చైర్మన్ ఇంట్లోనే 17 మంది కౌన్సిలర్లు:
తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ‘చలో తుని’ పిలుపునిచ్చిన నేపథ్యంలోరాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటి వద్ద ఉధృత పరిస్థితి నెలకొంది. రాజా ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. తుని వెళ్లొద్దంటూ రాజాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. తుని వెళ్లకుండా పోలీసులు రాజాను అడ్డుకోవడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దాంతో రాజమండ్రి ప్రకాష్ నగర్‌లో ఉన్న రాజా ఇంటి వద్ద ఉధృత పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధారాణి ఇంటిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, వైసీపీ నాయకులు యనమల కృష్ణుడు, 17 మంది కౌన్సిలర్లు బసచేశారు. మరికొద్ది సేపట్లో మున్సిపల్ చైర్మన్ సుధారాణి ఇంటికి వైసీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం రానున్నారు. మున్సిపల్ చైర్మన్ ఇంటి నుండి మున్సిపల్ కార్యాలయం వెళ్లే మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. బారికెట్లు ఏర్పాటు చేసి స్థానికులు ఎవరు ఇటువైపు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు సుధారాణి ఇంటికి చేరుకుంటున్నారు.
పులివెందుల ఉప ఎన్నికపై కుంభమేళాలో ఆసక్తికరమైన చర్చ:
ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పులివెందుల ఉప ఎన్నికపై ఆసక్తికర చర్చ జరిగింది. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పుణ్య స్నానాలు ఆచరిస్తున్న సమయంలో పులివెందులకు ఉప ఎన్నిక రావాలని బాగా ముక్కుకో అంటూ మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు కామెంట్ చేశారు. ఉప ఎన్నికలు వస్తే మీరే పులివెందులకు ఇన్చార్జిగా రావాలని రామకృష్ణం రాజుకు బిటెక్ రవి సూచించారు. ఉప ఎన్నికలు వస్తే తాను తప్పకుండా పులివెందులకు ఇన్చార్జిగా వస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు. ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రతిరోజు ‘యూ బెగ్గర్’ అంటూ అవమానించేవాడు:
హైదరాబాద్ పంజాగుట్టలో వ్యాపారవేత్త జనార్ధన్ రావు హత్య కేసులో అతని మనవడు కీర్తితేజ పోలీస్ కస్టడీ ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన విచారణలో అతను తాతను హత్య చేసిన వివరాలను వెల్లడించాడు. కస్టడీ మొదటి రోజు పోలీసుల ప్రశ్నలకు కీర్తితేజ సమాధానం ఇవ్వకుండా మౌనం వహించాడు. ఎంత కదిలించినా అతను స్పందించలేదు. హత్య జరిగిన స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నించినా పూర్తిగా సహకరించలేదు. అయితే, రెండో రోజు విచారణలో కీర్తితేజ నోరు విప్పి హత్య వెనుకున్న అసలు కారణాలను బయటపెట్టాడు. తాత నన్ను ఎప్పుడూ అవమానించేవాడని, తాత నన్ను ప్రతిరోజూ ‘బెగ్గర్’ అని అవమానించేవాడని చెప్పుకొచ్చాడు. ఆఫీసులో కూడా నన్ను చిన్నచూపు చూశారని, తాత ఆస్తి పంపకాల్లోనూ నన్ను మోసం చేశాడని తెలిపాడు. డైరెక్టర్ పదవి కూడా నాకిచ్చే బదులు తన రెండో కుమార్తె కొడుకుకు ఇచ్చాడని.. ఈ వివాదాల కారణంగా మేమిద్దరం తరచుగా గొడవపడేవాళ్లమని తెలిపాడు. చివరికి తాతను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు అంగీకరించాడు.
పోలీస్ కస్టడీకి ‘రామరాజ్యం’ వీర రాఘవరెడ్డి:
చిలుకూరు ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్‌పై దాడి చేసిన రామరాజ్యం వీర రాఘవరెడ్డి ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు మూడురోజులపాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ రోజు నుంచి మూడు రోజులపాటు పోలీసులు వీర రాఘవరెడ్డిని విచారించనున్నారు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో వీర రాఘవరెడ్డి సంబంధించిన అనేక కీలక అంశాలు వెలుగుచూశాయి. తాను శివుడి అవతారం అని ప్రకటించుకుని, “రామరాజ్యం” పేరిట రిక్రూట్మెంట్ ప్రారంభించినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో వీర రాఘవరెడ్డి రామరాజ్యం పేరిట అనేక అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. “దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ” మాత్రమే రామరాజ్యంలో సాధ్యమని భావించి, అనుచరులను ప్రభావితం చేశాడు. ఈ నేపథ్యంలో పూజారులపై భౌతిక దాడులు చేసి, భయపెట్టే ప్రయత్నం చేశాడు. రామరాజ్యం పేరుతో సాధువులను, పూజారులను దోచుకుంటూ, వాటిని తన స్వలాభం కోసం ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక పోలీసుల విచారణలో వీర రాఘవరెడ్డిపై 2015, 2016లోనూ కేసులు ఉన్నట్లు వెల్లడైంది. గతంలోనూ వివిధ నేరాల్లో పాల్పడిన అతను, ఇప్పుడు చిలుకూరు రంగరాజన్‌ను ఉగాది వరకు సమయం ఇస్తున్నామని బెదిరించడం ఈ కేసును మరింత తీవ్రతరం చేసింది.
మిస్టరీగా 4 ఏళ్ల చిన్నారి డ్రాయింగ్:
భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దెబ్బతింటున్నాయి. చిన్న చిన్న కారణాలకే కొట్టుకోవడం.. చంపుకోవడాలు చేస్తు్న్నారు. ఒకరికొకరు కలకాలం తోడుండాల్సిన వాళ్లు.. క్షణికావేశంలో ప్రాణాలు తీసి కటకటాల పాలవుతున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ వివాహిత అనుమానాస్పద మృతి సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అయితే నాలుగేళ్ల చిన్నారి గీసిన ఓ డ్రాయింగ్ పోలీసులకు ఆస్త్రంగా మారింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే. సోనాలి బుధోలియా (27), సందీప్ బుధోలియా భార్య భర్తలు. వీళ్లకు నాలుగేళ్ల దర్శిత అనే కుమార్తె ఉంది. ఝాన్సీలోని కొత్వాలి ప్రాంతంలోని పంచవతి శివ్ పరివార్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం సోనాలి బుధోలియా అనుమానాస్పదస్థితిలో చనిపోయి ఉంది. భర్త, అత్తమామలు.. పోలీసులకు ఫోన్ చేసి సోనాలి ఆత్మహత్య చేసుకుందని సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడే ఉన్న నాలుగేళ్ల చిన్నారి దర్శితను పోలీసులు విచారించారు. తన తల్లిదండ్రులు ఎప్పుడూ కొట్లాడుకుంటారని.. తన తండ్రి చంపి ఉరివేశాడని తెలిపింది. అంతేకాకుండా ఒక పేపర్ మీద డ్రాయింగ్ వేసి చూపించింది. డ్రాయింగ్‌లో తలకు ఉరివేసినట్లుగా బొమ్మ గీసింది. దీంతో భర్తే.. ఆమెను చంపి ఉరివేసినట్లుగా పోలీసులు అనుమానించారు. చంపేసిన తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ‘చిక్కీ’ పంపిణీని నిలిపివేత:
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ‘చిక్కీ’ పంపిణీని నిలిపివేసింది. దీని ఎఫెక్ట్ పిల్లల ఆరోగ్యంపై ఉంటుందని ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్ (పాఠశాల విద్య) ఇచ్చిన నివేదికలో తెలింది. అలాగే, అక్రమ నిల్వలు, గడువు ముగిసిన చిక్కీలను పంపిణీ చేయడంపై అందిన నివేదిక ఆందోళన కలిగిస్తుంది. ఈ చిక్కీలో అధిక అసంతృప్త కొవ్వులు, అధిక చక్కెర కంటెంట్ ఉండటం వల్ల పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. వెంటనే దీన్ని నిలిపివేయాలని సిద్ధరామయ్య సర్కార్ ఆదేశించింది. మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలల్లో చిక్కీకి బదులుగా గుడ్లు లేదా అరటి పండ్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
టొరంటోలో కూలిన విమానం:
కెనడాలో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం నాడు టొరంటోలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం.. ల్యాండ్ అయిన తర్వాత అదుపు తప్పి బోల్తా పడింది. బలమైన గాలుల కారణంగా ఫ్లైట్ ల్యాండింగ్‌లో సమస్యలు ఏర్పడి ఏకంగా తలకిందులైపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది వరకు గాయపడగా.. ఇందులో మరో ముగ్గురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మిగతా 12 మందికి స్వల్ప గాయాలయ్యాయని పీల్ రీజినల్ పారామెడిక్స్ సర్వీసెస్ వెల్లడించింది.
పోలీసులతో మంచు మనోజ్ వాగ్వాదం:
సినీ నటుడు మంచు మనోజ్ గతరాత్రి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసలేం జరిగిందంటే అర్ధరాత్రి పోలీసులు నిర్వహించే పెట్రోలింగ్ లో భాగంగా భాకరపేట సమీపంలో ఉన్న ప్రైవేటు గెస్ట్ హౌస్ తనిఖీ కి వెళ్లారు ఎస్ ఐ. ఆ సమయంలో గెస్ట్ హౌస్ లో ఉన్న మంచు మనోజ్ అసలు తనగెస్ట్ హౌస్ కు ఎందుకు వచ్చారు, నన్ను అరెస్టు చేయడానికి మీరు వచ్చారంటూ ఎస్ ఐతో మనోజ్ గొడవకు దిగారు. డిఎస్పీకి ఫొన్ చేసి తన రూంలోకి ఎస్ ఐ అనుమతి లేకుండా వచ్చాడని మనోజ్ తెలిపాడు. అయితే తాను అరెస్టు చేయడానికి రాలేదని, కేవలం భద్రత తనిఖీ కోసం వచ్చానని ఎస్ ఐ చెబుతున్న వినిపించుకోలేదు మంచు మనోజ్. ఎస్ ఐ తిరిగి స్టేషను వెళుతుంటే నేను వస్తానంటూ వెనుకనే భాకరపేట పోలీస్ స్టేషనుకు వెళ్ళాడు మనోజ్. తాను రిసార్ట్ లో ఉంటే సైరన్ ఎందుకు వేస్తారని, తన ప్రైవసీని ఎందుకు డిస్ట్రబ్ చేస్తారని ఎస్ఐని ప్రశ్నించాడు మనోజ్. అనంతరం రిసార్ట్స్ నుంచి భాకరాపేట పోలీస్ స్టేష న్ చేరుకుని సీఐ ఇమ్రాన్ బాషాతో ఫోన్లో వాదనకు దిగాడు మనోజ్. సీఎం పేరుతో తనను, తన అనుచరులను పోలీసులు బెదిరిస్తున్నారు. సీఎంస్థాయి వ్యక్తి ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పట్టించుకుంటారని మనోజ్ ప్రశ్న. మోహన్ బాబు విశ్వవిద్యాలయం వద్ద వున్నతన అనుచరుల షాపులను ధ్వంసం చేస్తే మాత్రం పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని తనను మాత్రమే ఇబ్బంది పెడుతున్నారని మనోజ్ పోలీసులతో వాదించాడు.
మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘చావా’:
బాలీవుడ్ లో గత శుక్రవారం విడుదలైన ‘చావా’ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుంది.విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. ఇక ఈ మూవీ విడుదలైన అన్ని చోట్ల విజయపథాన దూసుకుపోతుంది. ముఖ్యంగా విక్కీ కౌశల్ తో పాటు రష్మిక తమ క్యారెక్టర్స్‌లో జీవించారని, పతాక సన్నివేశాల్లో విక్కీ కౌశల్ నటనకి ప్రతి ఒక ప్రేక్షకుడు జేజేలు పలుకుతున్నారు. అంతే కాదు కొన్ని సీన్స్ చూసి కన్నీరు పెట్టుకున్నారు ప్రేక్షకులు. అయితే తాజాగా వినిపిస్తున్న విషయం ఏంటి అంటే.. ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి వీక్ డేస్‌లో కూడా స్ట్రాంగ్‌గా కొనసాగుతున్న ఈ సినిమాను కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రం కోసం ఇతర భాషల వారు కూడా మాట్లాడుకుంటున్నారట. మెయిన్‌గా మన తెలుగు ఆడియెన్స్‌లో చావా ప్రస్తావన సోషల్ మీడియాలో ఎక్కువ వినిపిస్తోంది. బాలీవుడ్ నుంచి ఏవేవో సినిమాలు పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు కానీ ఇలాంటి సినిమాలు కదా రిలీజ్ చెయ్యాలి అని వారు భావిస్తున్నారు. ఇండస్ట్రీ ఏదైనా కథ నచ్చితే తెలుగు ఆడియన్స్ కచ్చితంగా ఆ మూవీని సపోర్ట్ చేస్తారు. అలా వచ్చి తెలుగులో హిట్ అయిన చిత్రాలు బోలెడన్ని ఉన్నాయి. ప్రజంట్ టాలీవుడ్ రేంజ్ కూడా అని ఇండస్ర్టీ తో పోలిస్తే ముందజలో ఉంది. ఇక ఇవన్నీ తెలిసి కూడా చావా మేకర్స్ ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నారనే చెప్పాలి.
ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్ ఇదే:
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రేపటి నుంచి ప్రారంభం కానుంది. కరాచీలో జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్- న్యూజిలాండ్‌తో తలపడటంతో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్‌తో తన మొదటి మ్యాచ్ ను ఆడనుంది. ఇక, భారత్ ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఈ టోర్నీ మార్చి 9 వరకు కొనసాగుతుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న మొదటి ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ ఇది.