చంద్రబాబుపై చాలా కేసులున్నాయి.. జనసేన-టీడీపీ కలిసొచ్చిన నష్టం లేదు..
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై చాలా కేసులున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు స్టేలు తెచ్చుకొని నెట్టుకొచ్చారు.. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తప్పించుకోలేకపోయారు అని ఆయన విమర్శించారు. తప్పు చేసినప్పుడు చట్టాల నుంచి తప్పించుకోలేరు.. ధర్నాలు, ఆందోళనలతో కేసుల నుంచి తప్పించుకునే ప్రసక్తి లేదు.. అసెంబ్లీలో అనవసరంగా అల్లరి చేశారు.. చంద్రబాబు కేసులపై చర్చించేందుకు ఎందుకు వెనుకడుగు వేశారని బొత్స సత్యనారాయణ తెలిపారు.
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి క్యూ కట్టిన జనం
తిరుమల కొండపైన భక్తుల రద్దీ భారీగా పెరుగుతుంది. వరుస సెలవులు ఉండటంతో ఒక్కసారిగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో పూర్తిగా నిండిపోయి క్యూలైన్ దాదాపు కిలో మీటరు మేరకు శిలాతోరణం వరకు భారీగా వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 30 గంటలకు పైనే సమయం పడుతోంది. ఇక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. మరోవైపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అలిపిరి చెక్‌పాయింట్‌లో వెహికిల్స్ భారీగా నిలిచిపోయాయి.
స్క్వాష్‌లో భారత్ రికార్డ్.. పసిడి పతకం సాధించిన ఇండియా
ఆసియా క్రీడల్లో భారత్ మరో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని రికార్డ్ సృష్టించింది. స్క్వాష్‌లో పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందింది. 2014 ఆసియా క్రీడల తర్వాత తొలిసారిగా స్క్వాష్‌లో భారత్ పతకం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కు చెందిన అభయ్‌సింగ్ పాకిస్థాన్‌కు చెందిన జమాన్ నూర్‌పై ఉత్కంఠ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అంతకుముందు మ్యాచ్‌లో మహమ్మద్ అసిమ్ ఖాన్‌ను ఓడించి సౌరవ్ ఘోషల్ 1-1తో భారత్‌ను డ్రాగా ముగించాడు.
నారా లోకేశ్ కు ఏపీ సీఐడీ అధికారుల నోటీసులు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు నోటీసులు ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా లోకేశ్ కు సీఐడీ 41ఏ నోటీసులు పంపించింది. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని తెలిపింది. నోటీసులు అందినట్లు లోకేశ్ సీఐడీకి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు అనంతరం నారా లోకేశ్ న్యాయవాదులతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలోని అశోకా రోడ్డు 50లోని ఎంపీ గల్లా జయదేవ్ ఇంటికి నారా లోకేశ్ ఉన్నారు.
రేపు మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
రేపు మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఅర్ఎస్ పార్టీ నేతలు, పాల్గొన్న ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత, ఎమ్మేల్యే దివాకర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజక వర్గంలో రేపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మినిస్టర్ కేటీఆర్ పర్యటన ఉందని తెలిపారు. మందమర్రి, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 312,96 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని ఆయన వెల్లడించారు.
పదవి ఉన్నా లేకున్నా నా గుండె చప్పుడు మాత్రం.. నియోజకవర్గ ప్రజలతోనే
రాజన్నసిరిసిల్ల జిల్లాలో వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రమేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాకు పదవి ఉన్నా లేకున్నా నా గుండె చప్పుడు మాత్రం.. నియోజకవర్గ ప్రజలతోనే ఎల్లప్పుడు ఉంటుందని ఆయన అన్నారు. సంగీత నిలయంలో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహరావును పార్టీ కార్యకర్తలకు పరిచయం చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబు.. నియోజకవర్గంలో మరోసారి బీఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా సంగీత నిలయంలో ముఖ్య సమావేశం ఏర్పాటు చేసుకున్నామన్నారు.
హైదరాబాద్ లో రేపటి నుంచి అందుబాటులోకి లేక్ ఫ్రంట్ పార్క్..
హుస్సేన్ సాగర్ సరసన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ తీర్చిదిద్దిన లేక్ ఫ్రంట్ పార్క్ రేపటి (అక్టోబర్ 1వ తేదీ) నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానుంది. దాదాపు 26.65 కోట్ల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ లేక్ ఫ్రంట్ పార్క్‌ను గత మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరంభించారు. లేక్ ఫ్రంట్ పార్క్ ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండనుందని తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు వాకర్స్‌కు అనుమతి ఉంటుంది. ఇక, నెలకు 100 రూపాయల చొప్పున చెల్లించి మార్నింగ్ వాకర్స్ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని హెచ్ఎండీఏ తెలిపింది.
లంచాలు తిని కంచాలు మోగించేది టీడీపీనే..
క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేలా రెండు రోజుల పాటు సమీక్షా సమావేశాలు నిర్వహించామని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ పార్టీ మోతలు ఎందుకు.. లంచాలు తీసుకొని కంచాలు కొట్టడం ఎందుకు.. అన్ని కోర్టులు తిరస్కరించాకే చంద్రబాబు జైల్లో ఖైదీగా ఉన్నాడు.. ఎవరి కోసం హారన్లు.. ఎవరి కోసం విజిల్స్? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏ మొహం పెట్టుకొని ఇవాళ ఈ ఆందోళనకు పిలుపునిచ్చారు? అని విజయసాయిరెడ్డి మండిపడ్డాడు. రాజ్యాంగంపై, చట్టంపై నమ్మకం లేని అసాంఘిక శక్తులుగా టీడీపీ పార్టీ మారిందని విమర్శలు గుప్పించాడు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపడతాం..
కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేశారు. శనివారం మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘జన్ ఆక్రోశ్’ ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీలో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు బదులుగా ఆర్ఎస్ఎస్, కేంద్ర ప్రభుత్వ అధికారులు దేశ చట్టాలను రూపొందిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో ఓబీసీల జనాభాను ఖచ్చితంగా తెలుసుకోవడానికి కుల ప్రాతిపదికన జనాభా గణనను చేపడుతామని అన్నారు.
దేశంలో అందరి భాగస్వామ్యానికి వీలుగా కులగణన నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. షాజాపూర్ జన్ ఆక్రోష్ యాత్రలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దేశం కొంతమంది పారిశ్రామికవేత్తలది కాదని, అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపట్టి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ వర్గాల ప్రజలు ఎంత మంది ఉన్నారో అందరికి తెలియజేస్తామని తెలిపారు. దేశంలో బీజేపీ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు.
కేరళ రైలు దహనం కేసు.. NIA ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
కేరళ రైలు దహనం కేసులో నిందితుడిపై ఎన్ఐఏ (NIA) ఛార్జ్ షీట్ సిద్ధం చేసింది. నిందితుడు షారుక్ సైఫీ.. రాడికల్ వీడియోలు చూసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని ఎన్ఐఏ చార్జిషీట్‌లో పేర్కొంది. అంతేకాకుండా.. చార్జిషీట్‌లో పలు విషయాలను వెల్లడించింది. ఏప్రిల్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ఘటనకు పాల్పడ్డ నిందితుడు ఢిల్లీలోని షాహీన్‌బాగ్ నివాసిగా గుర్తించారు.
నిందితుడు షారుక్ సైఫీపై IPC, UA(P)A, రైల్వే చట్టం మరియు PDPP చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. NIA ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 2న అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్‌లోని D1 కోచ్‌కు నిప్పంటించిన షారుక్ సైఫీ ఉగ్రవాద చర్యకు పాల్పడ్డాడని ఆరోపించింది. ప్రజలను చంపాలనే ఉద్దేశంతో నిందితుడు ప్రయాణికులపై పెట్రోల్ పోసి, బోగీకి లైటర్‌తో నిప్పంటించారని ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.
కీలక మైలురాయిని దాటిన ఆదిత్య ఎల్1.. భూమి ప్రభావాన్ని తప్పించుకుని ఎల్1 దిశగా ప్రయాణం..
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్ 1 సోలార్ మిషన్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఆదిత్య ఎల్ 1 అనుకున్నట్లుగానే గమ్యం దిశగా పయణిస్తోంది. తాజాగా భూమి ప్రభావాన్ని తప్పించుకుని ముందుకు సాగుతున్నట్లుగా ఇస్రో వెల్లడించింది. ‘స్పియర్ ఆఫ్ ఎర్త్ ఇన్ఫూయెన్స్’ దాటినట్లుగా తెలిపారు. ఇప్పటి వరకు 9.2 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి భూమి ప్రభావం ఉండే ఈ ప్రాంతాన్ని దాటేసిందని ఇస్రో వెల్లడించింది. భూమి, సూర్యుడికి మధ్యలో ఉండే లాంగ్రేజ్ పాయింట్(L1) దిశగా వెళ్తోంది.
ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో రెండు స్పేస్ క్రాఫ్టులు మాత్రమే ఎర్త్ ఇన్ఫూయెన్స్ ని దాటి వెళ్లాయి. అందులో ఒకటి ‘మంగళయాన్’ కాగా, రెండోది ఆదిత్య ఎల్ 1. అనుకున్న మార్గంలోనే ఎల్ 1 పాయింట్ వద్దకు ఆదిత్య ఎల్ 1 పయణిస్తోందని ఇస్రో ఎక్స్(ట్విట్టర్)లో తెలిపింది.
ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ ఎలా ఉండాలనేది లోకేశ్ కనుసన్ననలోనే జరిగింది..?
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ ఎలా ఉండాలి అనేది నారా లోకేశ్ కనుసన్ననలోనే జరిగింది అని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. నారా లోకేశ్ ఎఫ్ఐఆర్ లో ముద్దాయి.. తప్పు చేశాడు.. అప్పటి సీఎం తనయుడిగా ఆయనకు అన్నీ ముందస్తుగా తెలుసు.. అన్నీ తానై లోకేష్ నడిపించాడు.. హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ గా పలు భూములు కొనుగోలు చేశాడు అంటూ ఆయన అన్నారు. క్రిమినల్ మిస్ కాండక్ట్ గా ఆయన శిక్షార్హుడు.. 14 ఏళ్ళు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు ఇవన్నీ తెలియవా.. ప్రజల భూములను కారు చౌకగా కొనుగోలు చేశారు.. నమ్మి భూములు పేదలు, బలహీన వర్గాలను ఇచ్చిన వారిని నట్టేట ముంచాడు అని ఆదిమూలపు సురేష్ మండిపడ్డాడు.
సీఐడీ వైసీపీ అనుబంధ విభాగం.. వాళ్ళు వచ్చి లవ్ లెటర్ ఇచ్చారు..
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మోత మోగిద్దాం కార్యక్రమంలో భాగంగా నారా లోకేశ్ ఢిల్లీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై కక్షసాధింపు కోసం జ్యుడిషియల్ రిమాండ్ కు పంపారు అని తెలిపారు. బాబు రిమాండ్ కు వెళ్ళే ముందు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పోరాడాలి అన్నారు.. అన్ని నియోజక వర్గాల్లో ప్రజలు ఆందోళన చేస్తారు.. సీఐడీ వైసీపీ అనుబంధ విభాగం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లేని కేసును తీసుకు వచ్చారు.. ఇన్నర్ రింగ్ రోడ్ లేదు కానీ.. స్కాం ఉందట అని లోకేశ్ అన్నారు.
సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ ను విచారించే బెంచ్ ఖరారు..!
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్ తర్వాత పెద్ద పెద్ద లాయర్లతో ఈ కేసును వాదిస్తున్నారు. అయినా.. చంద్రబాబుకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ముందుగా ఏపీ హై కోర్ట్ లో ఈ కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. అయినా చంద్రబాబు తరపున లాయర్లు వెనుకంజ వేయకుండా.. ఓటమిని ఒప్పుకోకుండా సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఒక్కసారి కూడా ఈ కేసును విచారించకుండానే అక్టోబర్ 3వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.