ప్రస్తుతం టెక్నాలజీ మీద ప్రపంచం ఆధారపడి ముందుకెళ్తోంది:
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగను ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని కోరారు. ఇక, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన సమన్వయ పరుస్తున్నాం.. ప్రజలు ముందుకు అనే నినాదంతో ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇక ప్రస్తుతం టెక్నాలజీ మీద ప్రపంచం ఆధారపడి ముందుకెళ్తోంది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు అంతా స్మార్ట్ వర్క్ నడుస్తుంది.. వర్చువల్ ఫిజికల్ వర్క్ చేసే పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ పాలన తెచ్చాం.. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్.. ఏఐతో అన్ని సుసాధ్యాలే అని ఆయన చెప్పారు. ఈ ఏడాది రూ. 3 లక్షల 22 వేల కోట్లు బడ్జెట్ పెట్టాం.. గత ఐదేళ్లలో అందరికీ అవమానాలే జరిగాయని ఆరోపించారు.
బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు లేవు:
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు లేవని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అక్కడి జనాలకు సాధారణ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేల్చింది. రోగులకు సంబంధిత వైద్య నిపుణుల మార్గదర్శకంతో మందులు పంపిణీ జరుగుతోంది. మూడు నెలల తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించాలని వైద్యులు సూచించారు. అయితే రొమ్ము క్యాన్సర్ అనుమానిత లక్షణాలతో ఉన్న మహిళకు సంబంధించిన వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తున్న బలభద్రపురం గ్రామంలో వైద్య బృందాలు శనివారం జల్లెడ పట్టాయి. పలువురు వైద్యాధికారులు ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. 93 మంది సిబ్బందితో కూడిన 31 బృందాలు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి సమాచారం సేకరిస్తూ.. పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో 38 మందికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 29 మందికి సాధారణ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. 9 మందికి ఇతర ఆరోగ్య సమస్యలున్నట్లు గుర్తించారు. వీరిలో ఎముకల సమస్యలతో ఇద్దరు.. గైనిక సమస్యలతో ఇద్దరు.. లివర్, కిడ్నీ సమస్యలు, తీవ్రమైన రక్తహీనతలతో ఒక్కొక్కరు బాధపడుతున్నట్లు తేలింది.
కాంగ్రెస్ నేతలకు ‘కరప్షన్ వైరస్’:
కేంద్ర మంత్రి బండిసంజయ్ ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ లోని తన నివాసంలో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతోందని, ప్రధాని చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జ్యోతిష్య పండితుల ప్రకారం.. ఈ ఏడాది దొంగతనాలు పెరిగే అవకాశముందని, ప్రజా ప్రతినిధులు, అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడతారని, కొత్త వ్యాధులు ప్రబలే సూచనలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనను గమనిస్తే ఈ జ్యోతిష్య ఫలితాలు నిజమని అర్థమవుతోందని అన్నారు. కాంగ్రెస్ నేతలకు ‘కరప్షన్ వైరస్’ సోకిందని విమర్శించారు. ప్రభుత్వ కాంట్రాక్టుల నుంచి పెండింగ్ బిల్లుల వరకు ప్రతి దాంట్లోనూ కమీషన్లు తీసుకోవడం సహజమైపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ అవినీతి వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
నేను, భట్టి విక్రమార్క జోడెద్దుల్లా రాష్ట్రం కోసం శ్రమిస్తున్నాం:
హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం ఉగాది వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రవణం చేపట్టారు.. ఈ కార్యక్రమం నిర్వహించిన అధికారులను అభినందిస్తున్నాం.. పాడి పంటలతో, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికీ వచ్చేలా ఈ కొత్త సంవత్సరం ఉండాలని కోరుకుంటున్నాను.. భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ కూడా షడ్రుచుల మాదిరి ఉంది.. అందులో పేదలకు విద్య, వైద్యం అందేలా రచించారు.. రైతాంగం అభివృద్ధి చెందేలా బడ్జెట్ ప్రతిపాదన పెట్టారు.. ఇవన్ని జరగాలంటే లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
మావోయిస్టుల ఘాతుకం:
గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు మరోసారి దారుణానికి తెగబడ్డారు. బాంరగడ్ తాలుక జూవి గ్రామానికి చెందిన పూసు పుంగంటి (52) అనే వ్యక్తిని మావోలు గొంతు కోసి హత్య చేశారు. సమాచారం మేరకు, ఓ వివాహ వేడుకకు వెళ్లిన పూసు పుంగంటిని మావోయిస్టులు కిడ్నాప్ చేసి, అనంతరం హత్య చేశారు. అతను పోలీసులకు సహకరిస్తున్నాడనే అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బాంరగడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టుల హత్యాకాండపై అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు పెరుగుతుండటంతో భద్రతా దళాలు కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టాయి.
డాక్టర్ హెడ్గేవార్‌కి నివాళులు అర్పించిన ప్రధాని మోడీ:
ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిరాన్ని దర్శించిన ప్రధాని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్‌కి, ఆర్ఎస్ఎస్ రెండో సర్సంఘ్‌చాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ స్మారక చిహ్నాల వద్ద నివాళులు అర్పించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో కలిసి ప్రధాని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో పాటు ప్రధాని మోడీ, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ బౌద్ధాన్ని తీసుకున్న దీక్షాభూమిని సందర్శించారు. అంబేద్కర్‌ని నివాళులు అర్పించారు.
పాకిస్తాన్‌ని మందలించిన యూఎస్, సౌదీ:
పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఐఎస్ఐ చీఫ్ అసిమ్ మాలిక్, విదేశాంగ కార్యదర్శి అమ్నా బలోచ్ ఇటీవల సౌదీ అరేబియాలో పర్యటించారు. సౌదీ, యూఎస్ అధికారులతో పాక్ అధికారులు సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. బలూచిస్తాన్‌లో బీఎల్ఏ ట్రైన్ హైజాక్ ఘటన, ఇతర దాడుల తర్వాత వీరంతా సౌదీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ సమావేశంలో పాకిస్తాన్‌ని సౌదీ అరేబియా, అమెరికాలు మందలించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ముందు 5 డిమాండ్ల ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన పాకిస్తాన్ జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్ చెబుతున్న దాని ప్రకారం.. పాక్ ప్రధానితో సహా ముఖ్యమైన అధికారులు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, సౌదీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్, ఇరాన్, చైనా, ఇజ్రాయిల్, ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ ముందు 5 డిమాండ్లు పెట్టారు.
భారత్‌కి బ్రిటన్ క్షమాపణ చెప్పాల్సిందే:
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో నెత్తుటి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం ‘‘జలియన్ వాలాబాగ్’’ మారణహోమం. బ్రిటీష్ వాడి వలస చరిత్రపై సిగ్గుపడే గుర్తుగా మిగిలింది. జలియన్ వాలాబాగ్ ఉదంతానికి 106 ఏళ్లు సమీపిస్తున్న నేపథ్యంలో, ఇది యూకే పార్లమెంట్‌ని కుదిపేస్తోంది. ఇటీవల, బ్రిటిష్ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ ప్రభుత్వం ఈ దారుణంపై అధికారికంగా భారతదేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వలసవాద అణచివేతలో అత్యంత క్రూరమైన చర్యలలో శాశ్వత మచ్చగా మిగిలిందని ఆయన అన్నారు. ఆయన యూకే పార్లమెంట్‌లో ఏప్రిల్ 13, 1919 నాటి విషాద సంఘటనపై మాట్లాడారు. జనరల్ డయ్యర్ నేతృత్వంలో జరిగిన ఈ ఘటన వేలాది మంది పౌరులు మరణించేలా, గాయపడేలా చేసింది. ఈ చీకటి అధ్యాయాన్ని బ్రిటిష్ చరిత్రలో ఒక మరకగా అభివర్ణించారు. బ్లాక్‌మన్ జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని వివరిస్తూ..‘‘ ప్రజలు జలియన్ వాలాబాగ్ ఎండలో శాంతియుతంగా సమావేశమయ్యారు. అయితే, బ్రిటిష్ దళాలు ఆ ప్రాంతంలో నిరాయుధులైన వారిపై కాల్పులు జరిపాయి. ఈ ఉచకోత ముగిసే సమయానికి 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. 1200 మంది గాయపడ్డారు’’ అని అన్నారు.
లాక్మే ఫ్యాషన్ వీక్‌లో జాన్వీ తళుకులు:
ప్రతిష్టాత్మక ‘లాక్మే ఫ్యాషన్ వీక్’ 2025లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తళుక్కున మెరిశారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన దుస్తులను ధరించి స్టేజ్‌పైన ర్యాంప్ వాక్ చేశారు. బంధాని ఫాబ్రిక్‌తో రూపొందించబడిన నల్లటి గౌనులో జాన్వీ హొయలు పోయారు. జాన్వీ అందాలు, ర్యాంప్ వాక్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రాకు జాన్వీ షో స్టాపర్‌గా నిలిచారు. పొడవాటి నల్లటి కోటు కింద బంధానీ బాడీకాన్ డ్రెస్‌లో జాన్వీ స్టేజీపై అడుగుపెట్టారు. స్టేజీపై మధ్యలోనే జాన్వీ కోటు తీసేసి.. ఫొటోలకు పోజులిచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో స్టిల్స్ ఇచ్చారు. దీంతో ఫొటో గ్రాఫర్స్ అందరూ జాన్వీ వెనుక ఫాలో అవుతూ.. ఆమె అందాలను కెమెరాలో బంధించారు. ఆపై కొంతదూరం తన ర్యాంప్ వాక్‌ను కొనసాగించారు. చివరకు మరోసారి పోజులిచ్చి వెళ్లిపోయారు. జాన్వీ ర్యాంప్ వాక్‌కు సంబంధించిన వీడియోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
చిరు-అనిల్ మూవీ షురూ:
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఉగాది పర్వదినం సందర్భంగా ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో మూవీ శురూ అయింది. ముహూర్తపు సన్నివేశానికి విక్టరీ వెంకటేశ్ క్లాప్ కొట్టారు. చిరు-అనిల్ మూవీ పూజా కార్యక్రమంకు దర్శకులు రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, వశిష్ఠ, బాబీ, శ్రీకాంత్ ఓదెల.. నిర్మాతలు అశ్వనీ దత్, దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు, నాగవంశీ.. రచయిత విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
హార్దిక్ పాండ్యాకు షాక్:
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు షాక్ తగిలింది. ఐపీఎల్ 2025లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే హార్దిక్‌కు జరిమానా పడింది. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతడికి రూ.12 లక్షలు ఫైన్‌ను ఐపీఎల్ విధించింది. ఈ సీజన్‌లో తొలి తప్పిదం కాబట్టి ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2 ప్రకారం స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్‌కు రూ.12 లక్షల జరిమానా విధించాం అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా హార్దిక్ నిలిచాడు.
హార్దిక్ పాండ్యా అతి:
క్రికెట్ ఆటలో గొడవలు, దూషణలు సాధారణం. ముఖ్యంగా మ్యాచ్ రసవత్తరంగా ఉన్న సమయాల్లో ప్లేయర్స్ మాటలు యుద్దానికి దిగుతుంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. శనివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అతి చేశాడు. ముంబై మాజీ ఆటగాడు, గుజరాత్ ప్లేయర్ సాయి కిశోర్‌ను ముందు దూషించి.. ఆపై హగ్ ఇచ్చాడు. ఇందుకు సంభందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.