తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా:
తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. మంగళవారం ఉదయం ఎన్నిక నిర్వహిస్తామని చెప్పారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 10 మంది కౌన్సిలర్లు మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు. తమకు రక్షణ కల్పిస్తేనే ఎన్నికకు వస్తామని వైసీపీ కౌన్సిలర్లు ప్రకటించారు. 28 మంది కౌన్సిలర్లలో 15 మంది హాజరైతేనే ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడడం ఇది మూడోసారి.
పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి టీడీపీ కైవసం:
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా ఉన్నం భారతి ఎన్నికయ్యారు. కౌన్సిలర్లు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పురపాలక సమావేశానికి మొత్తంగా 17 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. వైస్ ఛైర్మన్‌గా 30వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ఉన్నం భారతిని కౌన్సిలర్ ప్రతిపాదించగా.. మిగిలిన కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో మొత్తం 33 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మరోవైపు తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికలో ఉత్కంఠ నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. గొడవను అదుపు చేస్తున్న పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదంకు దిగారు. వైసీపీ నేత దాడి శెట్టి రాజా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తుని మున్సిపల్ కార్యాలయానికి 10 మంది టీడీపీ కౌన్సిలర్లు చేరుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. దాంతో అధికారులు ఎన్నికను వాయిదా వేశారు.
మా నాన్న నాకు ఒక్కడికే హీరో కాదు:
నేడు 71వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న కేసీఆర్ కు పెద్దెతున్న శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్బంగా తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. తన తండ్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల తన అనుభూతులను వ్యక్తం చేశారు. “మా నాన్న నాకు ఒక్కడికే హీరో కాదు, తెలంగాణలో అందరికీ హీరోనే” అంటూ ఆయన పేర్కొన్నారు. తాను కేసీఆర్ కుమారుడిగా జన్మించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని అన్నారు.
రూ.1700 కోట్లతో దుబాయ్కి పారిపోయిన ఫాల్కన్ చైర్మన్:
ఫైనాన్షియల్ స్కామ్‌లతో సంబంధం ఉన్న ఫాల్కన్ గ్రూప్ చైర్మన్ అమర్ దీప్ కుమార్ దుబాయ్‌కు పారిపోయాడు. తన అనుచరగణంతో కలిసి ఓ చార్టెడ్ ఫ్లైట్‌లో దేశం విడిచిపెట్టినట్లు సమాచారం. భారత్‌లో డిపాజిట్ల రూపంలో ఏకంగా 1700 కోట్ల రూపాయల భారీ వసూలు చేసిన ఫాల్కన్ గ్రూప్, ఇందులో హైదరాబాద్‌లో మాత్రమే 850 కోట్ల రూపాయలు సేకరించింది. తక్కువ పెట్టుబడి పెట్టి అమెజాన్, బ్రిటానియా, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తున్నామని, అధిక వడ్డీ రూపంలో లాభాలు ఇస్తామని ప్రచారం చేసి ప్రజలను ఆకర్షించింది ఫాల్కన్ సంస్థ.
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య:
కర్ణాటకలోని మైసూరులో ఘోర విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. నలుగురు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. మృతులు మైసూర్‌కు చెందిన చేతన్ (45), భార్య రూపాలి (43), కుమారుడు కుషన్ (15), తల్లి ప్రియంవద (65) గా గుర్తించారు. భార్య, కుమారుడు, తల్లికి విషమిచ్చి చంపిన తర్వాత చేతన్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. వీళ్లంతా విశ్వేశ్వరయ్య నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆత్మహత్యకు ముందు అమెరికాలో ఉంటున్న సోదరుడికి ఫోన్ చేసి అప్పుల బాధతో చనిపోతున్నట్లుగా కాల్ చేసి కట్ చేశాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డారు.
చైనా మన శత్రువు కాదు:
కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఛైర్మన్ శ్యామ్ పిట్రోడా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా పట్ల భారతదేశం యొక్క విధానం ఘర్షణాత్మకమైనదని, ఆ మనస్తత్వాన్ని కాంగ్రెస్ పార్టీ మార్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డ్రాగన్ కంట్రీ నుంచి వచ్చే ముప్పు ఏంటో నాకు అర్థం కావడం లేదన్నారు. చైనా నుంచి వచ్చే ముప్పు తరచుగా ఊహించని విధంగా ఉంటుందని పేర్కొంటూ కొత్త వివాదానికి తెర తీశారు. ఇక, అమెరికా శత్రువును నిర్వచించే ధోరణిని కలిగి ఉండటంతో.. ఈ విషయం తరచుగా వినిపిస్తుందని నేను భావిస్తున్నాను అని తెలిపారు. అన్ని దేశాలు శత్రుత్వం పెంచుకోవడం కాదు.. సహకరించాల్సిన సమయం ఆసన్నమైందని శ్యామ్ ప్రిటోడా వెల్లడించారు.
అమెరికా పోలీసులు సంచలన నిర్ణయం:
చాట్‌జీపీటీ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ (26) కేసును అమెరికా పోలీసులు క్లోజ్ చేశారు. సుచిర్ బాలాజీది హత్య కాదని.. ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తేల్చారు. ఈ మేరకు పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. దీంతో అనేక వారాల దర్యాప్తు తర్వాత పోలీసులు కేసును మూసివేస్తున్నట్లు వెల్లడించారు. హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
దానిపై సమయం వృథా చేయకండి:
అమెరికాలో అతి పెద్ద బ్యాంక్ అయిన జేపీ మోర్గాన్‌లో హైబ్రిడ్ పని చాలా వరకు ముగిసింది. మార్చి నుంచి కార్మికులందరినీ కార్యాలయానికి తిరిగి రావాలని బ్యాంక్ ఆపరేటింగ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. అయితే, చాలా మంది ఉద్యోగులు బ్యాక్ టూ ఆఫీస్ అనే రూల్ పై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో తమ పని-జీవిత సమతుల్యతకు ప్రతికూలంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. దీని వల్ల సీనియర్ ఉద్యోగులు, మహిళలు, అంగ వైకల్యాం ఉన్న వ్యక్తులను తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. ఐదు రోజుల పాటు ఆఫీసుకి రావాలనే పని విధానాన్ని వ్యతిరేకిస్తూ 1,200 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు అంతర్గత పిటిషన్ పై సంతకాలు చేశారు.
నన్ను ఎగతాళి చేస్తారేంటి?:
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్వేతా బసు తానూ ఎదురుకున్న చేదు అనుభవం గురించి పంచుకుంది. శ్వేతా బసు మాట్లాడుతూ..‘ నేను నాకు నచ్చిన సినిమాలు చేసి సంతృప్తిగానే ఉన్నాను . ప్రస్తుతం టెలివిజన్ లో రాణిస్తున్నాను. కానీ కెరీర్ పరంగా ఇబ్బంది పడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఒక తెలుగు సినిమా సెట్ లో చాలా ఇబ్బందిపడ్డాను. ఎందుకంటే హీరోతో పోలిస్తే నా ఎత్తు తక్కువ. దీంతో హీరో ఆరడుగులు ఉంటే ఈవిడేమో 5 అడుగులు ఉంది అని సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేసేవారు. దానికి తోడు హీరోతో వచ్చిన సమస్య మరో స్థాయిలో ఉంది. అతను ప్రతి సన్నివేశాన్ని మార్చేస్తూ ఉండేవాడు. గందరగోళంగా అనిపించేది.. రీటేక్ ఎక్కువగా తీసుకునేవాడు. అతని మాతృభాష తెలుగే. అయినప్పటికీ అతడికి భాషపై పట్టు లేదు. కానీ నన్ను మాత్రం నా కంట్రోల్ లో లేని నా ఎత్తు గురించి కామెంట్ చేసేవాడు. ఎత్తు అనేది వారసత్వంగా వస్తుంది దానికి నేనేం చేసేది. నాకు తెలిసి నేను అంత బాధ పడిన సెట్ ఏదైనా ఉందంటే అదే’ అని శ్వేతా బసు ప్రసాద్ పేర్కొంది.
సలార్, కేజీఎఫ్ రూట్ లోనే ఎన్టీఆర్ – నీల్:
పవర్ హౌజ్ కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో త్వరలోనే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ చూపించబోతున్నారు. సలార్ 2 లైన్లో ఉండగానే ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ ఇతర కమిట్మెంట్స్‌తో బిజీగా ఉండడంతో ముందు ఎన్టీఆర్ సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ నెలలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే.. ఈ సినిమాను కూడా కెజీయఫ్, సలార్ లాగే ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. తన ఫస్ట్ సినిమా ఉగ్రం తప్ప ఆ తర్వాత చేసిన కెజియఫ్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించాడు నీల్. ఆ తర్వాత వచ్చిన సలార్‌ను కూడా టు పార్ట్స్‌గా ప్రకటించాడు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ బ్లాక్ బస్టర్ అవగా క్లైమాక్స్‌లో సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అనౌన్స్ చేశారు. సలార్ 1 కన్నా భారీగా సలార్ 2 తెరకెక్కించే ప్లానింగ్‌లో ఉన్నాడు ప్రశాంత్ నీల్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాను కూడా రెండు భాగాలుగా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. కథ పరిధి ఎక్కువగా ఉండడంతో పాటు సీక్వెల్ సినిమాలు ప్రశాంత్ నీల్‌కు ఓ సెంటిమెంట్‌లా మారింది. కాబట్టి ఎన్టీఆర్ సినిమాకు సీక్వెల్ చేసే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్-నీల్ 2 రావడానికి చాలా సమయం పట్టనుంది. సలార్ 2 తర్వాతే ఈ సినిమా ఉండనుంది. కానీ ఎన్టీఆర్-నీల్ మొదటి భాగం 2026లో రావడం పక్కా. ఇప్పటికే 2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. ఈ లెక్కన అనుకున్న సమయానికి ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవడం కష్టమే అంటున్నారు. మరి ప్రశాంత్ నీల్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.
తొలి విజయాన్ని అందుకున్న గుజరాత్:
మహిళల ప్రీమియర్ లీగ్ మూడవ ఎడిషన్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌లో మూడో మ్యాచ్ ఆదివారం వడోదరలోని కోటంబి స్టేడియంలో యుపి వారియర్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన దీప్తి శర్మ జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా గుజరాత్ 18 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా గుజరాత్ కెప్టెన్ ఆష్లే గార్డనర్ నిలిచింది. ఈ సంద్రాభంగా ఆమె మాట్లాడుతూ.. తన సొంత మైదానంలో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని, మూడు వికెట్లు పడగొట్టి యుపి వారియర్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీసిన లెగ్ స్పిన్నర్ ప్రియా మిశ్రాను కూడా ప్రశంసించింది.