మహిళలకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతుందంటే?
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. వరుసగా నాలుగు రోజులు పెరిగిన బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో శనివారం (ఆగష్టు 26) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,450గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఏ మార్పు లేదు. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,600గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,750లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,730 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450గా కొనసాగుతోంది.
భారీగా పడిపోయిన టమాటా ధర.. కిలోకు రూ.10!
రెండు నెలలుగా టమాటా ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. గత నెలలో కిలో టమాటా ధర రూ. 200 నుంచి 240 వరకు పలికి ఆల్‌టైం రికార్డు క్రియేట్ చేసింది. అయితే పెరిగిన టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. వందల ఎకరాల్లో సాగు చేసిన పంట ఒకేసారి చేతికి రావడంతో ధరలు దిగొచ్చాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం కిలో టమాటా ధర రూ.10 పలికింది.
పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాటా కొనుగోళ్లు శుక్రవారం పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. రైతులు మొదటి రోజే దాదాపుగా 10 టన్నుల సరకు మార్కెట్‌కు తీసుకొచ్చారు. వేలంలో క్వింటాల్ టమాటా రూ. 1000 కంటే తక్కువ ధరే పలికింది. ఆ లెక్కన కిలో టమాటా రూ.10 కూడా పలకలేదు. దాంతో రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
వాతావరణంలో మార్పు.. ఏపీ, తెలంగాణలో తేలికపాటి వర్షాలు
రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో మోస్తారు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఏపీలోని కొన్ని చోట్ల కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. వాతావరణంలో మార్పులు రానున్నాయని, రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని అంచనా. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు వర్షాలు కురుస్తాయని.. సెప్టెంబర్ 3 తర్వాత రాష్ట్రంలో మళ్లీ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అయితే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని పలువురు రైతులు వాపోతున్నారు.
అప్పన్న దర్శనం చేయిస్తానని టోకరా
అప్పన్న దర్శనం చేయిస్తానని భక్తుడికి టోకరా వేసాడు ఓ కేటుగాడు..హైదరాబాద్ నుంచి కుటుంబసమేతంగా దర్శనానికి వచ్చిన శ్రీరామమూర్తి అనే భక్తుడు కీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వీఐపీ దర్శనం కల్పిస్తానని చెప్పి ఓ అజ్ఞాత వ్యక్తి మోసం చేసాడు.. హైదరాబాద్ నుంచి శ్రీరామమూర్తి తన భార్య, కుమారుడితో కలిసి శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో సింహగిరికి వచ్చారు.. పాత విచారణ కార్యాలయం వద్ద వారిని ఓ అజ్ఞాత వ్యక్తి కలిసి వీఐపీ దర్శనం, ఆశీర్వచనం, ప్రసాదం అంద జేస్తానని చెప్పి రూ.900 తీసుకున్నాడు.. అక్కడే ఉండమని చెప్పి వెళ్లాడు. అతని కోసం ఎదురుచూసిన శ్రీరామమూర్తి ఎంతకీ రాకపోయేసరికి.. సింహగిరిపై ఉన్న సహాయక కేంద్రంలో ఫిర్యాదు చేసాడు.. సిబ్బంది సింహగిరిపై అతని కోసం గాలించారు. ఫలితం లేకపోయింది. అతన్ని గుర్తించేందుకు దేవస్థానం సిబ్బంది సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు… ఇటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామంటున్నరు దేవస్థానం అధికారులు.
శ్రావణ శుక్రవారం వేళ.. గుడ్‌న్యూస్ చెప్పిన యువరాజ్ సింగ్!
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ అభిమానులతో ఓ శుభవార్త పంచుకున్నాడు. తన భార్య హేజెల్ కీచ్ పండండి ఆడ పిల్లకు జన్మనిచ్చిందని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. భార్య, కుమారుడు, పాపతో ఉన్న ఫొటోను శుక్రవారం యువీ ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. శ్రావణ శుక్రవారం వేళ యువీ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. అభిమానులు యువరాజ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
‘ఎన్నో నిద్రలేని రాత్రులు ఇప్పుడు ఆనంద ఘడియలుగా మారాయి. యువరాణి ఆరాకు ఘన స్వాగతం. ఆమె రాకతో మా కుటుంబం పరిపూర్ణమైంది’అని యువరాజ్ సింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఫొటోకు క్యాప్షన్ జోడించాడు. యువీ తండ్రవ్వడం ఇది రెండోసారి. 2016లో యువరాజ్ సింగ్, హేజిల్ కీచ్‌కు వివాహం అయింది. గతేడాది కుమారుడు ఒరియాన్ పుట్టాడు. ఇప్పుడు కూతురు పుట్టింది. దాంతో యువరాజ్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.
ఆగస్టు 23 నేషనల్ స్పేస్ డే.. ఇస్రో శాస్ర్తవేత్తలతో ప్రధాని భావోద్వేగం
చంద్రయాన్-3ని విజయవంతం చేసిన ఇస్రో శాస్ర్తవేత్తలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. చంద్రుడిపై చంద్రయాన్-3 విజయవంతంగా అడుగుపెట్టిన ఆగస్టు 23ను నేషనల్ స్పేస్ డేగా ప్రకటించారు. చంద్రయాన్-3ను విజయవంతం చేసిన ఇస్రో శాస్ర్తవేత్తలతోపాటు సిబ్బందిని ప్రధాని మోడీ అభినందించారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనలను ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం నేరుగా బెంగుళూరు చేరుకున్నారు. చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతం చేసి భారత ఖ్యాతిని దశదిశలుగా వ్యాపింప చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకుని వారిని ప్రధాని మోడీ అభినందించారు. శనివారం ఉదయాన్నే బెంగుళూరులోని హాల్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడానికి నన్ను నేను ఆపుకోలేక నేరుగా బెంగుళూరు వచ్చానని మోడీ అన్నారు. అనంతర బెంగళూరులోని ఇస్రో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలను అభినందించారు.
ఎల్బీనగర్ ప్రాంతంలో చిరుత సంచారం.. ఆందోళనలో ప్రజలు
చిరుతలు ఎక్కడో అడవుల్లో ఉన్నారని అనుకుంటారు కానీ.. ఇప్పుడు ఆ చిరుతలు పట్నంలో దర్శనమిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరించినట్లు తెలుస్తోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వనస్థలిపురంలోని సాగర్ కాంప్లెక్స్ రోడ్ నెం.6లో గురువారం అర్ధరాత్రి చిరుత సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఓ ఇంటి ఆవరణలో మధ్యాహ్నం 12:30 గంటలకు చిరుతపులి సంచరించిందని యజమాని అఖిల్ తెలిపారు. వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించగా.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లారు. అయితే పోలీసులు వచ్చేలోపే చిరుత ఏరోనాటికల్ కంపెనీ గోడ దూకి అడవిలోకి పారిపోయిందని అఖిల్ వివరించాడు. వెంటనే అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. చిరుత పాదాలను పరిశీలించారు. చిరుత అడవిలోకి వెళ్లిందని అనుమానిస్తున్నారు. సాధారణంగా చిరుతపులి 24 గంటల్లో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని అటవీశాఖ అధికారులు తెలిపారు.