ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 నుంచి పీవీ సింధు అవుట్..!
ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో రెండు ఒలంపిక్స్ పథకాల విజేత భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోటీ నుంచి నిష్క్రమించింది. నేడు (మే 5) జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో థాయ్‌లాండ్ కు చెందిన వరల్డ్ నంబర్ 8 పోరన్ పావీ చోచువాంగ్ చేతిలో ఓటమి పాలైంది. మొత్తం 78 నిమిషాలు పాటు సాగిన ఆట.. మూడు గేమ్‌ల పాటు సాగిన ఈ ఉత్కంఠభరిత పోరులో సింధు 22-20, 10-21, 18-21తో ఓడిపోయింది. మూడో గేమ్‌లో 15-11తో ముందంజలో ఉన్న సింధు గేమ్‌ను గెలుస్తుందని అనిపించింది. కానీ నిర్ణయాత్మకమైన సమయంలో చేసిన వరుస తప్పిదాలతో విజయం చేజార్చుకుంది.
మాగంటి గోపీనాథ్ ఆరోగ్యంపై హరీష్ రావు క్లారిటీ
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే.. ఈ రోజు కూడా మాగంటి గోపినాథ్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను కుటుంబ సభ్యులు మరోసారి ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే.. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు, ఇతర పలువురు పార్టీ నేతలు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. ప్రస్తుతం గోపీనాథ్ ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్నారని, చికిత్సకు ప్రతిస్పందిస్తున్నారని హరీష్ రావు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ వర్గం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
నాపై తప్పుడు కేసు నమోదు చేశారు.. ఆ సీఐని వదిలి పెట్టను..!
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉందని.. అందుకే వెన్నుపోటు దినం నిర్వహించామని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనం నుంచి అద్బుతమైన స్పందన లభించిందన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వెన్నుపోటు దినం కార్యక్రమం అడ్డుకునేందుకు పోలీసులతో ప్రయత్నించారని.. ఏడాదిగా వైసీపీ నాయకులు, కార్యకర్తలపై వందలాది తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను జైళ్లకు పంపించారని.. ఏడాది పాలన పండగలా నిర్వహించాలని పిలుపునిస్తే పెద్దగా స్పందన రాలేదన్నారు. ఇప్పటికైనా కూటమి నేతలు బుద్ది తెచ్చుకోవాలని.. దోచుకునే బ్యాచ్ కే పండగ. చంద్రబాబు ఇప్పుడైనా తన పాలన గురించి ఆలోచించాలని సూచించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. రెండో ఏడాది పూర్తైన సమయంలో వెన్నుపోటు2 సమయానికి జనం తిరగబడొచ్చని మాజీ మంత్రి తెలిపారు.
తొక్కిసలాట ఘటన.. ఆర్సీబీ యాజమాన్యంపై కేసు నమోదు..
ఆర్సీబీ విజయోత్సవాల వేళ బెంగళూరులో సంభవించిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు విచారణ జరిపింది. ఈ ఘటనపై సుమోటో కేసు నమోదు చేయాలని బెంగళూరు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తొక్కిసలాట ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నిందితులుగా చేర్చారు. మరోవైపు మెజిస్టేరియల్ విచారణలో భాగంగా ఇప్పటికే వారికి అధికారులు నోటీసులను జారీ చేశారు.
ఈ నెలాఖరు లోగా ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు.. ఎజెండా ఇదే..!
వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్య నేతలతో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెలాఖరు లోగా ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు పాలన ఏడాది వైఫల్యాలు, వైఎస్ జగన్ తీసుకొచ్చిన వివిధ కార్యక్రమాలను నిర్వీర్యం చేసిన విధానంపై వివిధ రంగాల ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.. కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.. ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ పోరాటాలకు కొనసాగింపుగా ఈ నెలాఖరిలోగా ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు..
వికారాబాద్‌లో దారుణం.. మైనర్ బాలికపై లైంగిక దాడి..!
వికారాబాద్ జిల్లా దోమ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ళ బాలికపై యువకుడు అత్యాచారయత్నం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారయత్నానికి ఒడిగట్టాడో యువకుడు. బాలిక కేకలు వేయడంతో ఇంటి బయట ఉన్న తండ్రి పరుగెత్తుకు రావడంతో యువకుడు పరారయ్యాడు. దీంతో.. 100 డయల్ ద్వారా పోలీసులకు బాధిత బాలిక తండ్రి సమాచారం అందించాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు.
పోలీసు కస్టడీకి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి..!
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసు కస్టడీకి అప్పగించారు. మూడు రోజులు పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.. 6వ తేదీ ఉదయం నుంచి 8వ తేదీ సాయంత్రం వరకు కస్టడీకి తీసుకోవాలని స్పష్టం చేశారు. కాకాణి తరఫు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని జడ్జి సూచించారు. కాగా.. గత ప్రభుత్వ హయాంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి టన్నుల కొద్ది క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్ అధికారి బాలాజీనాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు వినియోగించారని మైనింగ్ అధికారి పేర్కొన్నారు.. ప్రశ్నించిన గిరిజనులను బెదిరించారన్నారన్నారు. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. ముందస్తు బెయిలు పిటిషన్‌తో పాటు తనపై కేసును కొట్టేయాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఊరట దక్కలేదు. ముందస్తు బెయిలు పిటిషన్ వేసినా ఎదురుదెబ్బే తగిలింది. దీంతో గత రెండు నెలలుగా పరారీలో ఉన్న కాకాణి ఎట్టకేలకు ఇటీవల కేరళలో ఏపీ పోలీసులకు చిక్కారు. తాజాగా కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు కస్టడీకి అప్పగించింది.
మద్యానికి నేను దూరం.. నన్ను లిక్కర్ కేసులో ఇరికించాలని చూస్తున్నారు..
పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాగాలేదని.. ప్రజలను రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మాజీ ప్రభుత్వ విప్, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది కిందట ఎన్నికల సమయంలో ఒక వ్యక్తి ద్వారా ఎనిమిది కోట్లు పట్టుకున్నట్టు తెలిసిందని.. తనిఖీల్లో 8 కోట్ల రూపాయలు దొరికితే, దానికి అన్ని ఆధారాలు సమర్పించారన్నారు. కానీ ఇప్పటివరకు ఆ డబ్బులు విడుదల చేయలేదని.. అది కోర్టులో నడుస్తున్న వ్యవహారం, ఆ డబ్బుకు ఆధారాలు అన్ని ఉన్నాయని తెలిపారు. తాను ప్రభుత్వ విప్ గా ఉన్నప్పుడు గిరి అని తన గన్ మ్యాన్ గా ఉండేవారని.. ఇప్పుడు గన్ మ్యాన్ గిరిని బలవంతంగా విచారిస్తున్నారని ఆరోపించారు. డబ్బులు దొరికింది నాది అని సాక్ష్యం చెప్పాలని బెదిరిస్తున్నారన్నారు.
కేసులో సీజైన గంజాయి అమ్మకం.. తనిఖీల్లో బయటపడ్డ కానిస్టేబుల్ నిర్వాకం
షాద్ నగర్ లో పోలీసులు సాధారణ తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ యువకుడిని అదుపులోకి తీసుకోగా అతని వద్ద కిలోన్నర గంజాయి లభించింది.. తీగ లాగితే డొంక కదిలినట్టు తాండూరు ఎక్సైజ్ కార్యాలయంలో సీజ్ అయిన గంజాయిని బయటికి తీసి ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ దీనిని తన బంధువు ద్వారా విక్రయించేతువు తీసుకు వెళుతుండగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈనెల 4వ తేదీన పట్టణంలోని ఫరూక్ నగర్ యాదవ కాలనీ ఈద్గా వద్ద స్థానిక ఎస్సై దేవరాజ్ వాహనాల తనకి చేస్తుండగా అంజద్ (32) అనే యువకుడు చేతిలో కవర్ తీసుకొని అనుమానాస్పదంగా వెళుతుండగా పోలీసులు అతని వద్ద సోదా చేశారు. చేతి కవర్ లో గంజాయి వాసనను పసిగట్టి ఎస్సై దేవరాజ్ తదితర సిబ్బంది అతని అదుపులోకి తీసుకున్నారనీ సిఐ విజయ్ కుమార్ వెల్లడించారు.