వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో సౌతాఫ్రికా నయా హిస్టరీ.. 27 ఏళ్ల నిరీక్షణకు తెర..
ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) మూడో రౌండ్ (2023-25) ఫైనల్‌లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా హోరాహోరీగా తలపడ్డాయి. లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయ దుందుభి మోగించింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లో సౌతాఫ్రికా నయా హిస్టరీ క్రియేట్ చేసింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ విజేతగా సౌతాఫ్రికా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను సఫారీలు చిత్తు చేశారు. కెప్టెన్ భవుమా, ఓపెనర్ మార్ క్రమ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. 27 ఏళ్ల తర్వాత తొలిసారి ICC టైటిల్ సాధించింది. 27 ఏళ్ల కలను నిజం చేసుకున్న సఫారీలు. దక్షిణాఫ్రికా ఐదు వికెట్లు నష్టపోయి 282 లక్ష్యాన్ని చేధించింది. గత 27 సంవత్సరాలుగా ఆఫ్రికాపై ఉన్న ‘చోకర్స్’ ముద్ర తొలిగిపోయింది. దక్షిణాఫ్రికా 1998లో తన ఏకైక ICC టైటిల్‌ను గెలుచుకుంది.
సనత్‌నగర్‌లో విషాదం.. కుటుంబ కలహాలతో భవనంపై నుంచి దూకిన మహిళ
హైదరాబాద్ సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎర్రగడ్డలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఓ మహిళ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. శనివారం (14-06-2025) ఉదయం 8:30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం… ఆత్మహత్య చేసుకున్న మహిళ పేరు కొక్కినీ శ్రావణి (30), ఆమె తిమ్మాపురం, ఏలూరు జిల్లా వాసి. కొద్ది నెలల క్రితమే హైదరాబాద్‌కు వలసవచ్చి, జనప్రియ అపార్ట్‌మెంట్‌లో హౌస్ కీపింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమెకు ఇద్దరేళ్ల కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాలే ఆమె ఆత్మహత్యకు కారణమై ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనతో అపార్ట్‌మెంట్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
చంద్రబాబుది అంతా దగా.. మోసం..
మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబటి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యిందన్నారు. చంద్రబాబు ఏడాది పాలన సందర్బంగా పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు.. డప్పు కొట్టుకునే కార్యక్రమాలు చేశారు.. సూపర్ సిక్స్ చేసేశాం అంటున్నారు.. సూపర్ సిక్స్ లో ఏం అమలు చేశారో అర్దం కాలేదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరికీ 15వేలు ఇచ్చామన్నారు. తల్లికి వందనం పేరుతో 30లక్షలమందికి ఎగనామం పెట్టారని మండిపడ్డారు. గతంలో జగన్ చేసినట్లే మీరు ఫాలో అయ్యారు కదా.. పచ్చి అబద్దాలు కూడా సిగ్గులేకుండా చెబుతారు చంద్రబాబు, లోకేష్.. చంద్రబాబు, లోకేష్ ప్రకటనల్లో వత్యాసం ఉంది.. జగన్ కంటే ఎక్కువ ఇస్తారని జనం మీకు ఓట్లేసి ఇప్పుడు అనుభవిస్తున్నారు.. జగన్ ఇచ్చిన దాంట్లో సగం కూడా చంద్రబాబు ఇవ్వలేదు.. రూ. లక్షా 58వేల 450కోట్లు అప్పు చేశారు చంద్రబాబు.. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్న చంద్రబాబు ఇప్పుడు ఏం చెబుతారు అని ప్రశ్నించారు. రికార్డు స్థాయిలో అప్పులు చేస్తూ అభివృద్ధి అంటూ అబద్దాలు చెబుతున్నారు అని మండిపడ్డారు.
ముస్లిం అబ్బాయితో కలిసి పారిపోయిన హిందూ అమ్మాయి..చివరికీ..
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిర్మౌర్‌లోని పాంటా సాహిబ్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇక్కడ ఓ హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయితో పారిపోవడంతో ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో పోలీసులతో సహా 10 మంది గాయపడ్డారు. ఈ అంశంపై పాంట సాహిబ్ పట్టణంలో హిందూ సంస్థలు 4 రోజులుగా నిరసన తెలుపుతున్నాయి. వారు దీనిని లవ్ జిహాద్ కేసుగా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ముస్లిం యువకుడితో పారిపోయిన అమ్మాయి వయస్సు 18 సంవత్సరాలు. 19 ఏళ్ల ముస్లిం యువకుడితో యువతి పారిపోయినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బాధితులకు ఎయిర్ ఇండియా భరోసా.. అదనంగా మరో రూ.25 లక్షలు
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, అలాగే ప్రాణాలతో బయటపడిన వ్యక్తికి తక్షణ ఆర్థిక అవసరాలను నిమిత్తం రూ.25 లక్షల తాత్కాలిక పరిహారాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రూ. 1 కోటి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రూ. కోటి కాకుండా.. అదనంగా రూ.25 లక్షలు ఇస్తున్నట్లు తెలిపింది. “ఎయిర్ ఇండియా నిర్వహణ బృందం అహ్మదాబాద్ నగరంలోనే ఉంది. పరిస్థితి సర్దుమణిగే వరకు అహ్మదాబాద్‌లోనే ఉంటాం. తక్షణ ఆర్థిక సహాయం అందించడానికి, మృతుల కుటుంబాలకు, ప్రాణాలతో బయటపడిన వారికి ఎయిర్ ఇండియా రూ. 25 లక్షల మధ్యంతర చెల్లింపును చెల్లిస్తుంది” అని ఎయిర్ ఇండియా సీఈఓ కాంబెల్ విల్సన్ అన్నారు.
విద్యా రంగంలో మరో భారీ అడుగు.. తెలంగాణలో కొత్తగా 571 ప్రభుత్వ పాఠశాలలు
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 571 ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి ఐసీసీసీ కేంద్రంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయుల శిక్షణ, ఇతర అవసరాల విషయంలో వ్యయానికి వెనుకాడమని తేల్చిచెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 20 మందికి పైగా విద్యార్థులు ఉన్న చోట్ల కొత్త పాఠశాలలు నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. హైస్కూల్ స్థాయిలోనే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కల్పించాల్సిన అవసరం ఉందని, భవిష్యత్‌లో తాము కోరుకునే రంగాల్లో విజయం సాధించేందుకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే భాషా పరిజ్ఞానం, నైపుణ్యాలు పెంపొందించేలా విద్యా విధానాన్ని తీర్చిదిద్దాలని సూచించారు.
ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు వాయిదా.. కారణం ఏంటంటే?
ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. జూన్ 06 నుంచి 30వ తేదీ వరకు DSC పరీక్షలు కొనసాగుతాయి. అయితే పరీక్షలు రాస్తున్న టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీనికి గల కారణం ఏంటంటే.. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షలను వచ్చే నెల 1, 2 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్పులు చేస్తూమెగా డీఎస్సీ కన్వీనర్ శ్రీ ఎం.వి.కృష్ణారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
విమాన ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి.. ఖర్గే డిమాండ్
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి సరైన పరిహారం అందించాలన్నారు. ఖర్గే అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారిని పరామర్శించారు. ఈ దుఃఖ సమయంలో వారికి సంతాపం తెలిపారు. గాయపడిన వైద్య విద్యార్థులను, ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి విశ్వస్‌కుమార్ రమేష్‌ను కలిశారు.
ఎల్లుండి తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక సమాచారం. రాష్ట్ర ఇంటర్‌బోర్డు (TSBIE) అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదలకు తుది తేదీని ప్రకటించింది. బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించిన ప్రకారం, ఈ నెల 16వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంతకు ముందు మే 22 నుంచి 29వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఫెయిలైన విద్యార్థులతోపాటు తమ మార్కులను మెరుగుపరుచుకోవాలనుకున్న వారు కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం 4.2 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, ఇప్పుడు వారి దృష్టంతా ఫలితాలపై ఉంది. ఇటీవల జోసా కౌన్సెలింగ్, ఈఏపీసెట్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలలో ఇంటర్ మార్కుల ప్రాముఖ్యత పెరిగిన నేపథ్యంలో ఫలితాలపై విద్యార్థులు తీవ్ర ఆతృతతో ఎదురు చూస్తున్నారు.