, యమునా, సరస్వతీ నదుల సంగమ స్థానంలో పుణ్యస్నానం ఆచరించడం ద్వారా మోక్షాన్ని పొందుతారనే విశ్వాసంతో భక్తజనం ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రయాగరాజ్ కుంభమేళా సందర్భంగా.. భారత కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “కుంభమేళా మహోత్సవంలో స్నానం చేయడం ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది” అని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటైన కుంభమేళా, సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెబుతోందని ఆయన పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తులు కుంభమేళా సందర్భంగా స్నానం ఆచరిస్తూ తమ ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడం, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల పెరుగుతున్న భక్తిభావానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు.
పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన:
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షంతో పాటు హిమపాతం కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో బుధవారం భారీ వర్షం కురుస్తుందని.. అలాగే హిమపాతం కూడా భారీగా ఉంటుందని తెలిపింది. గురువారం జమ్మూకాశ్మీర్, లడఖ్, హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా ఇదే మాదిరిగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, యూపీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని.. ఈ నేపథ్యంలో అస్సాం మరియు పొరుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో నాగాలాండ్ సమీప ప్రాంతంలో తుఫాన్ ఏర్పడనుంది. దీంతో రాబోయే ఏడు రోజుల్లో ఈశాన్య వర్షాల్లో వర్షాలు కురవనున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు అస్సాం, మేఘాలయతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
సీఈసీ నియామకంపై దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ:
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ నియామకాన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జ్ఞానేష్ కుమార్ వ్యతిరేకంగా మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లతో పాటు 2023 చట్టం ప్రకారం సీఈసీ, ఈసీల నియామకాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ఫిబ్రవరి 19న (బుధవారం) ‘‘ప్రాధాన్యత ప్రాతిపదికన’’ విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. సీఈసీ నియామక ప్రక్రియను సవాలు చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సహా పలు సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరపున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించనున్నారు. 2023లో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను సీఈసీ నియామకంలో పాటించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. సీఈసీ, ఈసీల ఎంపిక, నియామకాలు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ద్వారా జరుగుతాయని రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. తాజాగా జరిగిన సీఈసీ నియామకం ఆ పద్ధతిలో జరగకపోవడంతో సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించారు.
భారత్కి 21 మిలియన్ డాలర్లు ఎందుకివ్వాలి:
భారత దేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి అందిస్తున్న 21 మిలియన్ డాలర్ల సహయాన్ని ఇటీవల యూఎస్ నిలిపి వేసిన విషయం మన అందిరికి తెలిసిందే. ఈ నిర్ణయాలకు సంబంధించిన దస్త్రాలపై ప్రిసిడెంట్ ట్రంప్ మంగళవారం నాడు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అసలు ‘ఇండియాకు 21 మిలియన్ డాలర్ల సాయం ఎందుకివ్వాలి అని ప్రశ్నించారు. వాళ్ల దగ్గరే చాలా డబ్బులు ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికాపై వాళ్లు భారీగా ట్యాక్సులు వేస్తున్నారని ఆరోపించాడు. నాకు భారత దేశం అన్నా, ఆ దేశ ప్రధాని అన్నా గౌరవం ఉంది అని చెప్పుకొచ్చాడు.
ఆ పనిని ఇప్పుడు ఇష్టంగా చేస్తున్నా:
బిగినింగ్ లోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ నభా నటేష్. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నభా.. మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. గ్లామర్, యాక్టింగ్ పరంగా వెండితెరపై మాయ చేసింది. అనంతరం రామ్ పోతినేని సరసన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాతో నభా ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. మాస్ డైలాగ్‌లతో తెలంగాన యాసలో ఇరగధీసింది. అనంతరం డిస్కో రాజా, అదుగో, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో.. వంటి వరుస సినిమాల్లో అలరించింది ఈ చిన్నది. ఇక కెరీర్ మంచి ఫామ్ లో ఉండగా అదే సమయంలో ప్రమాదానికి గురవ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు తిరిగి కోలుకుని ‘డార్లింగ్’ సినిమాలో నటించింది. ప్రస్తుతం నిఖిల్‌తో ‘స్వయంభు’ సినిమా చేస్తుంది. ఇక మూవీ తప్ప నభా చేతిలో కొత్త సినిమా లేవీ లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది నభా ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో దర్శనమిస్తూ.. పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో నభా తన యాక్సిడెంట్ గురించి తన ఫిట్ నెస్ గురించి మాట్లాడింది.. ‘యాక్సిడెంట్ జరిగిన తర్వాత వర్కవుట్స్ చేయడాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను. శరీరంపై మరింత అవగాహన పెరిగింది. మొబిలిటీ ఎక్సర్సైజ్‌లు, స్విమ్మింగ్, డ్యాన్సింగ్ ఎక్కువగా చేస్తున్నా.. యాక్సిడెంట్‌కు ముందు హీరోయిన్ ని కాబట్టి ఎదో మొక్కుబడిగా వర్కవుట్స్ చేసేదాన్ని.. కానీ ఇప్పుడు నా ఆలోచన విధానం మొత్తం మారిపోయింది’ అని చెప్పుకొచ్చింది నభా నటేష్.
రష్మిక దారిలో రుక్మిణి:
సప్తసాగార దాచే ఎల్లో సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఓవర్ నైట్ స్టార్ బ్యూటీ మారింది శాండిల్ వుడ్ చిన్నది రుక్మిణీ వసంత్. ఈ సినిమాతో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు కానీ ఆ తర్వాత వచ్చిన మూడు చిత్రాలు ప్లాప్ గా మారడంతో ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయ్యింది. తెలుగులో ఫస్ట్ సినిమాతోనే బ్యాడ్ ఇంప్రెషన్ వేయించుకుంది.అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ లాంచ్ అవుదామనుకుంది కానీ ఆ సినిమా ప్లాప్ రుక్మిణి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. ఎప్పుడు తీశారో ఎప్పుడు దింపారో తెలియదు లేదు ఆడియన్స్ కు. దీంతో రుక్మిణీ ఫెర్ఫామెన్స్ చూపించడానికి ఏమీ లేకుండా పోయింది. ఇక డౌన్ ఫాల్ అవుతున్న టైంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన భైరతి రణగల్ ఆమె ఖాతాలో సూపర్ హిట్ వేసి మళ్లీ ట్రాక్ ఎక్కించాడు. కన్నడ ఇండస్ట్రీలో హిట్స్ వస్తుంటే ఆమె మాత్రం పొరుగు పరిశ్రమపై కాన్సట్రేషన్ చేస్తుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో ఏస్ లో నటిస్తోంది. అంతలో మరో క్రేజీ ఆఫర్ కొల్లగొట్టింది. అదే శివకార్తీకేయన్- మురుగుదాస్ కాంబోలో వస్తోన్న మదరాసిలో యాక్ట్ చేస్తోంది. ఇలా రుక్కు ఫెర్మామెన్స్ కు ఫిదా అయిన కోలీవుడ్ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. ఇదే కాదు నీల్- తారక్ కాంబోలో వస్తోన్న క్రేజీ ప్రాజెక్టులో ఈ కన్నడ కస్తూరినే హీరోయిన్. మరీ పొరుగు ఇండస్ట్రీపై ఫోకస్ చేసి ఓన్ పరిశ్రమను మర్చిపోతున్నఈ భామ మరో రష్మికలా మారబోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కన్నడ ఫ్యాన్స్.
నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ:
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈరోజు (ఫిబ్రవరి 19) నుంచి ప్రారంభం కానుంది. కరాచీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్- న్యూజిలాండ్‌తో తలపడటంతో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఇక, రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్‌తో తన మొదటి మ్యాచ్ ను ఆడనుంది. అయితే, 2017లో రద్దై.. మళ్లీ ఇప్పుడు పునరుజ్జీవం పొందనున్న టోర్నీకి పాకిస్థాన్, యూఏఈ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్ టోర్నీలో తలపడుతున్నప్పటికి వెస్టిండీస్, శ్రీలంక జట్లు టోర్నీకి కనీసం అర్హత కూడా సాధించలేకపోయాయి.