అన్యాయాలు చేసిన వారిని బట్టలూడదీసి నిలబెడతా:
రాష్ట్రంలో నచ్చని వారిపై కేసులు పెట్టిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ఎల్లకాలం టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి ఉండదని, అన్యాయాలు చేసిన వారిని బట్టలూడదీసి నిలబెడతా అని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూలిపోతోందని, ప్రతీ చోటా కేసులు పెట్టి బెదిరిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీని చూస్తే ఆక్రోశం వస్తోందని జగన్ పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో వంశీని ములాఖత్‌లో జగన్ కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు వంశీతో జగన్ మాట్లాడారు. ములాఖత్ అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘పొద్దున్నే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఓ పథకం ప్రకారం ఇదంతా చేశారు. లా అండ్ ఆర్డర్‌ను తప్పుదోవ పట్టించారు. రాష్ట్రంలో నచ్చని వాళ్ళపై కేసులు పెట్టిస్తున్నారు. నెలలు నెలలు జైలులో పెట్టించే కార్యక్రమం ఇది. నిన్న పిడుగురాళ్ల మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు చేశారు. ఒక్క సభ్యుడు లేకపోయినా వైస్ చైర్మన్ పదవి గెలుచుకున్నాం అని సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారు. తిరుపతిలో కూడా అదే పద్ధతిలో చేశారు. బస్సుల్లో వెళ్తున్న వారిని కిడ్నాపులు చేశారు. తునిలో 30కి 30 వైసీపీ గెలిచింది. వైసీపీ వాళ్లను దౌర్జన్యం చేసే అవకాశం లేకపోతే ఎన్నికలు వాయిదా వేస్తున్నారు. పాలకొండ లో కూడా అంతే’ అని జగన్ అన్నారు.
వల్లభనేని వంశీపై తప్పుడు కేసులు పెట్టారు:
విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ములాఖత్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు వంశీతో జగన్ ములాఖత్ అయ్యారు. జగన్ వెంట వంశీ సతీమణి పంకజశ్రీ, సింహాద్రి రమేష్ జైలు లోపలికి వెళ్లారు. ములాఖత్‌లో వంశీని పరామర్శించడానికి కొడాలి నాని,పేర్ని నాని పేర్లు కూడా వైసీపీ నేతలు ఇచ్చారు. సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ఈ ఇద్దరికీ అనుమతి ఇవ్వలేమని జైలు అధికారులు చెప్పారు. విజయవాడ జైల్లో కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. వల్లభనేని వంశీతో ములాఖత్ అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దిగజారిపోయింది. అతి దారుణంగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే వ్యక్తి ఈ కేసుతో తనకు సంబంధం లేదని చెప్పాడు. జడ్జి ముందే తన వాంగ్మూలాన్ని ఇచ్చాడు, వంశీకి సంబంధం లేదని చెప్పాడు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో పట్టాభితో సీఎం చంద్రబాబు బూతులు తిట్టించారు. ఎవరేం పీకుతారో చూస్తానంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. వైసీపీ శ్రేణులు సంయమనంగానే వ్యవహరించారు. పట్టాభి మనుషులు ఓ దళిత సర్పంచ్ పై దాడి చేశారు. దాడి ఘటనలో సీఐ కనకారావుకు కూడా గాయాలు అయ్యాయి. ఇరు వర్గాలపై పోలీసులు కేసులు పెట్టారు. మేము అధికారంలో ఉన్నా.. న్యాయబద్దంగానే వ్యవహరించాం’ అని అన్నారు.
సైబర్ సేఫ్టీలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్:
హైదరాబాద్ లో జరిగిన సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 2025 కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ రాష్ట్రాన్ని సైబర్ భద్రతలో దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సైబర్ నేరాలు కేవలం వ్యక్తిగత, ప్రభుత్వ స్థాయిలోనే కాకుండా ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణను సురక్షిత బిజినెస్ హబ్ గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.
బెట్టింగ్ భూతానికి మరో ప్రాణం బలి:
కామారెడ్డిలో బెట్టింగ్ మోజు ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో 80 లక్షలకుపైగా కోల్పోయి అప్పుల బాధలో మునిగిపోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సంజయ్ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. భార్య శ్రీలత కన్నీరుమున్నీరవుతూ.. అప్పుల బాధల వల్లే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, బెట్టింగ్ యాప్‌లను తక్షణమే నిషేధించాలని కోరింది. అలాగే, ఎవరైనా అప్పు ఇచ్చే ముందు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలి అంటూ వాపోయింది. సంజయ్ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతనిపై అప్పుల వసూళ్లకు పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బెట్టింగ్ ద్వారా అతను ఎంత మేరకు నష్టపోయాడు? ఎవరి వద్ద ఎంత అప్పులు చేశాడు? ఎవరు అతనిపై ఒత్తిడి తెచ్చారు? అనే కోణాల్లో విచారణ చేపట్టే పనిలో పడ్డారు. ఈ ఘటన మరోసారి బెట్టింగ్ యాప్‌ల వల్ల కలిగే ప్రమాదాన్ని గుర్తు చేస్తోంది. ప్రజలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు లోనవ్వకుండా, ఆర్థికంగా బాధ్యతగా వ్యవహరించేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
సార్క్ పునరుద్ధరణకు భారతదేశం మద్దతు కోరిన బంగ్లాదేశ్:
ఒమన్‌లోని మస్కట్‌లో జరిగిన 8వ హిందూ మహాసముద్ర సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్- పాకిస్తాన్ మధ్య వివాదంతో చాలా కాలంగా సార్క్ పునరుద్ధరణపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) పునరుద్ధరణకు భారత్ మద్దతును కోరారు. అలాగే, సార్క్ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని హుస్సేన్ నొక్కి చెప్పారు.
యూట్యూబర్ రణవీర్ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం:
కుటుంబ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియాపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పాపులారిటీ ఉంటే ఏది పడితే అది మాట్లాడటానికి సమాజం అనుమతించదని స్పష్టం చేసింది. దేశం విడిచి వెళ్లొద్దని, పాస్‌పోర్టు సరెండర్ చేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఎలాంటి షోలు చేయవద్దని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. రణవీర్ చేసిన వ్యాఖ్యలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లకు వ్యతిరేకంగా అల్హాబాదియా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. అతని మనసులో ఏదో మురికి ఉందని.. దాన్ని యూట్యూబ్ షోలో కక్కేశాడని న్యాయస్థానం పేర్కొంది. సమాజంలో విలువలు అంటే ఏమిటి? దాని పారామితులు ఏమిటి, మీకు తెలుసా? అని ప్రశ్నించింది. సమాజంలో కొన్ని పరిమితులు, విలువలు ఉంటాయని… వాటిని గౌరవించాలని తెలిపింది. వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా? అని ఏది పడితే అది మాట్లాడడానికి సమాజ నిబంధనలు ఒప్పుకోవని చెప్పింది. షోలో అతడు ఉపయోగించిన మాటలు.. మహిళా సమాజాన్ని సిగ్గుపడేలా చేసిందని అభిప్రాయపడింది. అతడు ఉపయోగించిన మాటలు అశ్లీలత కాకపోతే.. ఇంకేంటి?, అతడిపై ఎందుకు ఎఫ్ఐఆర్‌లు బుక్ చేయకూడదు.. ఎందుకు అరెస్ట్ చేయకూడదని రణవీర్ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే అరెస్ట్‌పై తాత్కాలిక ఉపశమనం కల్పించింది. రణ్‌వీర్ తరపున మాజీ సీజేఐ డీవై. చంద్రచూడ్ కుమారుడు అభినవ్ వాదనలు వినిపించారు.
లెబనాన్‌లో ఐడీఎఫ్ దాడి:
లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ఈ దాడుల్లో హమాస్ ఆపరేషన్స్ అధిపతి ముహమ్మద్ షాహీన్ హతమయ్యాడు. షాహీన్.. ఇరాన్ డైరెక్షన్, నిధులతో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా ఐడీఎఫ్ గుర్తించింది. ఇజ్రాయెల్ పౌరులపై ఉగ్ర దాడులు ప్లాన్ చేయడంలో షాహీన్ హస్తం ఉన్నట్లుగా గుర్తించింది. ప్రస్తుతం లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నడుస్తోంది. దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ తన దళాలను ఉపసంహరించుకుంటున్న సమయంలో ఈ దాడికి పాల్పడింది. సిడాన్ ప్రాంతంలో జరిగిన దాడిలో షాహీన్ హతమైనట్లుగా ఐడీఎఫ్ తెలిపింది. ఇతడు హమాస్ జరిగించిన ఆపరేషన్‌లో కీలకంగా ఉన్నట్లుగా తెలిపింది. అంతేకాకుండా వివిధమైన దాడుల్లో ఇతని పాత్ర స్పష్టంగా ఉందని పేర్కొంది. షాహీన్ ఆధ్వర్యంలో.. ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేశాడని ఇజ్రాయెల్ తెలిపింది.
పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యంపై వాటికన్ కీలక ప్రకటన:
పోప్ ఫ్రాన్సిస్ (88) ఆరోగ్యం ఇంకా సంక్లిష్టంగానే ఉన్నట్లుగా వాటికన్ సిటీ తెలిపింది. గత శుక్రవారం శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో రోమ్‌లోని జెమెల్లి ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూనే ఉన్నారు. మరి కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉందని వాటికన్ పేర్కొంది. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షలో శ్వాసకోశంలో పాలీమైక్రోబయల్ ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలిపింది. దీన్ని నుంచి ఇంకా కోలుకోలేదని తెలిపింది. తాజాగా నిర్వహిచిన టెస్టులను బట్టి మరిన్ని రోజులు ఆస్పత్రి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాటికన్ తెలిపింది. జ్వరం నుంచి అయితే ఫ్రాన్సిస్ కోలుకున్నారని తెలిపింది. ఇక ఫ్రాన్సిప్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు గాజాలోని ఏకైక కాథలిక్ పారిష్ వాకబు చేస్తూనే ఉన్నారు. ఇక సోమవారం పోప్ ఫ్రాన్సిస్ కొంత సేపు పని చేశారని, పత్రాలు కూడా చదివారని వాటికన్ తెలిపింది. ఫ్రాన్సిస్.. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
సీక్వెల్స్ తో సేఫ్ గేమ్ ఆడుతున్న కోలీవుడ్ హీరోలు:
కోలీవుడ్ లో ఒకరిని చూసి ఒకరు సీక్వెల్ ప్రాజెక్ట్ లు స్టార్ట్ చేస్తున్నారు. గతం సంగతి ఎలా ఉన్నా ఈసారి తంబీల సీక్వెల్స్ కు మంచి డిమాండ్ ఉంది. తమిళ హీరోలు హిట్ కొడితే చాలు అన్నట్లుగా ఉన్నారు. గతేడాది సరైన సక్సెస్ లేని హీరోలైతే తమ పాత హిట్ లకు సీక్వెల్స్ తెచ్చే పనిలో పడ్డారు. ఇంకొందరు అప్పటివరకు ఏం వెయిట్ చేస్తామని చెప్పి ఒకటి రెండు సినిమాల తర్వాత సీక్వెల్స్ షురూ చేస్తున్నారు. శివ కార్తికేయన్ రీసెంట్ చిత్రం “అమరన్”తో భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా శివకార్తికేయన్ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తో ‘మదరాసి’ సినిమా ప్రకటించాడు. ఇది గతంలో మురుగదాస్ డైరెక్ట్ చేసిన తుపాకీ ఫిలింకు సీక్వెల్ అని చెన్నై వర్గాల టాక్. ఇక రజనీకాంత్ కు జైలర్ తర్వాత లాల్ సలామ్ ,వెట్టియాన్ రూపంలో రెండు ఫ్లోప్స్ పలకరించాయి. దీంతో ఎలాగైనా హిట్ ఇవ్వలని జైలర్ 2ను మొదలుపెట్టాడు. ఇక మరొక యంగ్ హీరో కార్తీ ఏకగన్ రెండు సీక్వెల్స్ ను తీసుకురానున్నాడు. ఖైదీ తర్వాత ఆ స్థాయి హిట్ ను మళ్ళీ అందుకోలేని కార్తీ దీనికి సీక్వెల్ గా ఖైదీ -2 ను తీసుకురాబోతున్నాడు. అలాగే కార్తీ మరో హిట్ సర్దార్ కు సీక్వెల్ గా సర్దార్ -2 ను సెట్స్ పైకి తీసుకువెళ్లాడు కార్తీ. అలాగే చాలా కాలంగ హిట్ లేక ఇబ్బంది పడుతున్న రవి మోహన్ తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఆయినటువంటి తనివరువన్ కు సీక్వెల్ గా తనివరువన్ 2 ను చర్చల దశలో ఉంది. ఇలా కోలీవుడ్ హీరోలందరూ ఇప్పుడు సీక్వెల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఆస్కార్ విజేత కీరవాణి మ్యూజికల్ కాన్సర్ట్:
ప్రజంట్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్‌లకు మధ్య పోటి పెరిగిపోయింది. దీంతో సీనియర్ సంగీత దర్శకులకు అవకాశాలు రావడం కష్టం అయ్యింది. ఇప్పుడు అంతా దేవీ, థమన్, అనిరుధ్ చుట్టూ తిరుగుతున్నారు. అలా ఇప్పుడున్న పోటీలో ఒకప్పటి మ్యూజిక్ డైరెక్టర్స్ అంతా సైలెంట్ అయిపోయారు. అడపా దడపా తప్పితే వాళ్ల పాటలు కూడా వినిపించడం లేదు. కానీ కీరవాణిని చూస్తుంటే ఇది తప్పనిపిస్తుంది.. ఆయన టైమ్ మళ్లీ స్టార్ట్ అయింది. ‘RRR’ మూవీతో ఆస్కార్ విజేతగా నిలిచిన సంగీత దర్శకుడు ఎం. ఎం.కీరవాణి ఇప్పటికి అంతే ఫామ్ లో ఉన్నాడు. అందుకే ముందు నుంచి కూడా రాజమౌళి తన ప్రతి ఒక సినిమాకు ఆయనే ఎంచుకుంటాడు. అందులో పాటలు ఎలా ఉన్నా.. ఆర్ ఆర్ మాత్రం అదిరిపోతుంది. కేవలం తన బ్యాగ్రౌండ్ స్కోర్‌తోనే సినిమా స్థాయి పెంచేస్తుంటారు కీరవాణి.
టీమిండియా ప్లేయర్స్కు బీసీసీఐ గుడ్న్యూస్:
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఘోర ఓటమి తర్వాత ప్లేయర్స్, స్టాఫ్‌కు సంబంధించి బీసీసీఐ కఠిన నిబంధనలు విధించింది. ఇకపై క్రికెటర్లు తమ భాగస్వాములు, ఫ్యామిలిని వెంట తీసుకెళ్లడం సహా పలు సౌకర్యాల విషయంలో ఆంక్షలు పెట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని ఇప్పటికే బీసీసీఐ తేల్చి చెప్పింది. కానీ, తాజాగా ఈ ‘నో ఫ్యామిలీ రూల్’ నుంచి ప్లేయర్స్ కు కాస్త రిలీఫ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దుబాయ్‌కి ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులను తీసుకెళ్లచ్చని చెప్పిందని టాక్. అందుకు కొన్ని షరతు పెట్టినట్లు తెలుస్తుంది.