రైల్వే ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
భారతీయ రైల్వేలు ప్రైవేటీకరించబడదని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టంగా చెప్పారు. ప్రతి ఒక్కరికీ సరసమైన సేవలు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు. ఇటీవల, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఫౌండేషన్ డే కార్యక్రమంలో వైష్ణవ్ మాట్లాడుతూ.. రైల్వే భవిష్యత్తు గురించి చాలా పెద్ద విషయాలు చెప్పారు. రూ.400లోపు ప్రజలు 1000 కిలోమీటర్ల వరకు హాయిగా ప్రయాణించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాబోయే ఐదేళ్లలో రైల్వేలో పూర్తిస్థాయి పరివర్తన ఉంటుందని.. వందే భారత్, నమో భారత్ వంటి రైళ్లు, కవాచ్ రైలు భద్రతా యంత్రాంగం యొక్క విస్తరణ ఈ మార్పుకు దారి తీస్తుందన్నారు. ఇది రైల్వేలో మార్పుల యుగమని మంత్రి పేర్కొన్నారు.
అందుకే దసరా కంటే ముందే నియామకపత్రాలు ఇస్తున్నాం
దసరా ఉత్సవాలకు రెండు రోజుల ముందుగా అక్టోబర్ 9న ఇటీవల నిర్వహించిన డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) పరీక్షలో అర్హత సాధించిన 11,063 మంది అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వనుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన పరీక్షలో ఎంపికైన 1,635 మంది అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్‌లను ఆదివారం పంపిణీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. రెసిడెన్షియల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, 659 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 145 మంది వ్యవసాయ అధికారులు, 64 మంది లైబ్రేరియన్లు సహా 605 మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు నియామక పత్రాలు అందజేశారు.
నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు చిన్నారులు మృతి..
బీహార్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. సోన్ నదిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు పిల్లలు మునిగిపోయారు. వారిలో ఐదుగురు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరు పిల్లల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు.. ప్రమాద ఘటనపై పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతైన ఇద్దరు పిల్లల ఆచూకీ లభించకపోవడంతో SDRF బృందం రంగంలోకి దిగింది.
భారత్ బోణీ.. పాకిస్తాన్ పై గెలుపు
టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా ఉమెన్స్ జట్టు బోణీ కొట్టింది. పాకిస్తాన్ పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 106 పరుగుల లక్ష్యాన్ని 7 బంతులు ఉండగానే చేధించింది. భారత్ బ్యాటింగ్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ క్రీజులో ఉండి జట్టును విజయం వైపు తీసుకెళ్లింది. 29 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. భారత్ బ్యాటింగ్‌లో ఓపెనర్ షఫాలీ వర్మ (32) రాణించింది. జెమిమా రోడ్రిగ్స్ (23) భారత్ విజయం సాధించింది. భారత్ బ్యాటింగ్‌లో స్మృతి మంధాన (7), దీప్తి శర్మ (7) పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలింగ్‌లో ఫాతిమ సనా 2 వికెట్లు తీసింది. సాధియా ఇక్బాల్, సోహైల్ తలో వికెట్ సంపాదించారు.
భారత్‌తో ద్వైపాక్షిక సమావేశాల కోసం వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు..
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారతదేశానికి వచ్చారు. భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక చర్చల కోసం ఆదివారం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ముయిజ్జూ భార్య, మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మహ్మద్ కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ పర్యటనలో ముయిజ్జూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర సీనియర్ అధికారులతో సమావేశమవుతారు.
న్యూఢిల్లీ చేరుకున్న ముయిజ్జూకి కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి కిరిటీ వర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్వు అదికారిక ఆహ్వానం మేరకు ముయిజ్జూ అక్టోబర్ 6-10 మధ్య భారత్‌లో పర్యటించనున్నారు. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(UNGA) సందర్భంగా, ముయిజ్జూ మాట్లాడుతూ.. తాను వీలైనంత త్వరగా భారతదేశాన్ని సందర్శించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. రెండు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కూడా ఉన్నాయని ప్రశంసించారు. అంతకుముందు, జూన్ నెలలో ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో ఆయన ఢిల్లీకి వచ్చారు. ఈ ఏడాదిలో భారత్‌ని సందర్శించడం ఇది రెండోసారి.
హైదరాబాద్‌లో గబ్బు లేపుతున్న పబ్ కల్చర్… పబ్ క్లోజ్ అయ్యాక అమ్మాయిల్ని సప్లై చేస్తున్న వైనం
హైదరాబాద్ నగరం వివిధ మతాలకు, సంస్కృతులకు ప్రతీకగా ఉంది. కానీ, ఇటీవలి కాలంలో పాశ్చాత్య సంస్కృతితో కలుషితం అవుతోంది. ఢిల్లీ, ముంబైలకు పరిమితమైన పబ్ కల్చర్ ఇప్పుడు హైదరాబాద్‌లో వేగంగా విస్తరిస్తోంది. వీకెండ్‌లో నగర యువత పబ్‌లలో నింగి తాకుతూ, మద్యం సేవించి, అర్థనగ్న డాన్సులకు రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో, పబ్ నిర్వాహకులు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. అమ్మాయిలతో డాన్సు షోలు ఏర్పాటు చేసి, ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడం జరుగుతోంది. కొంతకాలం క్రితం కేబీఆర్ పార్క్ వద్ద జరిగిన ఒక ఘటనలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దందా గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.
రుషికొండ పై టూరిజం మంత్రి కీలక వ్యాఖ్యలు..
రుషికొండ పై టూరిజం మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండ నిర్మాణాలు చాలా పెద్దవి.. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడం లేదన్నారు. రుషికొండ కట్టడాలు అవినీతి సామ్రాజ్యానికి సూచికగా మ్యూజియం ఏర్పాటు చేయలేమోనని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే.. పర్యటకులను ఆకర్షించడం కోసం నైట్ లైఫ్ సమయం పెంచామని చెప్పారు. 2025 నుంచి అమలులోకి రానున్న నూతన టూరిజం పాలసీ రూపకల్పన జరుగుతోంది.. నూతన విధానంలో పీపీపీకి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. మరోవైపు.. ఒబరాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో 5 స్టార్ హోటళ్లు నిర్మాణం కోసం ముందుకు వచ్చారు.. రాజధాని అమరావతిలో రెండు ఫైవ్ స్టార్ హోటళ్ల నిర్మాణం జరగనుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణలోని ప్రముఖ పూల పండుగ బతుకమ్మను అరేబియా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసులు ఘనంగా జరుపుకుంటున్నారు. బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించబడుతుండటంతో జెడ్డా వ్యాప్తంగా తెలంగాణ ప్రవాసాంధ్రులలో సంబరా వాతావరణం నెలకొంది. బతుకమ్మ సంబరాలను నిర్వహించడంలో గల్ఫ్ ప్రాంతంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందుంది. గల్ఫ్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (జిడబ్ల్యుసిఎ) ఆధ్వర్యంలో దుబాయ్‌లోని వివిధ సంస్థలు శని, ఆదివారాల్లో ఈ వేడుకను జరుపుకోవడానికి పోటీ పడుతున్నాయి. జువ్వాడి శ్రీనివాస్‌రావు, సలావుద్దీన్, శామ్యూల్, భారతిరెడ్డిలతో కూడిన జీడబ్ల్యూసీఏ బృందం ఏర్పాట్లను పర్యవేక్షించారు. వివిధ రకాల లయబద్ధమైన డప్పు వాయిద్యాలకు పేరుగాంచిన సంప్రదాయ ‘డప్పు’ కళాకారుల బృందాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఐపీఎఫ్ తెలంగాణ చాప్టర్ కూడా పండుగ జరుపుకుంది. ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఈటీసీఏ) కూడా ఆదివారం పండుగను జరుపుకుంది. ఇతర గ్రూపులు , ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు కూడా ఈ వేడుకను జరుపుకున్నాయి.
కుటుంబాన్ని బలితీసుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్.. నలుగురు మృతి
కష్టపడకుండా సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ఎంతో మంది అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలో పీకల్లోతు చిక్కుల్లో చిక్కుకుని చివరికి ప్రాణాలను తీసుకుంటున్నారు. ఆన్‌లైన్ వేదికగా వేదికగా ఎందరో ఆన్‌లైన్ బెట్టింగ్ కాస్తూ, అప్పుల ఊబిలో చిక్కుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు ఓ కుటుంబం బలైంది. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన నాగరాజా రెడ్డి బెట్టింగ్‌లకు పాల్పడి అధిక మొత్తంలో డబ్బులను పోగొట్టుకున్నాడు. అప్పులు కూడా ఎక్కవయ్యాయి. దీంతో.. అప్పుల బాధ భరించలేక రెండ్రోజుల క్రితం (శుక్రవారం) తన కుటుంబంతో కలిసి ఇంట్లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు వారిని చిత్తూరు ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో శుక్రవారం భార్యాభర్తలిద్దరూ మృతి చెందగా.. నిన్న చికిత్స పొందుతూ కుమార్తె సునీత మృతి చెందింది. కొద్దిసేపటి క్రితం చికిత్స పొందుతూ కుమారుడు దినేష్ సైతం మృతి చెందాడు. రెండు రోజుల సమయంలో కుటుంబంలోని నలుగురు మృతి చెందడంతో గ్రామం తీవ్ర విషాదం నెలకొంది.