మెగా లోక్ అదాలత్ను రాష్ట్ర ప్రజలు వినియోగించుకోవాలి..
ఈరోజు జరిగిన ప్రత్యేక టెలికాన్ఫరెన్స్లో అన్ని జిల్లాల ఎస్పీ, సీపీలతో మెగా లోక్ అదాలత్ లో రాజీ పడదగిన కేసులను డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఐపీఎస్ సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగనున్న లోక్ అదాలత్లో అన్ని పోలీస్ స్టేషన్లలో పెండిగ్లో ఉన్న రాజీ పడదగిన కేసులను త్వరిత గతిన పూర్తి చేసి, తగు ఫలితాలు రాబట్టాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ సందర్భంగా డీజీపీ ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా జరుగుతున్న మెగా లోక్ అదాలత్ కోసం ప్రజలలో అవగహన కల్పించాలి అని చెప్పారు. అదే విధంగా రేపు జరగనున్న మెగా లోక్ అదాలత్ నందు ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు. దీనితో పాటు డీజీపీ ఆధీనంలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) నందు కూడా ఈ మెగా లోక్ అదాలత్ ను వినియోగించుకొని కేసులను రాజీ చేయాలని సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల ఎస్పీలతో పాటు రేంజ్ ఐజీలు, ఐజీపీ లీగల్, ADD డీజీపీ, సీఐడీ పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య..
చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. 40 మందికి గాయాలయ్యాయి. మొగలి ఘాట్ రోడ్ దగ్గర బస్సు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.. రెండు లారీలను బస్సు ఢీకొట్టింది. పలమనేర్ నుంచి చిత్తూరు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు పక్క రోడ్లోకి దూసుకెళ్లి 2 లారీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా.. నిన్న కూడా తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. కనుమ దారిలో వస్తున్న కారు, బైకును కంటైనర్ లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ కారుపై పడిపోవడంతో కారులోని నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నన్నెవరు ఏం చేస్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మీరు ఉండకండి
సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ మీటింగ్‌లో బీజేపీ ఇంచార్జీ అభయ్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభయ్ పాటిల్ మాట్లాడుతూ.. మీటింగ్ ప్రారంభానికి ముందే అందరూ ఫోన్లు ఆఫ్ చేయండి లేదా సైలెంట్ మోడ్ లో పెట్టండని, ఎవరికైనా మెసేజ్ కాల్ వస్తే.. నేను బయటకు పంపించేస్తామన్నారు. ఆ తర్వాత బయటకు పంపించానని చెప్పొద్దని, నేను ఒక్కసారే చెబుతానన్నారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చిన సందర్భంలో కొందరిని బయటకు పంపించానని, నన్నెవరు ఏం చేస్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో మీరు ఉండకండి ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత నేను వాళ్ల శిష్యుడిని.. వీళ్ల శిష్యుడిని అని కబుర్లు చెప్పొద్దని, మనమంతా పార్టీ, మోడీ శిష్యులమే అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది మాట్లాడుకునే సమయం కాదు.. పార్టీ సభ్యత్వాలను పెంచుకునే సమయం అని, అందరికీ హిందీ అర్థమవుతుంది కదా.. లేదంటే వారిని బయటకు పంపించేస్తా.. ఆ తర్వాత వారి పరువు పోతుందని అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎట్టకేలకు రష్యా ఆర్మీ చెర నుంచి బయటపడ్డ భారతీయ యువకుడు..
రష్యా – ఉక్రెయిన్ సరిహద్దులో చిక్కుకుపోయిన నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ సూఫీయాన్ (24) ఎట్టకేలకు ఇండియాకు చేరుకున్నారు. గత రెండేళ్లు గా దుబాయ్ హోటల్ లో పని చేస్తున్న సూఫియాన్ తో పాటు మరో నలుగురిని అక్కడి నుండి రష్యా పంపించి నమ్మించి రష్యా భాషలో ఉన్న అగ్రిమెంట్ కాగితాల పైన సంతకాలు చేయించి సైన్యం లో చేర్పించాడు ఏజెంట్. వారి కోసం కుటింబీకులు నానా ప్రయత్నాలు చేశారు. హైదరాబాద్ కు చెందిన హసన్ అనే యువకుడు చనిపోయాడని అతని మృత దేహం కోసం ప్రయత్నిస్తున్నారని వచ్చిన వార్తలు చూసి భయాందోళనకు గురయ్యారు నారాయణపేట కు చెందిన సూఫీయాన్ కుటుంబం. దీంతో రెండు రోజుల క్రితమే మా అబ్బాయి ఫోన్ లో మాట్లాడారని ఇప్పటికైనా దయచేసి సూఫియాన్ ను ఇండియా కు తీసుకురావాలని తల్లిదండ్రులు జహుర్, నసీమ, సోదరుడు సల్మాన్ కోరారు. అధికారుల చొరవతో దీంతో 8 నెలలుగా రష్యా ఆర్మీ చేతిలో బంధీగా ఉన్న సోఫీయాన్ క్షేమంగా ఇండియా కి తిరిగి వచ్చాడు.
బుచ్చిబాబు టోర్నమెంట్ గెలిచిన హైదరాబాద్ క్రికెట్ టీంకి హెచ్‌సీఏ ఆధ్వర్యంలో సన్మానం
ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బుచ్చిబాబు టోర్నమెంట్ ని గెలుపొందిన హైదరాబాద్ క్రికెట్ టీంకి హెచ్ సిఎ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ క్రికెట్ టీం, చెన్నైలో జరిగిన బుచ్చిబాబు టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన సందర్భంగా క్రికెట్ టీం కి 25లక్షల నగతు బహుమతిని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ప్రకటించారు. హెచ్‌సీఏ టీమ్ కి హెడ్ ఆపరేషన్ గా ఉన్న మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై వారికి అభినందనలు తెలియజేశారు… ఈ సందర్భంగా హెచ్ సిఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు మాట్లాడుతూ… రానున్న రోజుల్లో మరిన్ని టోర్నమెంట్ లలో హైదరాబాద్ క్రికెట్ టీం అనేక విజయాలు సాధించి, రంజీ టోర్నమెంట్ లో రాణించాలని అన్నారు… ప్రతి ఐపీఎల్ కి హైదరాబాద్ క్రికెట్ టీం నుండి క్రిసెట్లర్లు సెలెక్ట్ అయ్యే విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కృషిచేస్తుందని జగన్ మోహన్ రావు తెలిపారు… ఈ కార్యక్రమంలో టీమ్ సభ్యులతో పాటు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్ మోహన్ రావు, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
పెళ్లయిన ఐదు రోజులకే గుండెపోటుతో నవ వరుడు మృతి..
చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లయిన 5 రోజులకే గుండెపోటుతో నవ వరుడు మృతి చెందాడు. వి.కోట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లి మృతి చెందాడు. మృతుడు.. కర్ణాటక రాష్ట్రం వెంగసంద్రాకు చెందిన కార్తీక్ (28)గా గుర్తించారు. కర్ణాటక రాష్ట్రం వెంగసందరాకు చెందిన కార్తీక్ కు రామకుప్ప మండలం కొల్లుపల్లి చెందిన భవానితో ఐదు రోజుల క్రితం వివాహం జరిగింది. శుక్రవారం ఐదవరోజు అత్తారింటికి వచ్చిన యువకుడు అనారోగ్యంగా ఉందని.. మధ్యాహ్నం పట్టణంలోని ప్రైవేట్ క్లినిక్ కు చికిత్స నిమిత్తం భార్యతో కలిసి వచ్చాడు. అక్కడ చికిత్స పొందుతూ అతను హఠాత్తుగా మృత్యువాత పడ్డాడు. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ఎదుట, కేజీఎఫ్ బస్టాండ్ ముందు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రజల సమస్యలను ప్రజాపాలన ద్వారా పరిష్కరిస్తున్నాం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి బిఆర్ఎస్ నాయకులు కళ్ళలో నిప్పులు పోసుకుని బ్రతుకుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ ఆమె ములుగులో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జీవితాంతం కెసిఆర్ కుటుంబమే పరిపాలిస్తుందని బిఆర్ఎస్ నాయకులు భ్రమల్లో బతికారని, రాష్ట్రంలో ప్రజలు ప్రజాస్వామికంగా ఆలోచించి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారన్నారు. ప్రజల సమస్యలను ప్రజాపాలన ద్వారా పరిష్కరిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండవ రోజు నుండే కూల్చేస్తాం,కూలగొడతామంటూ అంటూ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్ వల్ల మాటలు నచ్చక వారి ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నారని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇతర పార్టీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లను టిఆర్ఎస్ లో కలుపుకొని ఇతర పార్టీలను లేకుండా చేయాలనుకున్నారని ఆమె మండిపడ్డారు. 10 ఏళ్లు ఇష్టరాజ్యంగా అధికారం అనుభవిస్తూ రాష్ట్రాన్ని తమ ఎస్టేట్ గా చేసుకోవాలనుకున్నారని, ప్రశ్నించే నాయకుల ఫోన్లు టాపింగ్ చేపించి,పోలీస్ వ్యవస్థను వాళ్ళ ఇంటి మనుషుల్లాగా వాడుకున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు హీరోకి టోకరా.. రూ. 45 లక్షలు కొట్టేసిన కేటుగాళ్ళు
ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు చేసే నేరాలు ఒక పట్టాన అంతుచిక్కడం లేదు. చదువుకున్న వాళ్ళు సైతం వారి మాయలో పడి వేలు, లక్షలు పోగొట్టుకుంటున్న వైనం రోజు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి ఒక తెలుగు హీరోకి సైబర్ నేల గాళ్లు వలవిసిరి భారీగా దండుకున్నారు. టాస్కుల పేరుతో ఒక టాలీవుడ్ హీరో నుంచి దాదాపు 45 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు వసూలు చేశారు. యూట్యూబ్లో ఇచ్చిన టాస్కులు పూర్తి చేస్తే డబ్బులు వస్తాయని సైబర్ నేరగాళ్లు హీరోని నమ్మించారు. ఆ టాస్కులు పూర్తిచేసి కొంత డబ్బు రావడంతో మొత్తం 45 లక్షల రూపాయలు ఫైబర్ నేరగాళ్లు చెప్పిన అకౌంట్లలో వేశాడు టాలీవుడ్ హీరో భిష్ణు అధికారి. ఆ డబ్బులు వేసిన తర్వాత కూడా మరిన్ని టాస్కులు ఇచ్చి డబ్బు వెనక్కి వస్తుందని నమ్మబలికే ప్రయత్నం చేశారు. చివరికి 45 లక్షలు మోసపోయానని తెలుసుకొని సైబర్ పోలీసులను భిష్ణు అధికారి ఆశ్రయించారు. ఇక తెలుగులో బిష్ణు అధికారి హీరోగా నటించడంతో పాటు దర్శకుడిగా యాక్షన్ సినిమా తీశారు. ఆ చిత్రమే ‘హిట్ మ్యాన్’. బిష్ణు అధికారి కథానాయకుడిగా 99 సినిమాస్ పతాకంపై రూపొందిన ఈ సినిమా లో అదితి శర్మ, ఆంచల్ శర్మ నాయికలు కాగా దీపక్ అధికారి నిర్మాత. బిష్ణు అధికారి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక స్పై థ్రిల్లర్.
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు హాజరుకావలని కేంద్రమంత్రులకు సీఎం ఆహ్వానం
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమాలకు హాజరుకావాలంటూ.. కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్రసింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, సంజయ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం కార్యక్రమాలకు హాజరుకావాలంటూ నలుగురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం లేఖలు పంపించారు. 1948, సెప్టెంబరు 17న తెలంగాణలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కోరారు.