ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్!
ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్ అని, సీఎం చంద్రబాబులా మోసం చేయడం చేతకాదని వైసీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. ప్రజలను మోసం చేయాలంటే జగన్ సూపర్ సిక్స్ కాదని.. సూపర్ సిక్స్ టీ ఇచ్చేవారని విమర్శించారు. 8 నెలల్లో కూటమి ప్రభుత్వం పరపతి కోల్పోయిందన్నారు. నారా లోకేష్ చేసింది యువగళం కాదని.. నిన్న విశాఖ రోడ్లపై వినిపించింది అసలైన యువగళం అని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలో చేరికలు, వలసలు సర్వ సాధారణం అని కన్నబాబు చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్‌గా కురసాల కన్నబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు కొత్త పెళ్లి కూతురు:
మన అకేషన్స్ కోసం పరీక్షలు అస్సలు వాయిదా పడవు. అందుకే పరీక్షలు ఉన్నప్పుడు.. పెళ్లి, ఇతర ముహూర్తాలు పెట్టుకోకుండా జాగ్రత్త పడతాం. అయితే అప్పుడప్పుడు అనుకోకుండా పెళ్లి ముహూర్తం రోజున పరీక్ష రాయాల్సి వస్తుంది. అప్పుడు చాలా మంది తర్వాత చూసుకోవచ్చులే అనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు చెందిన ఓ వధువు మాత్రం అలా అనుకోలేదు. ఉదయం పెళ్లి చేసుకుని.. నేరుగా పరీక్షా హాలుకి చేరుకుంది. ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తొలి పేపర్.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు రెండో పేపర్ పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో 92,250 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్షకు చిత్తూరుకు చెందిన కొత్త పెళ్లి కూతురు మమత హాజరయ్యారు. మమత ఆదివారం ఉదయం వివాహం చేసుకుని.. పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్ సెంటర్‌లో పరీక్షకు హాజరయ్యారు.
ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన దివ్యాంగుడు:
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యేందుకు డెడ్ లైన్ 9.45 కావటంతో.. పరీక్షా కేంద్రాల వద్ద గేట్లకు సిబ్బంది తాళాలు వేశారు. ఇదే సమయంలో విజయవాడ నలంద విద్యా నికేతన్‌లోని గ్రూప్-2 పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా దివ్యాంగుడైన అభ్యర్ధి వచ్చారు. అయితే తన భర్త దివ్యాంగుడు కావటంతో పరీక్షకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని అతడి భార్య ప్రాధేయ పడింది. దీంతో దివ్యాంగునికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు హాజరయ్యేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. కేవలం నిమిషంలోపు మాత్రమే ఆలస్యం కావటం.. అభ్యర్ధి దివ్యాంగుడు కావటంతోనే మానవతా దృక్పథంతో అనుమతి ఇచ్చామని అధికారులు అంటున్నారు. అధికారుల తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఎంవీజీఆర్ కాలేజీ సెంటర్‌కు గ్రూప్-2 అభ్యర్థి అక్కిన మనోహర్ నాయుడు ఆలస్యంగా చేరుకున్నాడు. పది నిమిషాలు ఆలస్యం కావడంతో ఎగ్జామ్ సెంటర్ లోనికి అధికారులు అనుమతించలేదు. దాంతో మనోహర్ ఏడ్చుకుంటూ వెనుదిరిగాడు. కోవూరు మండలం గంగవరంలోని పరీక్షా కేంద్రానికి ఓ అభ్యర్థి ఆలస్యంగా వచ్చాడు. అభ్యర్థి బ్రతిమాలినా అధికారులు లోనికి అంగీకరించలేదు.
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి మిగిలేది గాడిది గుడ్డే:
పట్టభద్రుల ఎన్నికలు దెగ్గరపడడంతో ఎన్నికలు జరిగే ఆయా జిల్లాలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలోనే అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టభద్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై ఆయన తీవ్రంగా స్పందించారు. మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఆదాయంపై అంచనా లేకుండా నిర్లక్ష్యంగా ఖర్చులు చేసి రాష్ట్రాన్ని తీవ్ర అప్పుల బారిన పడేసిందని విమర్శించారు. రాష్ట్రం ఇప్పటికే 9 లక్షల కోట్ల రూపాయల అప్పుల లో మునిగిపోయిందని, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అంతేకాదు, కాంట్రాక్టర్ల బిల్లులు కూడా చెల్లించని ప్రభుత్వం, రాష్ట్ర ప్రాజెక్టులను పూర్తిచేయలేకపోతుందని ఆయన ఆరోపించారు.
ఘనంగా మహా కుంభాభిషేకం:
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు పంచకుండాత్మక మహా పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం వారు అంతరాలయం మాడ వీధుల్లోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు, వామనామలై పీఠాధిపతి సూచనల మేరకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వర్ణమయ పంచతల విమాన గోపురం వద్ద ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా పథకాలు అమలు చేస్తున్నాం:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా మెరుగుగా లేకపోయినా, గత పథకాలతో పాటు కొత్త పథకాలను కూడా కొనసాగిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
విమానాశ్రయంలో పాముల కలకలం:
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGI Airport) కస్టమ్ శాఖ అధికారులు పెద్ద ఎత్తున అక్రమ అటవీ జీవాల రవాణాను అడ్డుకున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 23) నాడు ముగ్గురు విదేశీ అటవీ జీవాలను అక్రమంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, రాత్రి 1:30 గంటల సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి ప్రయాణ బ్యాగుల్లో అనేక విదేశీ అరుదైన జంతువులు లభ్యమవడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ముగ్గురు ప్రయాణికులు ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 303 ద్వారా బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో అనుమానాస్పదంగా కనిపించిన వారిని అధికారులు ఆపి తనిఖీ చేయగా.. వారి బ్యాగుల్లో అనేక అరుదైన విదేశీ జంతువులు ఉన్నట్లు బయటపడింది. దీనిపై కస్టమ్ శాఖ అత్యంత సీరియస్‌గా స్పందించి, అక్రమంగా తీసుకువస్తున్న ఈ అటవీ జీవాలను స్వాధీనం చేసుకుంది. వారి బ్యాగ్ ల తనిఖీ అనంతరం వివిధ రకాల పాములు, కీటకాలు లభ్యమయ్యాయి. స్వాధీనం చేసుకున్న వాటిలో 5 కార్న్ పాములు, 8 మిల్క్ పాములు , 9 బాల్ పైథాన్ పాములు, 4 బియర్డెడ్ డ్రాగన్ చిపకిళ్లు, 7 క్రెస్టెడ్ గెకో చిపకిళ్లు, 11 కామెరూన్ డ్వార్ఫ్ గెకో, మరో 14 కీటకాలు, ఒక పెద్ద సాలీడు కూడా స్వాధీనం చేసుకున్నారు.
మ్యాడ్ స్క్వేర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్:
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన వినోదాత్మక చిత్రం మ్యాడ్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం 2023లో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, భారీ బ్లాక్ బస్టర్ ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది మ్యాడ్. గతేడాది ఈ బ్లాక్‌బస్టర్ సినిమా ‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ని రూపొందిస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా యూత్ ఈ మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్‌టైనర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా మ్యాడ్ 2 టీజర్ డేట్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. మ్యాడ్ స్క్వేర్ టీజర్ ను ఈ నెల 25న రిలీజ్ చేస్తున్నాం అని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. మొదటి భాగానికి భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన పాటలన్నీ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు రెండో భాగంలో అంతకుమించిన చార్ట్ బస్టర్ పాటలు ఈ సీక్వెల్ లో ఉండబోతున్నాయి. అందరూ మెచ్చుకునేలా ‘మ్యాడ్’ చిత్రాన్ని రూపొందించిన రచయిత, దర్శకుడు కళ్యాణ్ శంకర్ సీక్వెల్‌ను మరింత వినోదాత్మకంగా మలిచే పనిలో ఉన్నారు. మొదటి భాగాన్ని ఇష్టపడిన ప్రతి ఒక్కరూ, రెండో భాగాన్ని మరింత ఇష్టపడతారని నిర్మాతలు ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. రెట్టింపు వినోదంతో, రెట్టింపు విజయాన్ని ఖాతాలో వేసుకుంటామని చిత్ర బృందం చెబుతోంది. భారీ అంచనాలు ఉన్న మ్యాడ్ 2 మార్చి 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
వర్జినిటీ అనేది అంత ముఖ్యమైన విషయం కాదు:
సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేది కామన్. కానీ సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో, హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. ఇలాంటి జంటలు చాలా ఉన్నాయి. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుకుంటారు. ఇలాంటి ఘటనలు బాలీవుడ్‌లో చాలా జరిగాయి. తాజాగా ఓ హీరోయిన్ కూడా ఈ కన్యత్వం గురించి బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. ‘చాలామంది వ్యక్తులు తమ భార్యలు వర్జీన్‌గా రావాలని కోరుకుంటారు. కానీ వర్జిన్ అనేది అంత ముఖ్యమైన విషయం కాదు.వర్జినిటీ అనేది ఒక్క రాత్రిలో పొతుంది.. దాని కోసం పెద్దగా పట్టించుకోవద్దు. అర్థం చేసుకొని, నచ్చిన విధంగా ఉండే అమ్మాయి జీవిత భాగస్వామిగా రావాలని కోరుకోవాలి. ఎందుకంటే మంచి చెడు అనేది మనిషి ముఖం మీద కనిపించదు. ఒక అమ్మాయి ఒక మగాడిని నమ్మితే ఏదైనా చేస్తుంది. కానీ కలిసిన ప్రతి జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని లేదు. అందుకు అదృష్టం ఉండాలి. అది వర్కౌట్ అవ్వనప్పుడు ఇంకోకరితో జివీతం పంచుకుంటాం. అలాంటప్పుడు వర్జినిటీ గురించి పట్టించుకోవద్దు’ అంటూ ప్రియాంక చోప్రా తెలిపింది. ఇక ఆమె మాటల పై కొందరు మద్దతు తెలుపుతుంటే, మరి కొందరు ఆమె వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు.ఇక ప్రజంట్ హాలీవుడ్ ల బీజిగా గడుపుతున్నా ప్రియాంక రీసెంట్‌గా మహేష్ బాబు మూవీ కోసం ఇండియా వచ్చింది. ప్రజంట్ అని పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ కనిపిస్తుంది.
3 సార్లు జై బాలయ్య అనాల్సిందే:
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా ధమాకాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఫేం దర్శకుడు త్రినాథరావు దర్శకత్వం ‘మజాకా’ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, సాంగ్స్ కు మంచి స్పందన లభించింది. తాజాగా మజాకా ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ట్రైలర్ విషయానికి వస్తే సందీప్ కిషన్, రావు రమేష్ తండ్రి కొడుకులుగా నటించగా వారికి జోడీలుగా రీతూ వర్మ, మన్మధుడు ఫేం అన్షు నటించారు. వీరి మధ్య జరిగే సరదా సన్నివేశాలతో ట్రైలర్ కట్ చేసారు మేకర్స్. ట్రైలర్ లోని ఆ అమ్మాయిని పడేయాలి అంటే మన్మధుడు లా ఉండాలి కానీ మీరు మనవడిని ఎత్తుకునే వాడిలా ఉన్నారు బాగా పేలాయి. ఇక చివర్లో వచ్చే జై బాలయ్య డైలాగులు ట్రైలర్ కే హైలెట్ అని చెప్పాలి. హైపర్ ఆది. మురళి శర్మ, శ్రీనివాస రెడ్డి తమ మార్క్ కామెడితో ఆకట్టుకున్నారు. లియో జేమ్స్ అందించిన నేపధ్య సంగీతం వినసొంపుగా గా ఉంది. ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా ఈ మహా శివరాత్రికి ఆడియెన్స్ ను నవ్వించానికి వస్తున్నాం అని ఈ నెల 26న రిలీజ్ డేట్ ను అన్న సంగతి చెప్పకనే చెప్పాడు. మొత్తానికి మజాకా ఔట్ అండ్ ఔట్ కామెడి ఎంటర్టైనర్ గా రాబోతుందని ట్రైలర్ చుస్తే తెలుస్తోంది.
బాబర్ అజామ్ ఆడుతాడా?:
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మరికొద్దిసేపట్లో చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్తాన్ జట్ల తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే కీలక మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ డుమ్మా కొట్టాడు. దీంతో భారత్‌తో మ్యాచ్‌లో బాబర్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బాబర్ నెమ్మదిగా ఆడిన విషయం తెలిసిందే. 90 బంతుల్లో 64 పరుగులు చేయడంతో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. పాకిస్తాన్ తాత్కాలిక కోచ్ ఆకిబ్ జావెద్ మీడియాతో మాట్లాడుతూ.. బాబర్ అజామ్ గైర్హాజరీని చిన్న అంశంగా పేర్కొన్నాడు. బాబర్ ప్రాక్టీస్ సెషన్ నుంచి రెస్టు కావాలని కోరినట్లు తెలిపాడు. భారత్‌తో మ్యాచ్‌లో బాబర్ ఆడుతాడని స్పష్టం చేశాడు. టీమిండియాపై బాగా ఆడుతాడనే ధీమా వ్యక్తం చేశాడు.
భారత్- పాకిస్థాన్ మధ్య బ్లాక్ బస్టర్ పోరు:
దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్- పాకిస్తాన్ మధ్య బ్లాక్ బస్టర్ మ్యాచ్ జరగబోతుంది. ఈ రెండు జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా కొనసాగనుంది. ఈ రెండు జట్ల మధ్య 16 నెలల తర్వాత జరిగే మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.