స్కూల్ డేస్‌లో నేను లాస్ట్ బెంచ్:
స్కూల్ డేస్‌లో తనది లాస్ట్ బెంచ్ అని, తమది అల్లరి బ్యాచ్ అని మంత్రి నారా లోకేష్ చెప్పారు. స్కూల్లో పరీక్షలు రాయడం, అసెంబ్లీలో సమాధానాలు చెప్పడం రెండూ కష్టమైనవే అని పేర్కొన్నారు. ప్రతిపక్షం సభలో లేకపోయినప్పటికీ.. అధికారపక్షం సభ్యులు ప్రతిపక్షం కంటే కష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారని చెప్పారు. తన తండ్రి, సీఎం నారా చంద్రబాబు గారి స్పూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ తనకు ఇష్టమైన కొటేషన్ అని మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో మంత్రి భేటీ అయ్యారు.
బోరుగడ్డ అనిల్‌కు 14 రోజుల రిమాండ్:
బోరుగడ్డ అనిల్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వచ్చే నెల మూడో తేదీ వరకు గుంటూరు ఆరవ అదనపు కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్ విధించడంతో పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు బోరుగడ్డ అనిల్‌ను తరలించారు. పీటీ వారెంట్ మీద అనంతపురం జైలు నుంచి గుంటూరు కోర్టుకు పోలీసులు తీసుకువచ్చారు. పెదకాకాని మండల సర్వేయర్ మల్లికార్జునరావును బెదిరించిన కేసులో అనిల్‌కు రిమాండ్ పడింది. తన స్థలానికి సంబంధించిన సర్టిఫికెట్ ఇవ్వాలంటూ 2016 మే 9న పెదకాకాని మండల సర్వేయర్ మల్లికార్జునరావును బోరుగడ్డ అనిల్ బెదిరించారు. తన విధులకు ఆటంకం కలిగించి బెదిరించడంపై పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. గత ఎనిమిది ఏళ్లుగా ఈ కేసులో కోర్టుకి అనిల్ హాజరుకాలేదు. దీంతో నేడు పీటీ వారెంట్‌పై అనంతపురం జైలు నుంచి పోలీసులు గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. మే మూడో తేదీ వరకు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు అనిల్‌ను తరలించారు.
ఇది కాళేశ్వరం కమిషన్ కాదు:
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఈ నోటీసులను ఖండిస్తూ ఆమె తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా ఆమె, ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ప్రజానాయకుడు కేసీఆర్ కి రాజకీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు… కాంగ్రెస్ కమిషన్ అని మరోసారి తేటతెల్లమైందని అన్నారు. కాళేశ్వరం ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించిన బృహత్ ప్రాజెక్టు. తెలంగాణ ప్రజల తరతరాల దాహార్తిని తీర్చడానికి, తెలంగాణ పొలాల్లోకి గోదావరి నీళ్లను గళగళా తరలించడానికి కట్టిన ప్రాజెక్టు. తాను కలలు గన్న తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టే కాళేశ్వరం అంటూ తెలిపారు.
దివ్యాంగులకు శుభవార్త:
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ దివ్యాంగుల వివాహ ప్రోత్సాహ పథకం కేవలం ఒకరు దివ్యాంగులుగా ఉన్న జంటలకే వర్తించేది. అయితే, ఈ పథకం పరిమితిని విస్తరించేందుకు ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక తాజా నిర్ణయం ప్రకారం, ఇకపై ఇద్దరు దివ్యాంగులు ఒకరినొకరు వివాహం చేసుకున్నా వారికి కూడా ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనుంది. ఇప్పటి వరకూ ఒకరు దివ్యాంగుడు లేదా దివ్యాంగురాలు కాగా, మరొకరు సాధారణ వ్యక్తి అయినప్పుడే ఈ పథకం వర్తించేది. అయితే, ఇద్దరూ దివ్యాంగులు అయినప్పుడు ఈ పథకం వర్తించకపోవడంతో చాలామంది అసంతృప్తిని వ్యక్తం చేసేవారు. ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఈ ప్రోత్సాహ పథకం అమలు వల్ల మరిన్ని దివ్యాంగుల పెళ్లిళ్లకు మార్గం సుగమం కానుంది.
పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు ప్రమోషన్:
పాకిస్తార్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కి ఆ దేశ ప్రభుత్వం అత్యున్నత సైనిక హోదాతో సత్కరించింది. ఆసిమ్ మునీర్‌కు ‘‘ఫీల్డ్ మార్షల్’’గా ప్రమోషన్ లభించింది. ఇది చాలా అరుదైన సందర్భాల్లో, సాయుధ దళాల్లో అద్భుతంగా ఆపరేషన్స్ నిర్వహించిన వారికి మాత్రమే ఇచ్చే గౌరవ పదోన్నతి. ప్రధాన మంత్రి షహజాబ్ షరీఫ్ నేతృత్వంలోని మంత్రి మండలి ఆర్మీ చీఫ్‌కి పదోన్నతి కల్పించే ప్రతిపాదనను ఆమోదించింది. జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ ప్రమోషన్ ఇవ్వడం గమనార్హం. పాకిస్తాన్ ‘‘ఆపరేషన్ సిందూర్’’లో ఘోరంగా దెబ్బతిన్నప్పటికీ, విజయం మాదే అని ఆ దేశంలో ప్రచారం చేసుకుంటున్నాయి. భారత్‌పై విజయం సాధించామని ఏకంగా విజయోత్సవ ర్యాలీలు, సంబరాలు చేసుకుంటున్నారు. పాక్ ప్రధాని షరీఫ్‌తో పాటు ఆర్మీ చీఫ్‌లు ఇలాంటి కార్యక్రమాలకు హాజరయ్యారు. పాకిస్తాన్ ప్రజానీకాన్ని వీరంతా బకరాలను చేస్తున్నారు.
పాక్ గూఢచారి’’ జ్యోతి మల్హోత్రాకు బిగుస్తున్న ఉచ్చు:
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉచ్చు బిగుస్తోంది. పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేసిన కేసులో ఆమెను అరెస్ట్ చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), సైనిక ఇంటెలిజెన్స్ సంస్థలు ఆమెను తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి. పాకిస్తా్న్‌తో ఉన్న లింకులు, పాకిస్తాన్ పర్యటనల్లో ఎవరెవరిని కలిశారు..? అని తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది. మే 16న హిసార్‌లోని జ్యోతిని రెస్ట్ చేశారు. ఈమెపై ‘‘అధికారిక రహస్యాల చట్టం’’, బినామీ లావాదేవీల(నిషేధం) చట్టం కింద కేసులు నమోదు చేశారు. జ్యోతి అరెస్ట్ తర్వాత పాకిస్తాన్ గూఢచారులుగా పనిచేస్తున్న మరో 11 మందిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు. ఐదు రోజుల పోలీస్ కస్టడీలో, మంగళవారం నాలుగో రోజు కూడా విచారణ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. హర్యానా పోలీస్, ఎన్ఐఏ, ఐబీ, మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు పలు దఫాలుగా విచారణ జరిపారు. అయితే, జ్యోతి మాత్రం వారికి సహకరించడానికి నిరాకరించినట్లు సమాచారం. 2023 పాకిస్తాన్ సందర్శనలో ఎవర్ని కలిశారు..? హర్కిరత్ సింగ్ అనే వ్యక్తి సహాయకుడిగా వ్యవహరించాడా..? అని అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
హిందువులు టార్గెట్, సహాయం చేయని పోలీసులు:
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో తీవ్రమైన హింస చెలరేగింది. అయితే, ఈ హింసపై కలకత్తా హైకోర్టు ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటి నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. గత నెలలో జరిగిన ఈ ముర్షిదాబాద్ ఘర్షణలు హిందువులను లక్ష్యంగా చేసుకున్నాయని, హింసలో బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారని పేర్కొంది. సహాయం కోసం పిలిచినప్పటికీ పోలీసులు స్పందించడంలో విఫలమైనట్లు నివేదిక తెలిపింది.
వీరికి ఎలాంటి శిక్షలు ఉంటాయి:
పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో సహా 11 మది పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. పాక్ ఐఎస్ఐ డబ్బు కోసం వీరంతా భారత సమాచారాన్ని పాకిస్తాన్‌కి చేరవేస్తున్నారు. ఇందులో జ్యోతి మల్హోత్రా విషయం కీలకంగా మారింది. ఆమెకు ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని, భారత్ చేత బహిష్కరించబడిన డానిష్ అనే వ్యక్తితో సంబంధాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ఇతడి సహకారంతోనే పాకిస్తాన్‌కి మూడుసార్లు వెళ్లి వచ్చింది. దీంతో పాటు మరో ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, భారత ఏజెంట్లను గుర్తించేందుకు జ్యోతి మల్హోత్రాను పాక్ వాడుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ వరకు గూఢచార నెట్వర్క్ విస్తరించింది. ప్రస్తుతం అరెస్టైన నిందితులు పాకిస్తాన్ హ్యాండర్లతో సంప్రదింపులు జరిపినట్లు, భారత సైన్యానికి సంబంధించిన సమాచారంతో పాటు ఇతర సున్నిత సమాచారం పాకిస్తాన్‌కి అందించారే ఆరోపణల్ని వీరంతా ఎదుర్కొంటున్నారు. అయితే, వీరికి ఎలాంటి శిక్షలు పడుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధికారిక రహస్యాల చట్టం ప్రకారం, గూఢచర్యం నేరం. ఉల్లంఘనలకు తీవ్రమైన శిక్షలు విధించవచ్చు. నేరం తీవ్రతను బట్టి మూడు నుంచి జీవిత ఖైదు వరకు శిక్షలు విధించబడుతాయి.
ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లకు కొత్త వేదికలు:
ఐపీఎల్ 2025 సీజన్ చివరి దశకు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మొదట ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లు హైదరాబాద్, కోల్‌కతాలో నిర్వహించాలని నిర్ణయించినా.. టోర్నమెంట్‌లో వారం రోజుల విరామం తర్వాత వేదికలను మార్చింది. తాజా ప్రకటన ప్రకారం ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ముల్లాన్‌పూర్ (న్యూ చండీగఢ్), అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నారు. బీసీసీఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. 70 ఉత్కంఠభరితమైన లీగ్ మ్యాచ్‌ల అనంతరం టాప్-2 జట్ల మధ్య మే 29, గురువారం నాడు న్యూ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ముల్లాన్‌పూర్‌లో క్వాలిఫయర్ 1 జరగనుంది. అదే వేదికపై మే 30, శుక్రవారం నాడు ఎలిమినేటర్ మ్యాచ్ కూడా జరుగుతుంది. ఇక అంతకంటే ఎక్కువ ఉత్కంఠ కలిగించే మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్నాయి. క్వాలిఫయర్ 2 (క్వాలిఫయర్ 1 ఓడిపోయిన జట్టు, ఎలిమినేటర్ గెలిచిన జట్టు) మ్యాచ్ జూన్ 1న ఆదివారం జరగనుంది. కాగా జూన్ 3, మంగళవారం నాడు ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
బెంగళూరు టూ లక్నో:
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య గ్రూప్ మ్యాచ్ మే 23న జరగనుంది. ఈ మ్యాచ్ మొదట బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉండగా.. తాజా సమాచారం మేరకు మ్యాచ్‌ను లక్నోకు మార్చినట్టు తెలుస్తోంది. రజత్ పటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ తమ హోమ్ మ్యాచ్‌ను ఇప్పుడు లక్నోలో ఆడాల్సి వస్తోంది. దీంతో కోహ్లికి టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అభిమానులు బెంగళూరులో ఇచ్చే అభినందనల అవకాశాన్ని కోల్పోయారు. మొత్తానికి ఈ మ్యాచ్ లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది.
ఆసక్తికరంగా మంచు మనోజ్ ‘రక్షక్’:
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘రక్షక్’ను అధికారికంగా ప్రకటించారు. శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు నవీన్ కొల్లి రూపొందిస్తున్న ఈ గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌కు ‘రక్షక్’ అనే శక్తివంతమైన టైటిల్‌ను ఎంచుకున్నారు. టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. మంచు మనోజ్ శక్తిమంతమైన లుక్‌తో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. పోస్టర్‌పై కనిపించే “The hidden truth is never hidden forever (దాచిన నిజం ఎప్పటికీ దాగి ఉండదు)” అనే ట్యాగ్‌లైన్ కథలోని రహస్యాన్ని సూచిస్తూ ఉత్కంఠను పెంచుతుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీగా ఉన్న మంచు మనోజ్, ప్రస్తుతం ‘భైరవం’, ‘మిరాయ్’ చిత్రాల్లో శక్తివంతమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ‘రక్షక్’తో మరోసారి హీరోగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో ఆయన తీవ్రమైన పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ థ్రిల్లింగ్ క్రైమ్ డ్రామా ప్రేక్షకులకు ఉత్కంఠభరితమైన అనుభవాన్ని అందించనుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర బృందం వెల్లడించనుంది.
పరేష్ రావల్ కి 25 కోట్ల లీగల్ నోటీస్:
బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన కామెడీ సిరీస్‌లలో ఒకటైన ‘హేరాఫేరి’ మూడో భాగం ‘హేరాఫేరి 3’ విషయంలో ఊహించని వివాదం చెలరేగింది. పరేష్ రావల్ తప్పుకోవడానికి కారణం గురించి రకరకాల పుకార్లు వినిపించాయి. కొందరు దర్శకుడు ప్రియదర్శన్‌తో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణమని అన్నారు. అయితే, ఈ విషయంపై స్పందించిన పరేష్ రావల్, ప్రియదర్శన్‌తో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఆయన తప్పుకోవడానికి నిజమైన కారణం ఏమిటనేది ఇంకా స్పష్టత రాలేదు. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం, రెమ్యూనరేషన్ విషయంలో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ మధ్య విభేదాలు తలెత్తాయని, ఇదే ఆయన నిష్క్రమణకు కారణమై ఉండవచ్చని అంటున్నారు. ఈ వివాదం మరింత రసవత్తరంగా మారింది, ఎందుకంటే అక్షయ్ కుమార్ పరేష్ రావల్‌కు రూ. 25 కోట్ల లీగల్ నోటీస్ పంపినట్లు సమాచారం. అక్షయ్ కుమార్ ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన నిర్మాణ సంస్థ ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుంది, సినిమా ఎప్పుడు విడుదలవుతుందనేది చూడాలి.
తెలుగు సినిమాకు కేన్స్‌లో అపూర్వ గౌరవం:
2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెలుగు సినిమా ‘ఎం4ఎం’ (M4M – Motive for Murder) ప్రపంచ వేదికపై తన ఘనతను చాటుకుంది. మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో, అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, కేన్స్‌లోని ప్రతిష్ఠాత్మక PALAIS-C థియేటర్‌లో రెడ్ కార్పెట్ స్క్రీనింగ్ ద్వారా ప్రదర్శించబడింది. ఈ వేడుకకు అంతర్జాతీయ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ తరపున దర్శకుడు మోహన్ వడ్లపట్ల, నటి జో శర్మ రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టి గౌరవం పొందారు. స్క్రీనింగ్ అనంతరం ప్రేక్షకుల నుంచి హర్షధ్వానాలు, విమర్శకులు, సినీ అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. తెలుగు సినిమాకు కేన్స్‌లో ఇలాంటి గౌరవం దక్కడం అరుదైన విజయంగా నిలిచింది.
హువావే నోవా 14 సిరీస్ లాంచ్:
చైనా టెక్ దిగ్గజం హువావే తాజాగా nova 14 సిరీస్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో నోవా 14, నోవా 14 Pro, నోవా 14 అల్ట్రా మూడు మోడళ్లను పరిచయం చేసింది. ఈ లాంచ్ నేడు (మే 20) మెట్ బుక్ ఫోల్డ్ అల్టిమెట్ డిజైన్ ల్యాప్టాప్‌తో పాటు జరిగింది. ప్రతి ఫోన్ మోడల్ ప్రత్యేకమైన ఫీచర్లతో మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. మరి ఆ వివరాలేంటో ఒకేసారి చూసేద్దామా. ఈ మొబైల్ 6.81-అంగుళాల LTPO 3.0 డిస్‌ప్లే (2860×1272px, 460 ppi), 1–120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 5500 నిట్స్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లే కలిగి ఉంది. అలాగే 7.78mm స్లిమ్ మైక్రో కర్వ్ బాడీ, స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్, 616 స్టార్లైట్ డైమండ్లతో ఇల్యూమినేటెడ్ రింగ్ కలిగి ఉంది. 50MP RYYB ప్రధాన కెమెరా (F1.4–F4.0, OIS, AIS), 50MP పెరిస్కోప్ టెలిఫోటో (3.7x ఆప్టికల్, 100x డిజిటల్ జూమ్), 13MP అల్ట్రా వైడ్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. అలాగే 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇక ఇందులో ప్రత్యేకతల విషయానికి వస్తే.. DaVinci Portrait Engine, AI ఫోటో ఎడిటింగ్, స్టార్ ఫ్లాష్ రేటరీవాల్, Tiantong శాటిలైట్ కాలింగ్ లు ఉన్నాయి. ఇంకా IP68/IP69 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది.