కర్ణాటకలో కాంగ్రెస్ ఖతం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీదే అధికారం..
రెండేళ్ల పాలనలోనే కాంగ్రెస్ పాలన పట్ల కర్ణాటక ప్రజల్లో అసంతృప్తి పెరిగినట్లు తాజాగా సర్వేలో తేలింది. పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే బీజేపీ ఘన విజయం సాధిస్తుందని సర్వే చెప్పింది. అయితే, ఇప్పటికీ సిద్ధరామయ్య రాష్ట్రంలో అత్యధిక మంది ఇష్టపడే ముఖ్యమంత్రి ఫేస్‌గా ఉన్నారని సర్వే చెప్పింది. మొత్తం, 10,481 మంది సర్వేలో ప్రతిస్పందించారు. సర్వే ప్రకారం, బీజేపీ పూర్తి మెజారిటీతో 136-159 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. బీజేపీకి 51 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్‌కి 40.3 శాతం (2023లో 42.88శాతం) ఓట్లతో 53-82 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. జేడీఎస్ 5 శాతం ఓట్లతో 3-6 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని సర్వే చెప్పింది. కర్ణాటకలో మొత్తం 224 సీట్లు ఉన్నాయి, అధికారానికి మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు.
చేయని తప్పుకు బలైన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్.. రూ.24 లక్షల ఫైన్..!
చేయని తప్పుకు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ బలయ్యాడు. నిన్న ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా పటిదార్‌కి 24 లక్షల రూపాయల జరిమానా విధించారు.. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన పటిదార్.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగారు. దీంతో స్టాండింగ్ కెప్టెన్‌గా వికెట్ కీపర్ జితేష్ శర్మ ఉన్నాడు. ఫీల్డింగ్ సెట్ చేయడంలో జితేష్ ఆలస్యం చేయడంతో స్లో ఓవర్ రేట్ జరిగింది. శాశ్వత కెప్టెన్ గా పటిదార్ ఉండటంతో.. బీసీసీఐ ఫైన్ విధించింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా స్లో ఓవర్ రేట్ కావడంతో ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ కమిన్స్‌కి కూడా రూ.12 లక్షల జరిమానా విధించారు..
ప్రతిపక్ష ముఖ్యమంత్రులతో టీ తాగుతూ ప్రధాని మోడీ ముచ్చట్లు.. నవ్వులే.. నవ్వులు..!
ఢిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు నీతి ఆయోగ్ కి సంబంధించి కీలక సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో 2047 వరకు అభివృద్ధి చెందిన భారతదేశ ప్రణాళికలపై చర్చించారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. ప్రధాని మోడీ వారితో టీ తాగుతూ చర్చిస్తున్న ఫొటోలు కనిపించింది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతోనూ ప్రధాని మోడీ ముచ్చటించారు. ప్రతిపక్ష ముఖ్యమంత్రులను ప్రధాని మోడీ ఆప్యాయంగా పలకరించారు.
ఏడేళ్లు హైదరాబాద్‌లో సిరాజ్ మకాం.. గ్రూప్స్ పరీక్షల శిక్షణ పేరుతో…
ఉగ్రకదలికలపై తీవ్ర దృష్టిసారించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), హైదరాబాద్‌లో కీలకంగా మకాం వేసిన సిరాజ్ అనే వ్యక్తి చుట్టూ దర్యాప్తును ముమ్మరం చేసింది. గత ఏడు సంవత్సరాలుగా గ్రూప్స్ పరీక్షల శిక్షణ పేరుతో హైదరాబాద్‌లో తిష్ట వేసిన సిరాజ్, పక్కా వ్యూహంతో కార్యకలాపాలను సాగించినట్లు అధికారులు గుర్తించారు. సిరాజ్‌తో కలిసి ఉన్న సమీర్ అనే వ్యక్తి – హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో రెక్కీ చేసినట్లు తెలిసింది. గత సంవత్సరం నవంబరు 22న ముంబయి అంధేరిలో జరిగిన ఓ మత కార్యక్రమానికి సిరాజ్, సమీర్ హాజరైనట్లు విచారణలో వెల్లడైంది. అందులో అధాన్ ఖురేషి, దిల్హాన్, మొహిసిన్ షేక్, జసీర్ అలియాస్ అమన్, ఫహాద్, అమిర్ అన్సారీ వంటి వ్యక్తులెందరికీ సంబంధించిన సంబంధాలు కూడా వెలుగుచూశాయి.
భారత్ దాడిలో పాకిస్తాన్‌కి తీరని నష్టం.. ఏకంగా రూ. 28,000 కోట్లు ఆవిరి..
భారత్ కొట్టిన దెబ్బకు ఇప్పుడు పాకిస్తాన్‌కి నొప్పి తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో భారత్ పాక్ ఉగ్రవాద స్థావరాలతో పాటు దాని మిలిటరీ స్థావరాలపై దాడులు చేసింది. ముఖ్యంగా, పాక్ వైమానిక దళానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్(OSINT) పాకిస్తాన్ నష్టాన్ని అంచనా వేసింది. పాకిస్తాన్ ఎయిర్, గ్రౌండ్, వార్ రెడీ నెస్ ఇలా ప్రతీదాంట్లో కూడా గణనీయమైన నష్టాన్ని చవిచూసింది. మొత్తంగా చూస్తే ఏప్రిల్-మేలో పాకిస్తాన్ ఏకంగా 3.36 బిలియన్ డాలర్లను నష్టపోయింది. మన కరెన్సీలో సుమారుగా రూ. 28,000 కోట్లు నష్టపోయింది.
భారత్‌లో ఉంటూ.. ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు.. కట్ చేస్తే..
సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక వీడియోలను పోస్ట్ చేసినందుకు ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అరెస్టు చేసిన యువకులను ఇర్ఫాన్, వాజిద్ షాగా గుర్తించినట్లు చైన్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇది మాత్రమే కాదు.. నాలుకలు కోసేస్తామంటూ బెదిరించారు.
వైసీపీ కేంద్ర కార్యాలయ సమీపంలో నిప్పు పెట్టిన దుండగులు..!
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం సమీపంలో మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. అర్ధరాత్రి సమయంలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ సమీపంలో గ్రీనరీకి దుండగులు నిప్పుపెట్టారు. గతంలో ఇదే తరహాలో రెండు అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను తక్షణమే అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో వైసీపీ కార్యాలయ వర్గాలు తాడేపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. వరుస ఘటనలు వైసీపీ శ్రేణుల్లో కలకలం సృష్టిస్తున్నాయి. వైసీపీ కేంద్ర కార్యాలయ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ తాజాగా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు.. ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య..
పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో ఇద్దరు దారుణహత్యకు గురయ్యారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య, కోటేశ్వరరావులు వివాహానికి వెళ్లి బైకుపై తిరిగి గ్రామానికి వస్తుండగా బోదిలవీడు సమీపంలో కారుతో గుద్దించి హత్య చేశారు. హత్యకు ఉపయోగించిన వాహనం కూడా టీడీపీకి చెందిన తోట వెంకట్రామయ్యది అని తేలింది. కొంతకాలంగా వెంకట్రామయ్య, జవిశెట్టి వెంకటేశ్వర్లు వర్గాల మధ్య ఆధిపత్యపోరు నడుస్తుంది.
రేవంత్, ఉత్తంలే తెలంగాణ పాలిట వైట్ ఎలిఫెంట్లు
కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం నిర్మాణంపై ఇష్టారీతిగా వ్యాఖ్యానిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మతి భ్రమించినట్టే కనిపిస్తుందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఒకే అబద్దాన్ని పదే పదే చెబితే ప్రజలు నమ్ముతారన్న భ్రమలో ఉన్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, పంప్‌హౌజ్‌లను వాడుకుంటూనే ప్రాజెక్టును ‘వైట్ ఎలిఫెంట్’గా అభివర్ణించడం హాస్యాస్పదమని హరీష్ వ్యాఖ్యానించారు. ఇది కనీస సామాన్య బుద్ధి లేని వ్యవహారమని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రయోజనం కలిగించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏడాదిన్నరుగా కుట్రలు చేయడం తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని, ఒక్క ఎకరాకు నీళ్లు కూడా అందించలేదని విమర్శించారు.
తప్పుడు నిర్మాణంతో కాలేశ్వరం అనర్థ దిశగా.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
హుజూర్నగర్‌లో ఇరిగేషన్ శాఖ అధికారులతో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపేలా ఉన్నాయి. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయని ఆయన బహిరంగంగా ఆరోపించారు. నిజాలు బయటపడేందుకు ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టులో మూడు బ్యారేజీల ఫౌండేషన్‌లోనే లోపాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. “బెరాజీలు కూలిపోయే పరిస్థితి వస్తే ప్రభుత్వంగా విచారణ జరపాల్సిన బాధ్యత మాపై ఉంటుంది,” అని మంత్రి అన్నారు. కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.