అన్ని కులాలు అండగా ఉన్నాయి:
అన్ని కులాలు మద్దతిస్తేనే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండ విజయం సాధించిందని, సీఎం చంద్రబాబు నాయుడుకు అన్ని కులాలు అండగా ఉన్నాయని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కులం ఆపాదించిన నీచుడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్ని మండిపడ్డారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం వస్తే జైలులో వేస్తాం అని విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబును కోరాం అని బుద్దా వెంకన్న చెప్పారు. ఈరోజు సీపీ రాజశేఖర్ బాబుకు విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫిర్యాదు చేశారు.
అన్ని పరిస్థితులను టీడీపీ ప్రభుత్వం గాడిలో పెడుతోంది:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పరిస్థితులను ప్రభుత్వం గాడిలో పెడుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యధిక ప్రధాన్యత ఇస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు చొరవతోనే రాష్ట్రానికి గూగుల్, యాపిల్ లాంటి ఎన్నో సంస్థలు వస్తున్నాయని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే.. వైసీపీ నాయకులు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. విద్యా వ్యవస్థను నాశనం చేసింది వైసీపీ నాయకులే అని, నాడు నేడులో వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడారని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.
థర్మల్ పవర్ ప్లాంట్ కేసీఆర్ పుణ్యమే:
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కేసీఆర్ పుణ్యమే అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం వల్లే వరి సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన అభివృద్ధి పథకాలు ఒక్కొక్కటి ప్రజల ముందుకు వస్తున్నాయని జగదీష్ రెడ్డి అన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ ను అడ్డుకోకుండా, కూల్చకుండా ప్రారంభం చేసినందుకు.. సీఎంకు, జిల్లా మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ హయంలో రైతులకు లాభం జరిగితే… కాంగ్రెస్ పాలనలో రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. SLBC ఆలస్యం కావడానికి కారకులు ఎవరో, TBM టెక్నాలజీ ఎందుకు తెచ్చారో త్వరలో భయటపెడతామని అన్నారు.
చిల్లపల్లి గ్రామానికి అరుదైన గుర్తింపు:
పెద్దపల్లిజిల్లా చిల్లపల్లి గ్రామానికి అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ పంచాయతీ అవార్డులు 2024లో మహిళా మిత్ర పంచాయతీ విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుంచి చిల్లపల్లి గ్రామం ఎంపిక అయింది. ఈ అవార్డు కింద గ్రామానికి 70 లక్షల బహుమతిని ఈనెల 11న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందిస్తారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ 9 అంశాలను పరిగణలోకి తీసుకొని దేశవ్యాప్తంగా 27 గ్రామపంచాయతీలకు దీన్ దయాల్ ఉపాధ్యాయి పంచాయతీ వికాస్ పురస్కారాలు ప్రకటించింది. ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో మంథని మండలం చల్లపల్లి గ్రామపంచాయతీకి రెండో ర్యాంకు లభించింది. దీనితో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామం అవార్డును గెలుచుకోవడంలో గ్రామానికి చెందిన మహిళల శ్రమ ఎంతో ఉందని చెప్పవచ్చు.
పోలీస్ బేస్ క్యాంపుపై నక్సలైట్ల దాడి:
ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్ జిల్లాలోని పోలీస్ బేస్ క్యాంపుపై నక్సలైట్లు మరోసారి దాడి చేశారు. గత మూడు రోజుల్లో నక్సలైట్లు పోలీసులపై దాడి చేయడం ఇది రెండోసారి. పోలీసు శిబిరంలో కాల్పులు జరిగినట్లు బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ధృవీకరించారు. పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడపల్లి పోలీస్ క్యాంపుపై నక్సలైట్లు దాడి చేశారు.. పోలీసులు, నక్సలైట్ల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. బేస్ క్యాంపులో సైనికులకు ప్రథమ చికిత్స చేస్తున్నారు. ఈ దాడుల వెనుక కేంద్ర కమిటీ అగ్రనేత హిద్మా హస్తం ఉందని చెబుతున్నారు.
పుష్ప-2 అవతారంలో అరవింద్ కేజ్రీవాల్:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య మరోసారి పోస్టర్ వార్ మొదలైంది. ఈ రాజకీయ పోరులో ఇరు రాజకీయ పార్టీల నుంచి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. బీజేపీ తన పోస్టర్లలో ‘ఆప్’ కుంభకోణాలను బయటపెట్టడంలో బిజీగా ఉంది. అదే సమయంలో ఆప్ కూడా ‘పుష్ప’ తరహాలో బీజేపీపై విరుచుకుపడింది. ఆప్ ప్రభుత్వ మోసాలను ప్రస్తావిస్తూ బీజేపీ శనివారం పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఫోటో కూడా ఉంది. మద్యం, మొహల్లా క్లినిక్, హవాలా, సెక్యూరిటీ, రేషన్, పానిక్ బటన్, షీష్‌మహల్, మెడిసిన్, ఢిల్లీ జల్ బోర్డ్, క్లాస్‌రూమ్, సీసీటీవీ స్కామ్‌లతో పాటు ‘కేజ్రీవాల్ స్కామ్‌ల వెబ్’ అని క్యాప్షన్ పెట్టింది.
డాకు మహారాజ్ కు ముహూర్తం ఫిక్స్:
ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను భారీ ఎత్తున చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుకోసం మంచి ముహుర్తాన్ని ఫిక్స్ చేశారట. ఈ నెల 15న నుండి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను US లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. కానీ అంతకంటే ముందుగానే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక అమెరికాలోని డల్లాస్ లో జనవరి 4న సాయంత్రం 6.00 గంటలకు నిర్వహిచబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. డాకు మహారాజ్ ఈవెంట్ ను ఎన్నడూ చూడని విధంగా ఎవరు చూడని విధంగా ప్లాన్ చేస్తున్నాడట నిర్మాత నాగవంశీ. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలకు థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్,ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
కేసుల వ్యవరంపై స్పందించిన మంచు ఫ్యామిలీ:
మంచు కుటుంబంలోని ఆస్తుల వ్యవహారం రచ్చకెక్కింది. గతంలో మాటల యుద్ధం కొనసాగించిన మంచు బ్రదర్స్ ఇటివల సైలెంట్ గా ఉన్నారు. కానీ నేడు మరోసారి మంచు కుటుంబంలోని ఆస్తుల వ్యవహారం వివాదానికి దారితీసింది. మోహన్ బాబు తనన, తన భార్యని కొట్టాడని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు మంచు మనోజ్. అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై ఫిర్యాదు చేశాడు మోహన్ బాబు. తండ్రి కొడుకులు ఒకరిమీద ఒకరు కేసులు పెటుకున్నారు అనే వార్త టాలీవుడ్ లో త్రీవ్ర చర్చాయాంశంగా మారింది.
రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయం:
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో 5 మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. అడిలైడ్ టెస్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్లపై భారీ ప్రభావం చూపింది. భారత్ నుంచి నంబర్-1 టాప్ ప్లేస్‌ను కంగారూలు కొల్లగొట్టారు. ఆస్ట్రేలియా 60.71 శాతం మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఓటమితో టీమిండియా భారీ నష్టాన్ని చవిచూసింది. ఈ ఓటమితో రోహిత్ శర్మ అండ్ బ్రిగేడ్ 57.29 శాతం మార్కులతో మూడో స్థానానికి పడిపోయింది. 59.26 శాతం మార్కులతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా-శ్రీలంక మధ్య రెండో టెస్టు జరుగుతోంది. ఆ మ్యాచ్‌లో కూడా గెలిస్తే ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి WTC పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది.