పాక్‌లో వరస దాడులు.. బలూచిస్తాన్‌లో ఆర్మీ కన్వాయ్‌పై ఎటాక్..
పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సులో మరోసారి దాడి జరిగింది. ఇప్పటికే జఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ ఘటనలో పాకిస్తాన్ తన పరువును కోల్పోయింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ వణికిపోతోంది. ఇదిలా ఉంటే, తాజాగా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) మార్గంలో పాకిస్తాన్ బలగాలకు చెందిన కాన్వాయ్ లక్ష్యంగా శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. ప్రస్తుతం వస్తున్న నివేదికల ప్రకారం, బహుళ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. అయితే, అక్కడి అధికారులు మాత్రం వివరాలను విడుదల చేయలేదు.
ఈ 15 నెలల్లో కేసీఆర్ తీసుకున్న జీతం రూ.57.87 లక్షలు.
తెలంగాణ శాసన మండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కేసీఆర్‌పై సీఎం రేవంత్ చేసిన విమర్శలను నిరసిస్తూ శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని అడ్డుకోవడానికి వారు 15 నిమిషాలుగా నిరసన తెలిపారు. సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ, “స్టేచర్ గురించి నేను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే గవర్నర్ ప్రసంగంలో ఉంటాయి. గత ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించింది” అని పేర్కొన్నారు. అంతేకాదు, “కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. ఆయన సభకు హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలి. 15 నెలలుగా సభకు రాకపోయినా, ఆయన రూ. 57.87 లక్షల జీతభత్యాలు తీసుకున్నారు. ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటూ, సభకు హాజరుకాలేకపోవడం దారుణం” అని విమర్శించారు.
బహు భాషా విధానంపై నా వైఖరి ఏం మారలేదు..
ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను గుడ్డిగా వ్యతిరేకించడం.. రెండూ మన భారతదేశం యొక్క జాతీయ, సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నిన్న జనసేన సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పలువురు స్పందించారు. తాజాగా పవన్ వారికి ఎక్స్ వేదికగా సమాధానం చెప్పారు. “నేను ఎప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదు. హిందీని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే నేను వ్యతిరేకించాను. ఎన్‌ఈపీ2020 స్వయంగా హిందీని అమలు చేయనప్పుడు, దాని విధించడం గురించి తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఎన్‌ఈపీ 2020 ప్రకారం, విద్యార్థులు విదేశీ భాషతో పాటు ఏవైనా రెండు భారతీయ భాషలను (వారి మాతృభాషతో సహా) నేర్చుకునే వెసులుబాటును కలిగి ఉంటారు. వారు హిందీని అధ్యయనం చేయకూడదనుకుంటే, వారు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, సంస్కృతం, గుజరాతీ, అస్సామీ, కాశ్మీరీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, సింధీ, బోడో, డోగ్రీ, కొంకణి, మైథిలి, మెయిటీ, నేపాలీ, సంతాలి, ఉర్దూ లేదా ఏదైనా ఇతర భారతీయ భాషను ఎంచుకోవచ్చు. బహుళ భాషా విధానం విద్యార్థులకు ఎంపిక చేసుకునే శక్తిని ఇవ్వడానికి, జాతీయ ఐక్యతను ప్రోత్సహించడానికి, భారతదేశ గొప్ప భాషా వైవిధ్యాన్ని కాపాడటానికి రూపొందించబడింది.
కేసీఆర్ చావు కోరుకోవడం దారుణం.. కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేసింది
తెలంగాణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) చావును కోరుకోవడం ఎంత దారుణమో బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీలో కేసీఆర్ చావును కోరుతూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హరీష్ రావు, దీనికి నిరసనగా శాసనసభలో సీఎం ప్రసంగాన్ని బహిష్కరించినట్లు తెలిపారు. అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ చేసిన హరీష్ రావు, కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అసెంబ్లీలో పూర్తిగా అబద్ధాలు చెప్పారని విమర్శించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే 299 టీఎంసీల కృష్ణా నీటి పంపకాలు జరిగాయని, నిజానికి తెలంగాణలో అంత నీటిని వినియోగించేందుకు తగినన్ని ప్రాజెక్టులే లేవని అన్నారు. కాంగ్రెస్ ప్రాజెక్టులను నిర్మించలేకపోవడమే ఈ అన్యాయానికి కారణమని పేర్కొన్నారు.
‘‘4 శాతం ముస్లిం రిజర్వేషన్’’.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ క్లారిటీ..
కర్ణాటక క్యాబినెట్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం రిజర్వేషన్ కల్పించడంపై బీజేపీ విరుచుకుపడుతోంది. ముస్లిం వర్గాన్ని సంతృప్తి పరచడానికి, కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని, కాంగ్రెస్ ముస్లిం లీగ్ అంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. అయితే, బీజేపీ నుంచి విమర్శలు వచ్చినప్పటికీ 4 శాతం రిజర్వేషన్లకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతు ఇచ్చారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఈ విషయంలో మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ కోటా ఉద్యోగాలకు, విద్యకు కాదు, ఇది కాంట్రాక్టర్ల కోసమని, రూ. 1 కోటి విలువైన ప్రభుత్వ ప్రాజెక్టులకు బిడ్డింగ్ వేయడానికి ఉద్దేశించబడిందని చెప్పారు. 4 శాతం ముస్లింలకు మాత్రమే అనే దానిని డీకే శివకుమార్ ఖండించారు. ఇది ముస్లింలకు మాత్రమే కాకుండా, అన్ని మైనారిటీ, వెనకబడిన తరగతులకు కూడా వర్తిస్తుందని హుబ్బళ్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు.
జగన్ కమిడియన్ అయితే.. మరి నువ్వేంటి నాగబాబు?
జగన్ కమిడియన్ అయితే.. మరి నువ్వేంటి? అని ఎమ్మెల్సీ నాగబాబును మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “నువ్వు, మీ అన్న, మీ తమ్ముడు ముగ్గురూ రాజకీయాల్లోకి వచ్చారు. మీ అన్న ఎలాగోలా కాంగ్రెస్‌లో చేరి మంత్రి అయ్యాడు. శాసనసభకు రావడానికి మీ తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి పదహారు సంవత్సరాల సమయం పట్టింది. అది కూడా చంద్రబాబు నాయుడు సంక ఎక్కితే ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత మీకు ఒక ఎమ్మెల్సీ వచ్చింది. బాగానే ఉంది కానీ.. జగన్మోహన్ రెడ్డితో పోల్పడమే బాగోలేదు. జగన్ వీరోచితంగా పోరాడిన వ్యక్తి. ఢిల్లీ కోటను పగలగొట్టినటువంటి వ్యక్తి. పార్టీ పెట్టిన పదేళ్లకు ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఈ రాష్ట్రాన్ని అయిదేళ్లు పాలించారు. ఆయన తండ్రి, ఆయన ఓటమి ఎరుగని ధీరులు. వాళ్లతో పోల్చుకుంటారేంటి? ఇంకో ఆయన మరో మాట అన్నారు. రాజశేఖర్‌రెడ్డి కొడుకు కాకపోతే ముఖ్యమంత్రి అయ్యేవాడా? అన్నాడు. చిరంజీవి తమ్ముకాకపోతే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? చిరంజీవి కూడా అల్లు రామలింగయ్యతో వియ్యం పొందిన తర్వాత స్టార్ హీరో అయ్యారు. మంచి నటుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
కోకాపేట GAR బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం.. కొందరి పరిస్థితి విషమం
హైదరాబాద్‌లోని కోకాపేట GAR టెక్ పార్క్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు ఐటీ ఉద్యోగులకు తీవ్రగాయాలు కాగా, కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బిల్డింగ్‌లోని రెస్టారెంట్‌లో గ్యాస్ సిలిండర్ పేలినట్లు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్‌లో వందలాది మంది ఉద్యోగులు ఉండటంతో అప్రమత్తమైన అధికారులు వారిని వెంటనే తగిన చర్యలు తీసుకొని బయటకు తరలించారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించింది. రక్షణ చర్యలలో భాగంగా పలు అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగి నాలుగు గంటల పాటు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. గాయపడిన ఉద్యోగులను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ సహాయ చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల అసలు కారణాన్ని గుర్తించేందుకు పోలీసులు, అగ్నిమాపక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బిల్డింగ్‌లో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే అంశంపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబానికి మరో షాక్
సీఆర్‌జెడ్ ఉల్లంఘనలు వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబానికి మరో షాక్ తగిలింది. భీమిలి బీచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ పూర్తిగా తొలగిస్తోంది. ఇక్కడ నేహారెడ్డికి చెందిన భూమిలో భారీ భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఇసుక తిన్నెలు మీద భారీగా గుంతలు తవ్వి స్ట్రాంగ్ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. సముద్ర తీరాన్ని ఆనుకుని చేపట్టిన భవనం అక్రమ నిర్మాణాలుగా నిర్ధారణ కావడంతో కూల్చి వేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈఎక్స్ 200 సామర్థ్యం గల బ్రేకర్, బకెట్ యంత్రాలతో బీచ్‌లో నిర్మించిన అక్రమ కాంక్రీట్ నిర్మాణాలను సుమారు 10 అడుగుల భూమి లోపల వరకు తవ్వి కాంక్రీట్ నిర్మాణ గోడలను తొలగిస్తున్నారు.
“గెలవక ముందు “జనసేనాని”, గెలిచిన తరువాత “భజన సేనాని”
పవన్ కళ్యాణ్ హిందీ భాష గురించి చేసిన కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. “మీ హిందీ భాషను మా మీద రుద్దకండి”, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం”, అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి అని ముందు ట్వీట్ చేయగా ఇప్పుడు మరోసారి ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ పాత ట్వీట్లను తవ్వితీసి “గెలవక ముందు “జనసేనాని”, గెలిచిన తరువాత “భజన సేనాని” అంతేనా అంటూ ఎద్దేవా చేశాడు.
వాస్తవాలకు బీఆర్ఎస్ భయపడుతోంది
తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల తీరుపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను తెలుసుకోవడానికి బీఆర్ఎస్ భయపడుతోందని, ప్రజల ముందు తాము చేసిన తప్పులు బయటపడుతాయనే భయంతోనే అసలు విషయాలను దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో అడ్డుపడుతూ బీఆర్ఎస్ సభ్యులు అనవసరంగా అర్ధాంతరంగా వ్యవహరించడం సబబు కాదని, ప్రజలు ఈ వ్యవహారాన్ని గమనిస్తున్నారని అన్నారు. “బీఆర్ఎస్ సభ్యులు నిజాలను తెలుసుకోవాలంటే భయపడుతున్నారు. వారికీ వాస్తవాలు ఎదుర్కొనే ధైర్యం లేదు. అందుకే అసలు విషయాలను వినకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు,” అని కొండా సురేఖ అన్నారు. “సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించడం సరైంది కాదు. నిరసన తెలుపాలంటే వాకౌట్ చేసి వెళ్లాలి, కానీ సభలోనే అరుస్తూ నినాదాలు చేయడం అసంబద్ధం. ఇది అసలు ప్రజాస్వామ్యానికి తగిన విధానం కాదు.” అని ఆమె అన్నారు.