భారీ నుంచి అతి భారీ వర్షాలు:
రానున్న వారం రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని చెప్పింది. రాగల 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
ఏపీని అగ్ర స్థానంలో నిలపాలన్నదే నా ఆకాంక్ష:
‘ఆరోగ్య సంరక్షణలో దేశంలోనే ఏపీని అగ్ర స్థానంలో నిలపాలన్నదే నా ఆకాంక్ష. రాష్ట్రంలో 1900 మంది హిమోఫీలియా బాధితులున్నారు. 2100 మంది తలసీమియాతో, ఇదే సంఖ్యలో సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్నారు. జన్యుపరంగా, వారసత్వంగా వస్తున్న ఈ వ్యాధిని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. బాధితులకి క్రమం తప్పకుండా ఉచిత రక్త మార్పిడి చేస్తున్నాం. రాష్ట్రంలోని 5 ఐసిహెచ్‌యస్ సెంటర్ల ద్వారా ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్ష చేస్తున్నాం. వ్యాధి నిర్ణారణ అయిన వారికి ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో 19 లక్షల మందికి సికిల్ సెల్ ఎనీమియా స్క్రీనింగ్ చేయాల్సి ఉండగా, 10 లక్షల 50 వేల మందికి స్క్రీనింగ్ చేశారు. ఇందులో 19,000 మంది పైగా క్యారియర్స్ ఉన్నారు, 2100 మందికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. జన్యుపరమైన సికిల్‌సెల్ ఎనీమియా స్క్రీనింగ్ తర్వాత గుర్తింపు కార్డులిస్తున్నాం. నోడలాఫిసర్లకు అవగాహన కల్పించేందుకు రెండు రోజుల పాటు శిక్షణ ఉంటుంది. తలసీమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా విభాగాల్లో మరింత అవగాహన కల్పించేందుకు రెండు రోజుల ఓరియెంటేషన్ జరుగుతుంది’ అని మంత్రి సత్యకుమార్ చెప్పారు.
సూది గుచ్చకుండానే రక్త పరీక్ష రిపోర్టు:
భారతదేశంలో మొట్టమొదటి సరిగా సూది అవసరం లేకుండానే రక్త పరీక్ష చేసి ఒక్క నిమిషంలోనే రిపోర్ట్ ఇచ్చే ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్‌ను నిలోఫర్ లో అందుబాటులోకి తెచ్చారు.. నిలోఫర్ హాస్పిటల్, సుశేనా హెల్త్ ఫౌండేషన్‌తో కలిసి క్విక్ వైటల్స్ దిన్ని అందుబాటులోకి తెచ్చింది.. ఫోటోప్లెథిస్మోగ్రఫీ ద్వారా మొబైల్ లో ఫేస్ స్కానింగ్ ద్వారా 20 నుంచి 30 సెకన్లలోనే టెస్టులు పూర్తవుతాయి. ఈ పరీక్ష విధానాన్ని మొదట నిలోఫర్ లోకి అందుబాటులోకి తెచ్చి తరువాత మహారాష్ట్రలో ప్రవేశపెట్టనున్నారు.. నిలోఫర్ లో పిల్లలకు, గర్భిణులకు ఇలాంటి టెస్టులు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి.
కాళేశ్వరం కమిషన్‌లో బిగ్ ట్విస్ట్:
కాళేశ్వరం కమిషన్‌లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కాళేశ్వరం కమిషన్ గడువు మరో రెండు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 31తో కాళేశ్వరం కమిషన్ పదవీ కాలం ముగియనుంది. బహిరంగ విచారణను ముగించినట్లు కమిషన్ వర్గాలు ప్రకటించాయి. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును జూలై 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాజకీయ నాయకుల విచారణ లేకుండానే నివేదిక ఇచ్చేందుకు కమిషన్ సిద్ధమైంది. పీసీ ఘోష్ కమిషన్ పదవీ కాలం పెంపుతో మళ్ళీ విచారణ కొనసాగించే అవకాశం ఉంది. కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ను విచారించేందుకే కాళేశ్వరం కమిషన్ పదవీ కాలం పొడిగించారంటున్న ఇరిగేషన్ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు:
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు అందరినీ ఆశ్చర్య పరిచింది. పాకిస్థాన్ తరఫున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టు అనంతరం అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ్యోతి పాకిస్థాన్, చైనాతో సహా అనేక దేశాలకు ప్రయాణించిందని చెబుతున్నారు. కేవలం రూ.20,000 ఉద్యోగంతో జీవితం ప్రారంభించిన జ్యోతి, ఇప్పుడు ప్రసిద్ధ యూట్యూబర్‌గా మారింది. కానీ ఆమెను ఎందుకు అరెస్టు చేశారు? విదేశాలకు వెళ్ళే ముందు ఆమె తన కుటుంబానికి ఏమి చెప్పింది? పాకిస్థానీ స్నేహితుల గురించి కుటుంబానికి తెలుసా? ఇలాంటి అనేక ప్రశ్నలను జ్యోతి తండ్రి హరీష్ మల్హోత్రా మాటల్లో తెలుసుకుందాం..
ప్రశ్న: జ్యోతి ఇక్కడే నివసించిందా? ఆమె ప్రయాణ అలవాట్ల గురించి మీకు తెలుసా?
జ్యోతి తండ్రి: అవును, ఆమె ఇక్కడే ఉండేది. “నేను ఢిల్లీ వెళ్తున్నాను.. రెండు, నాలుగు రోజుల్లో తిరిగి వస్తాను.” అని చెప్పింది.
ప్రశ్న: ఆమె పాకిస్థాన్ సందర్శించిందని మీకు తెలుసా? ఆమెకు పాకిస్థానీ స్నేహితులు ఉన్నారా?
జ్యోతి తండ్రి: నాకు ఏమీ తెలియదు.
ప్రశ్న: ఆమెకు పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో స్నేహితులు ఉన్నారని, ఆమె సోషల్ మీడియా పేజీలలో పాకిస్థాన్ అనుకూల కథనాలు కనిపిస్తున్నాయని తేలింది.ఇవన్నీ చూస్తే మీ కుమార్తె ఏదో తప్పు చేసిందని మీకు అనిపిస్తుందా?
జ్యోతి తండ్రి: ఇప్పుడు నేనేం చెప్పగలను… టీవీలో వాళ్ళు చూపించేది సరైనదో కాదో నాకు తెలియదు. అంతా దేవునికి మాత్రమే తెలుసు.
ఎన్ని విమానాలు కోల్పోయామో చెప్పాలన్న రాహుల్:
ఆపరేషన్ సింధూర్ వివరాలను బహిర్గతం చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ను అడిగారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేసిన రాహుల్.. అందులో జై శంకర్ మౌనంపై ప్రశ్నలు సంధించారు. మే 7వ తేదీన జరిగిన ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి మన దాడి ప్రారంభంలోనే పాకిస్తాన్‌కు సమాచారం ఇవ్వడం నేరం అని జైశంకర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. విదేశాంగ మంత్రి నిశ్శబ్దం కేవలం సమాచారాన్ని వెల్లడించడం కాదు.. అది విపత్కరమని రాసుకొచ్చారు. అలాగే, భారత వైమానిక దళం ఈ ఆపరేషన్‌లో ఎన్ని విమానాలు కోల్పోయిందనే గత ప్రశ్నను మరోసారి గుర్తు చేశారు. “మరోసారి అడుగుతున్నాను” పాకిస్తాన్‌కు ముందే సమాచారం తెలియడంతో మనం ఎన్ని విమానాలు కోల్పోయాము?” అని జైశంకర్‌ని అడిగారు. ఈ ట్వీట్ రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం చేసిన పోస్ట్‌కు కొనసాగింపుగా రాసుచ్చారు.
ఇండోనేసియాలో బద్ధలైన అగ్నిపర్వతం:
ఇండోనేషియాలో భారీ విస్ఫోటనం జరిగింది. లెవోటోబి లకి-లకి పర్వతం బద్ధలైంది. దీంతో శిఖరం నుంచి బూడిద మేఘం వైపు 6 కి.మీ ఎత్తుకు ఎగిసిపడింది. సోమవారం ఉదయం పర్యాటక ద్వీపమైన ఫ్లోర్స్‌లోని ఉదయం 09:36 గంటలకు లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం మరోసారి పేలిందని జియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. వెంటనే అధికారులు దేశంలో అత్యున్నత స్థాయి హెచ్చరిక జారీ చేశారు. సమీప ప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
భారత్‌తో ఉన్న వాణిజ్య సమస్యలను త్వరలోనే పరిష్కరించుకుంటాం:
బంగ్లాదేశ్‌ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఆ దేశ దిగుమతులపై అనేక పరిమితులను విధిస్తున్నట్లు పేర్కొనింది. ఈ నేపథ్యంలో భారత్‌తో నెలకొన్న వాణిజ్య సమస్యలను త్వరలోనే పరిష్కరించుకుంటామని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు బంగ్లాదేశ్ వాణిజ్య సలహాదారు షేక్ బషీరుద్దీన్ మీడియాతో వెల్లడించారు.\
మహేష్ బాబు ఇంట కరోనా:
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు కుటుంబంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోదరి, బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్‌కు కోవిడ్-19 సోకినట్లు తాజా సమాచారం. ఈ విషయాన్ని శిల్పా స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న శిల్పా, తన కోవిడ్-19 రిపోర్ట్ పాజిటివ్ వచ్చినట్లు అభిమానులకు తెలియజేస్తూ, సురక్షితంగా ఉండాలని, మాస్క్‌లు ధరించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. ఆసియా ఖండంలోని సింగపూర్, హాంకాంగ్, చైనా, థాయిలాండ్ వంటి దేశాల్లో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. సింగపూర్‌లో రోజువారీ కేసులు 2,000 దాటగా, హాంకాంగ్‌లో ఆస్పత్రుల్లో బెడ్‌లు నిండిపోతున్నాయని సమాచారం. చైనాలోని కొన్ని నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్ వైపు అడుగులు వేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, దుబాయ్‌లో నివసిస్తున్న శిల్పా శిరోద్కర్‌కు కోవిడ్ సోకడం సినీ పరిశ్రమలో ఆందోళన కలిగిస్తోంది.
దర్శకులను ఆకాశానికెత్తేసిన దేవీశ్రీ:
కర్ణాటక రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా పరిచయం అవుతున్న ‘జూనియర్’ సినిమాకు, దేవినే సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సాంగ్ లాంచ్ బెంగళూరులో జరిగింది. ఈ వేడుకలో మాట్లాడిన దేవి దర్శకులను ఆకాశానికెత్తేశారు.. ‘ఒక మంచి సినిమా చేయాలంటే దర్శకుడే అత్యంత కీలకం. నటీనటులను ఎంచుకుని, నిర్మాతను ఒప్పించి.. టెక్నీషియన్లను సెట్ చేసుకుని తొలి రోజు నుంచి రిలీజ్ వరకు కష్టపడుతూనే ఉండేవాడే దర్శకుడు. అలాంటి ప్రతి ఒక దర్శకుడికీ మనం ప్రేమ, గౌరవం ఇవ్వాలి. కొత్త దర్శకుడైనా సరే, పెద్ద దర్శకుడైనా సరే..మూవీ ఫ్లాప్ అయితే ముందుగా దర్శకుడినే మనం నిందిస్తాం. చెప్పాలంటే డైరెక్టర్‌ల కష్టం వల్లే మనందరం ఇక్కడ ఉన్నాం. మన జీవితాలను ఇంత అందంగా మారుస్తున్న దర్శకులందరికీ హ్యాట్సాఫ్’ అని దేవి అన్నాడు. ప్రజంట్ ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మంచు విష్ణు నుంచి నేర్చుకోవాలనుకున్నది ఇదే:
తాజాగా జరిగిన ‘భైరవం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మంచు మనోజ్ మాట్లాడుతూ, ‘ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఈ జన్మకు నేను మోహన్ బాబు గారి కొడుకుని’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే, తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ మీడియాతో ముచ్చటించిన క్రమంలో, ఒక మీడియా ప్రతినిధి ‘మీ బ్రదర్ విష్ణు నుంచి ఏం నేర్చుకున్నారు?’ అని అడిగితే.. కాస్త ఆలోచించి, ‘విష్ణు అన్న నుంచి ఏ పరిస్థితినైనా మాట్లాడి ఎలా చక్కదిద్దొచ్చు అనేది నేర్చుకోవాలని అనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు. ‘నేర్చుకోవాలనుకునేది కాదు, ఇప్పటికే నేర్చుకున్నది ఏదైనా చెప్పండి’ అని అడిగితే, ‘మేమిద్దరం అన్నదమ్ములం, ఒకరి నుంచి ఒకరు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు సడన్‌గా అడిగితే చెప్పలేకపోతున్నాను’ అంటూ మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.